Monday, April 29, 2024

పుష్పక విమానం అపహరణ

లంకేశ్వరుడు, మహోదరుడు, ప్రహస్తుడు, మారీచుడు, శుకుడు, సారణుడు, ధూమ్రాక్షుడు అనే ఆరుగురు మంత్రులతో అరివీర భయంకరుడై కైలాసగిరి సమీపించాడు. దశకంఠుని దాడిని గూర్చి యక్ష ప్రముఖులు కుబేరునికి ఉప్పందించారు. కుబేరుడు ఎదురు దాడి చేయమని యక్షులను ఆజ్ఞాపించాడు. అసహాయ శూరులైన యక్ష వీర యోధులు రాక్షస సేనను ఎదుర్కొన్నారు. అసమాన బల పరాక్రమ సంపన్నులైన రాక్షస మంత్రులు ఒక్కొక్కరు వేయిమంది యక్ష వీరులతో విరోచితంగా భీకర పోరాటం సాగించారు. యక్ష శ్రేష్టులు ఒక్కసారిగా దశకంఠుని శర వర్షంలో ముంచివేశారు. మరణించిన యక్ష రాక్షసుల రాకతో యమ లోకంలో సందడి ఆరంభమైంది. యక్ష రాక్షసుల మధ్య జరిగిన సంకుల సమరంలో రాక్షసులదే పైచేయి అయింది.
యక్ష వీరుల నాశనాన్ని తెలుసుకుని కుబేరుడు యోధాను యాధుడైన సంయోధ కంటకుని యుద్ధ రంగానికి పంపాడు. అతడు యుద్ధ రంగంలో ప్రవేశించి, సంరభుడై తన చక్రంతో మారీ చుని దెబ్బతీశాడు. మారీచుడు మూర్చపోయాడు. మారీచుడు వెంటనే తేరుకుని విజృంభించాడు. మారీచుని విజృంభణకు తాళలేక సంయోధ కంటకుడు కాలికి బుద్ధి చెప్పాడు. రాక్షస రాజు అతిమానుష పరాక్రముడై అలకాపురి సింహ ద్వారాన్ని సమీపించాడు. ద్వార పాలకుడైన యక్ష యోధుడు దశ కంఠుని అడ్డగించాడు. ద్వార స్థంభంతో లంకేశ్వరుని మోదాడు. అది అతనిని గాయపరచలేకపోయింది. దశకంఠుడు ఆ ద్వార స్థంభంతోనే మోది యక్షవీరుని చంపాడు. వెంటనే కుబేరుడు అప్రమత్తుడై మణిభద్రుని దశకంఠనిపైకి పురికొల్పాడు.
వీరాధి వీరుడైన మణిభద్రుడు నాలుగువేల మంది యక్ష వీరులతో సర్వాయుధ సంపన్నుడై లంకేశ్వరుని మార్కొన్నాడు. రాక్షసులు మాయా విరుద్ధ శారదులు కదా! వారు రాక్షస మాయను ప్రయోగించారు. ప్రహస్తుడు మున్నగు నలుగురు ఒక్కొక్కరూ వేయిమందిని హతమార్చారు. నాలుగువేల సైన్యం యుద్ధ రంగానికి బలి అయినా మణిభ్రదుడు జంకు గొంకులు లేక ధూమ్రా క్షుని ఎదుర్కొని దెబ్బతీశాడు. దశకంఠుడు మణిభద్రునిపై దాడి చేశాడు. రావణుని పరాక్రమ ధాటిని సహింపలేక మణిభధ్రుడు యుద్ధరంగం నుండి పారిపోయాడు.
కుబేరుడు గదాధరుడై ప్రళయకాల భీకర రూపుడై యుద్ధ రంగంలో ప్రత్యక్షమయ్యాడు. లంకేశ్వరుని క్రూర స్వభావాన్ని దూషిస్తూ అధిక్షేపించాడు. ”పెద్దల మాటలు ధిక్కరించిన వానికి, హితవును గౌరవించడానికి పతనం తప్పదు అన్నాడు. కుబేరుని ధర్మ వాక్యాలను విని రాక్షస మంత్రులు ప్రక్కకు తొలగిపోయారు. కుబేర దశకంఠులు భయంకర రూపులై దంద్వ యుద్ధం చేశారు. ఇరువురు పరస్పర దివ్యాస్త్రాలను ప్రయోగిస్తూ పోరాడారు. దశ కంఠుడు రాక్షస మాయ కల్పించి క్రూర మృగాల రూపంలో పోరాడాడు. దశకంఠుడు గధతో కుబేరుని తల మోదాడు. కుబేరుడు రక్తసిక్త శరీరుడై నేలపడిపోయాడు. దశకంఠుడు విజయ గర్వితుడై పుష్పక విమానాన్ని వశం చేసుకున్నాడు. దివ్య వైభవంతో పుష్పక విమానారూఢుడై సకల దిక్పాలకులను జయించాలనే కోరికతో చతురంగ బలాలతో ముందుకు సాగిపోయాడు. రాక్షస యోధులు దిక్కులు పిక్కటిల్లేటట్లు సింహనాదాలు చేస్తూ, ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ముందడుగు వేశారు.
శాపం -అనుగ్రహం
దశకంఠుడు రెండో సూర్య మండలం వలె భాసిస్తున్న శరవణ వనం చేరుకున్నాడు. హఠాత్తుగా పుష్పక విమానం ఆగిపోయింది. కారణం తెలియక దశకంఠుడు చింతిస్తుండగా శివుని వాహనమైన నందీశ్వరుడు పుష్పక విమానం వద్దకు చేరుకున్నాడు. ”ఈ కొండపై శివుడు విహరిస్తున్నాడు. ఇటువైపు వెళ్ళ తిరిగి పొ”మ్మన్నాడు.
అతని హెచ్చరికను విని లంకేశ్వరుడు మండిపడ్డాడు. ”నీవు చెబుతున్న శివుడు ఎవరు?” అని దశకంఠుడు హుంకరించాడు. నందీశ్వరుని వానర ముఖాన్ని చూసి గేలి చేస్తూ వికృతంగా నవ్వా డు. నందీశ్వరుడు రోషకషాయి నేత్రుడై, ”నా వంటి ముఖం కలిగిన వానరులే రాక్షస నాశనానికి కారణమవుతారు” అని శపించాడు.
దశకంఠుడు నందీశ్వరుని శాప వాక్కులను పట్టించుకొన కుండ, పుష్పక విమాన ప్రయాణానికి అడ్డు వచ్చిందనే కోపంతో కొండను పెకిలించాలి అనుకున్నాడు. అహంకారపూరితుడై కొండ మూలాన్ని భుజాలపై మోపి ఎత్తాడు. రజత్రాది కంపించింది. పరమ శివుడు యోగదృష్టితో చూసి, దశకంఠుని వర్ణించి చెప్పారు. నీ చర్య వల్ల విహారానికి ఆటంకం కలిగిందని శివుడు రౌద్ర రూపు డైనట్లు ఉన్నాడు. త్వరపడుము. అతడు భోళాశంకరుడు, భక్తవత్స లుడు, భక్త పరతంత్రుడు, ఆశ్రిత రక్షణ పరాయణుడు. భక్తితో రుద్రుని ప్రసన్నుని చేసుకొనుము అని ప్రార్థించారు. దశకంఠుడు ఆదిశంకరుని మహిమను గుర్తించి, అనన్య భక్తియుక్తుడై, తదేక చిత్తుడై, దృఢమనస్కుడై పరమ శివుని స్తుతించాడు.
లంకేశ్వరుడు పశ్చాత్తప్తుడై భక్తితో చేసిన స్తుతికి మెచ్చి పరమ శివుడు ప్రత్యక్షమై, రజతగిరి క్రింద పడిపోయి నలిగిపోయిన అతని చేతులకు విముక్తి కలిగించాడు.
”లంకేశ్వరా! లోక భీకర రావంతో అరిచావు. ఇక మీద నీవు రావణుడు అను పేర ప్రఖ్యాతి పొందగలవు” అన్నాడు పరమశివుడు.
రావణుడు పరమ శివుని అనుగ్రహానికి ఆనందించి ”దేవా! దేవ దానవ యక్ష రాక్షస గంధర్వాది దేవ గణాలకు నేను అవధ్యు డను. నాకు దివ్యాస్త్రాన్ని ప్రసాదించాడు. నీవు అహంకార పూరితుడవై దీనిని అనుమానిస్తే, ఇది తిరిగి నన్ను చేరుతుంది” అని హెచ్చరించాడు.

– కె.ఓబులేశు
9052847742

Advertisement

తాజా వార్తలు

Advertisement