Monday, May 20, 2024

ఆకాశరాజు పుత్రికోత్సాహం

పూర్వకాలములో సుధర్ముడనే చంద్రవంశపురాజు వుండే వాడు. ఆ రాజు నారాయణపురము రాజధానిగా రాజ్యమేలు తుండేవాడు. ఆయనకు యిద్దరు కొడుకులు పెద్దకొడుకు ఆకాశరాజు, చిన్నకొడుకు తొండమానుడు, సుధర్ముడు ఆకాశరాజుకు పట్టాభిషేకము చేసి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆకాశరాజు భార్య ధరణీదేవి, వారికి అన్నీ వున్నా సంతాన లేని లోపముండెను. అన్ని రకాల పుణ్యకార్యాలు చేశారు.
ఒకరోజున ఆకాశరాజు తన కులగురువయిన శుకమ#హర్షిని ఆహ్వానించి వారిని ఉచిత రీతిని పూజించాడు. తరువాత సంతాన లేమి తమ దంపతులను ఎంత ఆవేదనకు గురిచేస్తున్నదో తెలియజేశాడు.
అంతా శ్రద్ధగా విని శుకముని ‘రాజా! పూర్వము దశరధుడు చేసిన విధముగా నీవు పుత్రకామేష్టి యజ్ఞము చేయుము. నీ కోరిక నెరవేరు తుందన్నాడు. యజ్ఞానికి ముహూర్తమును కూడా నిర్ణయించాడు.

లక్ష్మీదేవి పుత్రికగా…

ఆకాశరాజు యజ్ఞము చేసే నేలను బంగారు నాలితో దున్న సాగాడు. దున్నుతుండగా నాగలికి ఏదో తగిలినట్లయింది. నేలను తవ్వి చూడగా ఒక పెట్టె కనబడింది. ఆ పెట్టెలో ఒక సహస్ర కమల పుష్పం, ఆ పుష్పము మధ్య అందాల పసిపాప వుంది.
ఇంతలో ఆకాశవాణి ‘ఓ ఆకాశరాజా! నీవు ధన్యుడవు. నీకు పూర్వ జన్మాంతర సుకృతము కలదు, కనుకనే ఈ బిడ్డ నీకు దొరికినది. ఈమెను నీవు పెంచి పెద్దచేయి. నీ వంశము పునీతమగుటకు ఈమెను పెంచ కొన డము కారణమవుతుంది” అని చెప్పింది. అది విన్న ఆకాశరాజుకు అపరిమితమయిన ఆనందము కలిగినది.
నేటికి కదా! నా జన్మ, నా వంశము సార్ధకమయినవని అనుకున్నా డు. చిరునవ్వులు చిందిస్తున్న ఆ పసిపాపను యెత్తుకొని తనివితీరా ముద్దాడాడు. ఆ బిడ్డను ధరణిదేవి చేతికిచ్చి విషయము చెప్పాడు. ఆమె ఆ పాప నెత్తుకొని అవ్యక్తానందాన్ని అనుభవించింది. ధరణీదేవి ఆ బిడ్డ ను తన ప్రాణంగా భావించుకొని పెంచసాగింది. సద్బ్రాహ్మణులను పిలిపించి, వారిని గౌరవించి, బిడ్డకు నామకరణ మహూత్సవ ముహూర్తము పెట్టమంటే వారు ముహూర్తము పెట్టారు. ఆ ముహూర్తమున సహస్ర పత్రకమలములో లభ్యమయిన కారణాన ఆ చిన్నారి పాపకు పద్మావతి అని పేరు పెట్టినది.
లక్ష్మీదేవియే తమ యింట వెలసినట్లుగా భావించి ఆకాశరాజు, ధరణీదేవి ఆనందంతో పొంగిపొర్లుతున్నారు. ఆ పాప బోసి నవ్వులతో వారి హృదయానంద నందనవనములో పువ్వులా అల్లారు ముద్దుగా పెరగసాగింది.
పద్మావతి పూర్వజన్మ వృత్తాంతము

పూర్వకాలంలో వేదవతి అనే అందమయిన కన్య వుండేది. ఆ కన్య అందచందాలను విని ఎందరెందరో రాజులు ఆమెను వివా#హము చేసు కొనుటకు ఆసక్తిగా రావడం, విఫలమై వెళ్ళడం జరుగుతుండేది. వేదవతి ఒక్క శ్రీహరిని తప్ప ఎవ్వరినీ వివా#హము చేసుకోనని భీష్మిం చుకు కూర్చొంది వేదవతి. ఆమెకు తపస్సు యెడల అనురక్తి అంతా ఇంతా కాదు. ఒకనాడు వేదవతి తపస్సు చేస్తుండగా రావణుడు చూడడము జరిగింది. ఆమె అందానికి రావణాసురుడే ఆశ్చర్యపోయి నాడు. చెంతకు వెళ్ళి ‘సుందరాంగీ నేను రావణుడను, పదునాలుగు లోకాలను అవలీలగా జయించిన వాడను, నేను కళ్ళెఱ్ఱజేస్తే సూర్యుడు వేడిమిని తగ్గించి చల్లగా ప్రకాశిస్తాడు. నేను రమ్మనమంటే, వెంటనే వచ్చి చంద్రుడు వెన్నెలను కురిపిస్తాడు. ఇంద్రుడయినా సరే నా ముందు తలవంచవలసినదే. దేవతలందరూ నా సేవకులే. మూడు లోకాలకీ సర్వాధిపతినైన నేనే నిన్ను ప్రేమించుచున్నానన్నచో నీకు గర్వ కారణము కాదా! అందాలరాశివయిన నీకు ఈ కఠిన తపస్సు అవసర మా! నీ యవ్వనము అంతా యీ విధముగా వ్యర్ధము చేసుకోవడము నీకు తగదు. చూస్తూ వూరుకోవడము నాకు తగదు. నా లంకారాజ్యానికి రాణివి కమ్ము!” అన్నాడు. రావణుని మాటలకు వేదవతి ”దశాననా! రావణా! నేను ఒక్క శ్రీహరిని తప్ప యవరినీ వివాహము చేసుకోను. ఆ శ్రీహరి గురించి తపస్సు చేస్తున్నాను. నా కోరిక కాదంటే ప్రాణాలయినా పోగొట్టుకుంటాను’ అని తన దృఢ నిశ్చయాన్ని శాంతంగా చెప్పింది.
అది విన్న రావణుడు హళనగా నవ్వి ‘ఓసి అమాయకురాలా!నీవు ప్రేమించిన విష్ణువు నా పేరు వింటేనే భయముతో గజగజలాడిపోతాడు. అటువంటి అల్పుడిని పెళ్ళాడతానంటావేమిటి?” అన్నాడు. ‘మీరు వేయి చెప్పండి, లక్ష చెప్పండి. నేను విష్ణువును తప్ప ఎవరినీ వివాహము చేసుకోను. దయచేసి మీదారిన మీరు వెళ్ళండి’ అంది.
రావణునికి కోపంతో నన్నే నిరాకరిస్తావా? అంటూ వేదవతిని సమీ పించి పట్టుకోబోయాడు. భయపడిన వేదవతి ‘అన్య కాంతాభిమానీ! కామాంధకారములో నీకు కళ్ళు కనబడుట లేదు ఇష్టము లేని నన్ను కష్టపెట్టి మానభంగము చేయబోతున్నందుకు ఇదే నా శాపాగ్నికి గురి యయ్యెదవుగాక! నేనిదే అగ్నిలో ఆ#హుతియై భస్మమై పోతాను. నీ కారణముగా నాశనమయిపోతున్నాను గనుక నీవూ నీ వంశమూ, ఒక స్త్రీ మూలమున సర్వనాశనమై పోదురుగాక! నా వుసురు ననుభవించి !’ అని శపించి, యోగాగ్నిని తనలో సృష్టించుకొని దగ్ధమైంది.
– డా. చదలవాడ హరిబాబు, 9849500354

Advertisement

తాజా వార్తలు

Advertisement