Friday, April 26, 2024

ధర్మం – మర్మం : మహాసరస్వతీ దేవి

మహాసరస్వతీ దేవి అవతార అంతరార్థం – పరమార్థం గురించి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ

బ్రహ్మరూపంలో ఉన్న రజోగుణధారి అయిన పరమపురుషుని శక్తి ‘సరస్వతి’. రసముతో కూడినది సరస, సరసము కలది సరస్వతి. రసము అనగా రుచి (కోరిక). కోరికకు మూలం సరస్వతి కావున ఆ కోరికను గెలిచిన నాడే పురుషుడు పూర్ణుడవుతాడు. కోరికను గెలవడానికి కావాల్సిన జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి కావున జ్ఞానసర స్వతిగా వ్యవహరిస్తారు. జ్ఞానమును శ్వేతవర్ణంతో పోలుస్తారు కావున ఈమె ”కుందేందు తుషార హార దవళ” అనగా మల్లె, చంద్రుడు, మంచు వలె తెల్లని అకారము కలదని అర్థం. తెల్లని పద్మముపై ఆసీనురాలై తెల్లని వస్త్రం ధరించి వీణ, పుస్తకం, జపమాల కలిగి ఉంటుంది . జ్ఞానాన్ని ప్రసాదించే విద్యకు ప్రతీక పుస్తకము అలాగే, జ్ఞానంతో కలిగే ఆనందానికి ప్రతీక వీణ. వీణ పలికించే సప్తస్వరములే ఐదు జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి. ఇంద్రియాలను ఆనందింపచేయాలంటే కావాల్సిన జ్ఞానం జపము, తపములతో కలుగుతుంది. జపమాల, పద్మాసనం జపతపాలకు సూచిక. ఈమె బ్రాహ్మీముహూర్తం (సూర్యోదయం కంటే ముందున్న అరుణోదయం) నుండి మధ్యాహ్న కాలం వరకు ఆవిర్భవించిన సమయముగా చెబుతారు. సరస్వతి ప్రకాశమయ రూపము కలిగి ఉంటుంది కావున ఈమెను ‘తార’గా వ్యవహరిస్తారు.

హిరణ్య గర్భ: సమవర్తతాగ్రే
భూతస్య జాత: పతిరేక ఆసీత్‌
సదాధార పృధ్వీం ద్యాముతేమామ్‌
కస్మై దేవాయ హవిషావిధేమ

ఇది హిరణ్యగర్భుడైన బ్రహ్మస్తుతి. విశ్వాధిష్టాత అయిన ఈ హిరణ్యగర్భుని శక్తిని తార లేదా సరస్వతిగా వ్యవహరిస్తారు. ప్రకాశసమయంలో అవతరించిన తల్లి కావున తార అని అంటారు. జ్ఞానానికి, ఆనందానికి, ఉనికికి, సరస్వతి మూలం కావున ఈమెను మూలా నక్షత్రం నాడు ఆరాధిస్తారు.

సరస్వతి దేవికి ఇష్టమైన నైవేద్యం పూర్ణాలు, భక్ష్యాలు, పానకం, నువ్వుండలు.

- Advertisement -

— శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్య..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement