Thursday, April 25, 2024

విశాఖకు వన్నెలు – రాజధానికి హంగులు…

విశాఖ మాస్టర్‌ ప్లాన్‌పై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌
పార్లమెంట్‌ సెంట్రల్‌ విస్తా ఆర్కిటెక్చర్‌ భీమాల్‌ పటేల్‌తో చర్చలు
భవనాల ఆకృతులపై సమీక్ష
రహదారుల అభివృద్ధికి కీలక సూచనలు
వందేళ్ల అవసరాలకు సరిపడా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత
అధికారులతో సీఎం జగన్‌ 4 గంటల పాటు సుదీర్ఘ చర్చఅమరావతి, ఆంధ్రప్రభ: పరిపాలనా రాజధానిగా విశాఖలో అతి త్వరలోనే కార్యకలాపాలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. ఇందులో భాగం గా శుక్రవారం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రపంచ ప్రసిద్ద ఆర్కిటెక్చర్‌ భీమాల్‌ పటేల్‌, సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌, విశాఖ జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌, మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీలక్ష్మిలతో సమావేశమై నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించా రు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను సీఎం జగన్‌ ప్రస్తావించారు. ఈమేరకు విశ్వసనీయ సమాచారం ప్రకారం భవిష్యత్‌ రాజధాని ఏ విధంగా ఉండాలనే దానిపై చర్చించారు. విశాఖ మాస్టర్‌ ప్లాన్‌ కోసం పార్లమెంట్‌ సెంట్రల్‌ విస్టా ఆర్కిటెక్చర్‌ భీమాల్‌ పటేల్‌ను ప్రత్యే కంగా పిలిపించారు. ఆయన విశాఖ నగరం ఏ విధంగా ఉండాలనే దానిపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. రాబోయే వంద ఏళ్లకు సరిపడా మౌలిక వసతుల కల్పన ఏ విధంగా ఉండాలనే దానిపై చర్చించారు. విశాఖ రూపురేఖలు సమూలంగా మార్చాలని ఈ సమావేశంలో కీలకంగా చర్చిం చారు. సెక్రటేరియట్‌ బిల్డింగ్‌, రాజ్‌భవన్‌, శాఖా ధిపతులు, ఉద్యోగుల నివాస గృహాలు తదితర అంశాలమీద చర్చించారు. వీటి నిర్మాణాలకు సంబంధించి సీఎం జగన్‌ పలు కీలక సూచనలు కూడా చేసినట్లు తెలిసింది. నిర్ణీత సమయం లోగా ఎంపిక చేసిన డిజైన్లలో నిర్మించి అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు సమాచారం. నగర అభివృద్ధికి సంబం ధించి జీవీఎంసీ కమిషనర్‌ సృజన ఇచ్చిన నివేదికను సీఎంకు అందజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుండి విడిపోయినప్పుడు ఇక్కడ రాజధాని అవసరాలకు సరిపడా భవనాలు లేవన్నారు. ఐదేళ్లపాటు కొనసాగిన ఆ ప్రభుత్వం భవనాలకు పూర్తి హంగులు కల్పించిన దాఖలాలు కూడా కనిపించలేదన్నారు. మౌలిక వసతులు లేక ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అందుకే ఈసారి విశాఖలో ఏర్పాటు చేయబోయే రాజధాని భవనాల్లో అన్ని ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. ఎక్కడా అధికారులకు ఇబ్బంది కలిగే విధంగా ఉండకూడదని స్పష్టంచేశారు. పరిపాలనా రాజధానిగా విశాఖ అతి త్వరలోనే కార్యకలాపాలు సాగించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అంతేకాకుండా ఏ శాఖ ఎక్కడ ఉంటే అనువుగా ఉంటుందనే అంశంపై మరోసారి కసరత్తు చేయాలని పేర్కొన్నారు.
రహదారుల అభివృద్ధి
నగరంలోని అన్ని రహదారులను కలుపుతూ వచ్చే రోడ్లను మరింతగా అభివృద్ధి చేయనున్నారు. వచ్చే 50 ఏళ్లకు సరిపడా అవసరాలకు అనుగుణంగా రోడ్లను అభివృద్ధి చేయాలని సూచించినట్లు తెలిసింది. ఇప్పటికే విశాఖలో వాహనాల రద్దీ పెరిగిందని, పరిపాలనా రాజధాని తరువాత ఈ ట్రాఫిక్‌ మరింతగా పెరిగే అవకాశమున్నందున భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రహదారుల అభివద్ధి చేపట్టాలని సీఎం సూచించినట్లుగా తెలిసింది. అంతేకాకుండా బీచ్‌ రోడ్‌ను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని యుద్ధప్రాతిపదికన సుందరీకరించడం చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. దీనితోపాటు అక్కడి అవసరాలకు అనుగుణంగా పోలవరం నుండి గోదావరి నీటిని తీసుకొచ్చేలా ప్రత్యేక పైప్‌లైన్‌ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, బీచ్‌ కారిడార్‌, మెట్రో రైల్‌ నిర్మాణ పనులు మొదటి ప్రాధాన్యత కింద తీసుకుని పూర్తిచేయాలని ఆదేశించారు. ఇప్పటికే ఎంపిక చేసిన ప్రాంతాల్లో గ్రీనరీని రోడ్లకు ఇరువైపులా ఉండేలా చూడాలని చెప్పారు. మరీ ముఖ్యంగా మురుగునీటి పారుదల వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని సూచించారు. ఇక విశాఖ సముద్ర తీరంలో ఉన్నందున ప్రకృతి విపత్తుల సమయంలో విద్యుత్‌ అంతరాయాలు పరిపాటిగా మారాయని, అండర్‌ గ్రౌండ్‌ కేబులింగ్‌ వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయడం ద్వారా ఆ ఇబ్బందులనుండి తప్పించుకోవచ్చని సూచించారు. ఈ పనిని మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు.
పరిపాలనా రాజధానిపై ప్రత్యేక దృష్టి
ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటినుండి విశాఖపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే అధికారులతో సమీక్షలు, మంత్రులు, ఉన్నతాధికారుల సందర్శనలు విరివిగా జరుగుతున్నాయి. ఇప్పటికే పలు కార్యాలయాలకు సంబంధించి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఇటీవల సీఎం జగన్‌ కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం ప్రారంభోత్సవానికి వెళ్లిన సందర్భంలో కూడా విశాఖ రాజధాని పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, త్వరలోనే విశాఖకు వెళ్లాల్సి ఉంటుందని అధికారులతోను, ప్రజా ప్రతినిధులతోను అన్నట్లుగా తెలిసింది. అది నిజమే అన్నట్లుగా శుక్రవారం ఆయన అధికారులతో ఏకాంతంగా చర్చించడం రాజధాని తరలింపు అంశం ఖాయమని అర్ధమౌతోంది. ఇప్పటికే వచ్చిన వార్తల మేరకు మే 6న రాజధాని తరలింపు ప్రక్రియ ప్రారంభమయ్యేందుకు సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, ఈ తేదీకి కాస్త అటో ఇటుగా రాజధాని తరలింపు ప్రక్రియ జరిగే అవకాశముందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement