Monday, April 29, 2024

శ్రీకాళహస్తీశ్వరా శతకం

78. మొదలన్జేసినవారి ధర్మములు నిర్మూలంబుగాజేసి దు
ర్మదులైయిప్పటివారధర్మములొనర్పందమ్ముదైవంబు న
వ్వదె? రానున్న దురాత్ములెల్ల( దమత్రోవంబోవరే? యేల చే
సెదరోమీదుదలంచిచూడకథముల్శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!, ఇప్పటివారు – నేటి మానవులు, మొదలన్ – పూర్వం, చేసినవారి – ఏర్పరచిన / ఆచరించిన వారి, ధర్మములు – మహాత్ముల ధర్మాలని, నిర్మూలంబుగాన్ – చేసి – నాశమొనర్చి, దుర్మదులు – ఐ – గర్విష్ఠులై, అధర్మములు – ధర్మవిరుద్ధమైనవి / చెడ్డపనులు, ఒనర్పన్ – చేయగా, తమ్ము – అటువంటి వారిని చూసి, దైవంబు – పరమాత్మ, నవ్వదు – ఎ – నవ్విపోడా?, రానున్న – పుట్ట బోయే, దురాత్ములు – ఎల్లన్ – దుశ్చింతకలవారు అందరూ, తమతో – ఆ దుర్మార్గుల యొక్క, త్రోవన్ – దారిలోనే, పోవరు – ఏ – నడవరా?, అధముల్ – నీచులు, మీదు – రాబోయేకాలం గురించి, తలంచి చూడక – ఆలోచించక, ఏల – ఎందుకు, చేసెదరు – ఓ – చేస్తారో?

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా!పూర్వులుతామాచారించి, నిరూపించిన ధర్మాలని నాశం చేసి, ఇప్పటివారు గర్వంతో అధర్మాలు చేస్తుండగా, వారిని చూసి దైవం నవ్వడా? రాబోయే తరాలలోని దుర్మార్గులందరు అదే దారిని పోరా? నీచులు ముందుచూపు లేక ఎలా ప్రవర్తించగలరో?

విశేషం:
పూర్వులుతామాచరించినదే చెప్పేవారు. తమతో పాటు సమాజానికంతటికి ఉపయోగపడే దానినే ధర్మం అనే వారు. కాని, ఇప్పటివారు తాము అధర్మం ఆచరించి అదే ధర్మం అంటారు. ఇది ముందుతరాల వారికి ఆదర్శం కాదా? తన కాలంవారిపైన మాత్రమే కాక, రాబోయేతరాలవారిపై కుడా ధూర్జటికి ఉన్న ప్రేమకి ఈ పద్యం తార్కాణం.

డాక్టర్ అనంతలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement