Friday, May 17, 2024

ధర్మం – మర్మం : తులసీ వైభవం (ఆడియోతో…)

శ్రావణ మాసం సందర్భంగా తులసీ వైభవం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

ఇంద్రాది దేవతలు చేత భగవతి అయిన తులసి నిరంతరం సేవించదగినది. ఆ విధంగా సేవించినచో చతుర్వర్గ ఫలమును ప్రసాదించును. స్వర్గలోకమున, మర్త్య లోకమున, పాతాళ లోకమున కూడా తులసి దుర్లభమైనది. తులసి యందు భక్తి కలవారికి ధర్మార్థ కామ మోక్షములు లభించునని పద్మపురాణం ఉత్తరకాండం, ఉత్తరార్ధంలో క్రియాయోగ సారకాండంలో తులసి వైభవంలో వివరించబడినది.

తులసీ కాష్ట సంభూతాం మాలాం వహతి యోనర:
తద్దేహే పాతకం నాస్తి సత్యమేతన్మ యోచ్యతే
తులసీ పత్ర గలితం యస్తోయం శిరసావహేత్‌
గంగాయా: స్నానజం పుణ్యం లభతే నాత్ర సంశయ:

తులసీ కాష్టముతో పూసలు చేసుకొన్న మాలను ధరించిన వారికి దేహమున ఏ పాపము ఉండదు. తులసీ పత్రము నుండి జారిపడుతున్న జలమును శిరస్సును ధరించిన వారు గంగలో స్నానము చేసిన ఫలమును పొందెదరు. గరికతో, అక్షతలతో, పూలతో, నైవేద్యముతో తులసీ వృక్షమును భక్తితో ఆరాధించిన వారు విష్ణువును పూజించిన ఫలితమును పొందెదరు. తులసీ వృక్షమును ఘృతదీపం, ధూపంతో , అక్షతలతో, పూలతో, నైవేద్యంతో ఆరాధించినచో ధర్మార్థకామమోక్షములు లభించును. విడిగా శ్రీమహా విష్ణువు పాదములను సేవించివలసిన పని లేదు. ఏ దోషము లేని ప్రదేశములలో, శ్రీహరికి సంతోషము కలిగిం చునది, దేవతాసమూహాలచే సేవించబడుతున్న తులసిని నాటినచో త్రిలోకనాథుడు, మురారి అయిన శ్రీహరి సంతసించి పరమపదమును ప్రసాదించును. దోషము లేని తులసీ మూలమున ఆచరించిన యజ్ఞము, వ్రతము, పితృదేవతల పూజ, శ్రీహరి ఆరాధన, దానము, ఇంకా ఇతర శుభ కార్యములను ఆచరించినచో అక్షయ ఫలములను ప్రసాదించును.

శ్రీమన్నారాయణునికి ప్రియతమ అయిన తులసి లేకుండా చేసిన సకల ధర్మ కర్మలు వ్యర్థముల వ్వడమే కాక పుండరీకాక్షుడు కూడా సంతసించడు. తీర్థయాత్రా ప్రయాణాలలో పవిత్రమైన తులసిని భక్తి భావంతో దర్శించుకొన్నచో శ్రీహరి అనుగ్రహం వలన యాత్రా ఫలం సిద్ధించును. శ్రీమన్నారాయణుడు పరిమళం గల పుష్పములను(మందార, కుంద, నలినాదులను) విడిచిపెట్టి సద్గుణమైన తులసిని ఉపయోగించినచో సకల పాపములను నశింపచేయగలది కావున శ్రీహరి స్వీకరించును. వాడినది మరియు ఎండిపోయినదని తులసిని భూమి నుండి పెరకి కింద పడవేసినచో తులసీ ప్రియుడైన శ్రీహరి సకల సంపదలను హ రించును. అలాగే తులసి ఉన్న ప్రదేశమున వ్యర్థాలను విడిచినచో శ్రీ హరి వారి సంపదలను, ఆయుష్యమును హరించును.

- Advertisement -

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement