Friday, May 17, 2024

శ్రీకాళహస్తీశ్వర శతకం

106. సలిలమ్ముల్ చులుకప్రమాణ మొక పుష్పమ్మున్ భవన్మౌళి ని
శ్చలభక్తిప్రతిపత్తిచే నరుడు పూజల్సేయగా ధన్యుడౌ
నిల గంగాజల చంద్రఖండములచే దానిం దుదింగాంచు నీ
చెలువం బంతయు నీ మహత్త్వ మిదిగా శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా! నరుడు – మానవుడు, నిశ్చల – స్థిరమైన, భక్తిప్రపత్తిచే – భక్తి ప్రపత్తులతో/ శ్రద్ధతో, తాత్పర్యంతో, చులుకప్రమాణము – పుడిసెడు/అరచేతి గుంటలో పట్టే అంత, సలిలమ్ము – నీటితోను, ఒకపుష్పమ్ము – ఒక పూవుతోనూ, భవత్ – మౌళి – నీ శిరస్సును, పూజల్ – చేయగా – పూజించగా, ఇలన్ – ఈ భూమిపై, ధన్యుడు – కాన్ – కృతార్థుడు అవుతాడు, దానిన్ – దాని వలన, (ఆ కొద్ది పుణ్యకార్యం వల్ల), తుదిన్ – చివరకు (జన్మాంతంలో), గంగాజల – గంగనీటితో, చంద్రఖండములచే – చంద్రవంకలతో కూడిన, నీ చెలువంబు – అంతయు – నీ సౌందర్యాన్ని అంతా, కాంచున్ – దర్శిస్తాడు/ పొందుతాడు, ఇదిగా – ఇటు వంటిది కదా, నీ మహత్త్వము – నీ గొప్పతనం/ నీ మాహాత్మ్యం.

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! ఏ మానవుడైనా నిశ్చలమైన భక్తిశ్రద్ధలతో పుడిసెడు నీరు, ఒక్క పువ్వు నీ శిరస్సుపై ఉంచితే ఇహలోకంలో ధన్యు డౌతాడు. ఆ కొద్ది సత్కార్యం వల్ల చివరకు గంగనీటితో, చంద్రకళతో ఉన్న సుందరమైన నీ రూపాన్ని చూడగలుగుతాడు. (లేదా జన్మాంతంలో, అంటే, పరలోకంలో నీ రూపాన్నే తాను పొందుతాడు. ఇదంతా నీ మాహాత్మ్యమే)

విశేషం:
శివపూజ చాల తేలిక. చిత్తశుద్ధి ఉంటే చాలు. చారెడు నీళ్ళు ఒక్క పువ్వుతో సరి. దానికి ప్రతిఫలంగా భూమి మీద జన్మించి నందుకు ధన్యత – అనగా జన్మసాఫల్యం. మానవుడికి జన్మసాఫల్యం అంటే ఏమిటి? ముక్తి మాత్రమే. అందుకే “ తుదిం గాంచున్” అంటే జన్మలకి అంతం, జన్మరాహిత్యం పొందుతాడు. జన్మ లేకపోతే ఏమౌతాడు? శివుడి నెత్తిన నీరు పోసాడు కనుక తానూ గంగాధరు డౌతాడు. నెత్తిన ఒక్కపువ్వు పెట్టిన పుణ్యానికి చంద్రవంకగలవా డౌతాడు. అంటే “సారూప్యం” అనే మోక్షం పొందుతాడు. ఇంత చిన్నపనికి అంత పెద్దఫలితం ఎలా వచ్చింది? అంటే, శివుడి గొప్పతనం ఒక్కటే దానికి కారణం.

డాక్టర్ అనంతలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement