Friday, May 17, 2024

అమ్మ చెంతనే స్వస్థత…సౌఖ్యం!

దేవతలకు దానవులకు మధ్య పరిపాటిగా జరుగుతున్న యుద్ధాలలో ఒకసారి గెలుపు దానవుల రాజైన బలిచక్రవర్తిది అవుతుంది. ఇంద్రుడిని త్రైలోక్యాధిప త్యపు సింహాసనం మీద నుంచి పారద్రోలి తాను ఆ స్థానాన్ని ఆక్రమిస్తాడు బలి చక్రవర్తి.

శా|| ఈలాగింద్రునిఁబాఱఁద్రోలిబలితానేకాతపత్రంబుఁగాఁ
ద్రైలోక్యంబటులేలుచుంగృతమర్త్తపప్రతాపంబుతో
బూలోకాధ్వర భాగముల్గొనుచునంభోజాక్షసంప్రీతిగాఁ
జాలాజన్నములాచరించె గుణియై శాస్త్రోక్తమారంగుబ్నన్‌.
(ధరణి దేవుల రామయ మంత్రి, దశావతార చరిత్రము,
పంచమాధ్యాయం, 29వ పద్యం)

ముల్లోకాలనూ ఏకచత్రాధిపత్యంగా ఏలుతూ, భూలోకంలో నిర్వహంపబడే అన్ని యజ్ఞయాగాలలో దేవతల కోసం సమర్పించబడే #హవిర్భాగాన్ని దేవతలకు బదు లుగా తాను స్వీకరిస్తూ, పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువుకు ప్రీతికలిగే విధంగా శాస్త్రోక్త పద్ధతిలో ఎన్నెన్నో యాగాలను నిర్వహస్తూ బలి చక్రవర్తి పాలించసాగాడు అని పై పద్యం భావం.
దేవతల ఈ దైన్య స్థితి వారి తల్లియైన అదితిని ఎంతగానో కలతకు గురిచేసింది. అసురుల బారి నుండి తన సంతానాన్ని ఎలాగైనా రక్షించుకోవాలనే తలపు ఆమెకు కలిగింది. వెంటనే తపస్సుకు పూనుకుంది. సంగతి తెలుసుకున్న బలి చక్రవర్తి కంగా రుపడి, ఏమి జరుగుతున్నదో తెలుసుకుని రమ్మని తన మనుషులను పంపిస్తాడు. వెళ్ళిన వారు తపస్సులో నిమగ్నమై వున్న అదితిని చూడగా, ఆమె ఇలా కనబడింది వాళ్ళకు.

మ|| చరణాంగుష్ఠమునేలనూఁది భుజము ల్సారించి భూరేణుధూ
సరితానీలజటాభరంబుగుదుల్సంధించిమోమెత్తి యం
బరమున్సూచుచుశ్వాస వాయువుల నిర్బంధించి యత్యంత దు
స్తరమైనట్టి తపంబుసేయునదితిం దర్శించి వేమ్రొక్కుచున్‌.
(దశావతాచరిత్రము, పంచమాధ్యాయం, 36వ పద్యం)

కాలి బొటనవేలును బలంగా ఆపు చేసుకుని నేల మీద నిలబడి, భుజములను చాచి, నేలను తాకుతున్న పొడవైన నల్లని కురులను కుదురుగా బంధించి కట్టి తలను పైకెత్తి ఆకాశం వైపుకు చూస్తూ, శ్వాసను నిర్బంధించి, అత్యంత దుర్భరమైన తపస్సును చేయడంలో నిమగ్నమై వున్న అదితిని చూసి భయంతో ఆమెకు చేతులు జోడించి నమస్కరించారు వారు.

- Advertisement -

చం|| తనువుగృశింపఁజేయునది ధర్మము గాదని పెద్దలాఁడగా
వినివినియుండి యేటికి వివేకము లేక తపంబుసేయఁ బూ
నిన నిను నేమనంగలము నేరము లెంచఁగరాదు గాని యో
జనని యభీష్ట మొందుటకు సాధ్వులకుం బతి భక్తి చాలదే.
(దశావతారచరిత్రము, పంచమాధ్యాయం, 38వ పద్యం)

దైత్యుల మాత అయిన దితి, దేవతల మాత అయిన అదితి అక్కచెల్లెళ్ళు అయిన కారణంగా, అదితి దానవులకు కూడా అమ్మయే. వెంటనే అమ్మచేత ఆ కఠోరమైన తప స్సుమానిపించే ప్రయత్నానికి పూనుకున్నారు వారు. ”శరీరాన్ని ఎండబెట్టుకుంటూ ఏదో సాధించాలని చేసే ప్రయత్నాలలో అంతగా ధర్మం ఉండదని ఒక మాటగా పెద్దలు చెబుతూ ఉండడం మనం వింటూనే ఉన్నాం కదా! అయినా ఈ ప్రయత్నాన్ని చేస్తున్న అమ్మవైన నిన్ను మేము ఏమనగలం? ఇలా అంటున్నందుకు మమ్ములను తప్పు పట్ట వద్దు. తాను కోరుకుంటున్నదాన్ని సాధించడానికి సాధ్వులైన స్త్రీలకు పతి భక్తి ఒక్కటే సరిపోతుంది కదా!” అనే మాటలతో అదితి మనసును కరిగించే ప్రయత్నం వారు చేయడం పై పద్యం భావం.

ఉ|| అమ్మరొ నిన్నుఁ బాసి క్షణమైనను రిక్త గృహంబునందు మే
మెమ్మెయినుండువారమటనెందఱు గల్గిన నీవు లేని గే
#హమ్మదియేలబోదమిపుడాలయసీమకు రమ్ము మా విచా
రమ్ముడిగింపుమింపుగనురక్ష యొనర్పుము దీర్పుమాపదల్‌.
(దశావతార చరిత్రము, పంచమాధ్యాయం, 40వ పద్యం)

”అమ్మా! నీవు లేని ఇంటిలో మేము ఎలా వుండగలం?” ఇంటికి నిండుదనాన్ని ఇచ్చేది అమ్మ. అది దేవతలకైనా, దానవులకైనా సమానమే! ఇంట్లో ఎంతమంది ఉన్నా అమ్మ లేకపోతే ఆ ఇల్లు వెలితిగానే ఉంటుంది. ఆ ఇంట్లో ఉండ బుద్ధికాదు. అందువలన ”అడవిని వదలి ఇంటికి వచ్చి మా విచారాన్ని పోగొట్టి, మమ్ములను రక్షించి, ఆపదల నుంచి కాపాడమని” తమ విన్నపాన్ని ఆలకించమని దీనంగా వేడుకున్నారు.

కం|| రోగి దరిద్రుడు పరదే
శాగతుఁడుందల్లిఁ జూచియానందించు
న్భోగము భాగ్యము రాజ్య
శ్రీగలవారలకువేచెప్పఁగవలెనే.
(దశావతారచరిత్రము, పంచమాధ్యాయం, 41వ పద్యం)

పై రెండు పద్యాలలోని సారాంశం మరింత సూటిగా, సంక్షిప్తీకరించి నిక్షిప్తం చేయ బడింది ఈ పద్యంలో. ‘ఒక జబ్బుపడినవాడు, డబ్బును పోగొట్టుకుని దరిద్రుడైనవా డు, అప్పుడే పరదేశం నుంచి తిరిగి వచ్చినవాడు… వీళ్ళు అమ్మ ముఖంలో ఏమి చూస్తారు? అనే ప్రశ్నకు సమాధానంగా, జబ్బుపడిన వాడు స్వస్థత అనే భోగాన్ని, దరిద్రుడు ధనంతో కూడిన సంపదను, పరదేశం నుంచి వచ్చినవాడు స్వస్థలం లేదా సొంతగడ్డపై కాలుపెట్టడం అనే రాజభోగాన్ని చూస్తారని సూచిస్తూ, ఇంతకంటే ఇంకే మి సౌఖ్యం కావాలో, అసలు కష్టంలో అమ్మ ముఖం చూడడం వలన కలిగే సౌఖ్యం ఏమిటో ఇంతకు మించి చెప్పాల్సింది ఏమైనా వున్నదా?” అని దైత్యుల చేత అనిపిం చా డు ధరణి దేవుల రామయ మంత్రి.
అమ్మ చెంత సంతానం పొందే స్వస్థతను, సౌఖ్యాన్ని గురించి ఇంతకంటే సంక్షిప్తంగా ఇంకేమి చెప్పగలం!

Advertisement

తాజా వార్తలు

Advertisement