Saturday, May 4, 2024

శ్రీకాళహస్తీశ్వరా శతకం

94.
ఆరావంబుదయించె( దారకముగానాత్మాభ్రవీధిన్ మహా
కారోకారమకార యుక్తమగు నోంకారాభిధానంబు,
బెన్మారున్విశ్వమనంగ( దన్మహిమచే, నా నాదబిందుల్ సుఖ
శ్రీ రంజిల్ల( గడంగునీవదెసుమీ!శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!, ఆత్మ – అభ్రవీధిన్ – హృదయ మందలిదహరాకాశంలో, మహా – గొప్పది అయిన, అకార – ఉకార – మకార – యుక్తము – అగు – అకార, ఉకార, మమకారాలతో కూడిన, ఓంకార – అభిధానంబు్స ఓంకారం అనే పేరున్న, ఆరావంబు – ధ్వని, తారకము – కాన్ – జగత్తునితరింపచేసేది అయి, ఉదయించెన్ – పుట్టింది, తత్ – మహిమ – చేన్ – దాని ప్రభావం చేత, విశ్వము – సర్వజగము, చెన్నారున్ – ప్రకాశిస్తుంది, అనంగన్ – అనేట్టు, ఆ నాద బిందుల్ – ఆ నాదం, దాని ఉత్పత్తి స్థానమైన బిందువును, సుఖశ్రీ – సుఖం అనే సంపదచే, రంజిల్ల – ప్రకాశించగా, కడంగున్ – పూనుకొనును, నీవు – నువ్వు, అది – ఎ – సుమీ – ఆ ప్రణవమే సుమా!

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా!హృదయ మందలిదహరాకాశంలో అకార, ఉకార, మకారాల తో కూడిన ‘ఓం’కారం అనే పేరుకలగొప్పధ్వనిజగత్తునితరింపచేయటానికి పుట్టింది. దాని ప్రభావం చేతనే జగత్తంతా ఉంది. ఆ నాదం దాని ఉత్పత్తి స్థానమైన బిందువు ఆనందం అనే కాంతితో (సంపదతో), ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ఆనందస్వరూపమైన ప్రణవం నీవే కదా!

విశేషం:
64వ పద్యంలో మహదాకాశంలోవిశ్వకారణమైన ఓంకారం ఉత్పత్తిని గురించి తెలియ చేశాడు. ఈ పద్యంలో దహరాకాశంలో పుట్టిన ఓంకారం గురించిన వివరణ కొద్దిగా ఉంది. రెండూ అ, ఉ, మ అనే ధ్వనుల కలయికయే. రెండూ జగత్తునితరింపచేసేవే. శివుడు ప్రణవస్వరూపుడు కదా!

డాక్టర్ అనంతలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement