Saturday, May 18, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 15, శ్లోకం 8
8.
శరీరం యదవాప్నోతి
యచ్చాప్యుత్క్రామతీశ్వర: |
గృహీత్వైతానిసంయాతి
వాయుర్గంధానివాశయాత్‌ ||

తాత్పర్యము : వాయువు గంధమును మోసుకొనపోవునట్లే, జీవుడు ఈ భౌతిక జగమున తన వివిధ భావములను ఒక దేహము నుండి వేరొక దేహమునకు కొనిపోవుచుండును. ఈ విధముగా అతడు ఒక దేమమును గ్రహించి, తిరిగి వేరొక దేహమును పొందుటకై దానిని విడుచుచుండును.

భాష్యము : ఈ శరీరముతో అంతా నశిస్తుంది అనుకోవటం నిజము కాదు. ఇక్కడ ఆత్మ ఒక శరీరము నుండి మరొక శరీరమునకు ఎలా మారుతుందో స్పష్టముగా వివరించబడినది. జీవుడు తనకున్న కొద్దిపాటి స్వేచ్ఛను ఏ విధముగా వినియోగిస్తే అటువంటి చైతన్యమును పెంపొందించుకుంటాడు, మృత్యు సమయములో ఎటువంటి చైతన్యమును కలిగి ఉంటాడో దానిని బట్టి వచ్చే జన్మ ఏ శరీరములో ఇవ్వబడుతుంది అనేది నిర్ణయింపబడుతుంది. దైవ లక్షణాలను కలిగిన చైతన్యము ఉంటే దేవతా శరీరము, జంతువుల చైతన్యము ఉంటే పిల్లులు, కుక్కల శరీరము అలాగే కృష్ణ చైతన్యము కలిగి ఉంటే కృష్ణ లోకమున భక్తుని శరీరము ఇవ్వబడుతుంది.

మరొక వి ధముగా చెప్పవలెనన్న ప్రస్తుత శరీరములో ఉన్నప్పుడు చేసే కార్యముల వలన ఒక రకమైన సూక్ష్మ శరీరము అనగా మనస్సు, బుద్ధి, అహంకారములను పెంపొందించుకొనుటచే అవి ప్రస్తుత భావాలను వచ్చే జన్మకు తీసుకొని పోయి వాటిని పెంపొందించుటకు సహాయం చేస్తాయి. ఇలా ఒక శరీరము నుండి మరొక శరీరమునకు వెళ్తు ఆత్మ, మనస్సుతో జరుపు జీవన పోరాటమునే ‘కర్షతి’ అని ఇక్కడ సంబోధించబడినది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement