Sunday, May 19, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 16, శ్లోకం 11,12
11.
చింతామపరిమేయాం చ
ప్రలయాంతాముపాశ్రితా: |
కామోపభోగపరమా:
ఏతావదితి నిశ్చితా: ||

12.
ఆశాపాశశతైర్బద్ధా:
కామక్రోధపరాయణా: |
ఈహంతే కామభోగార్థమ్‌
అన్యాయేనార్థసంచయాన్‌ ||

11-12 తాత్పర్యము : ఇంద్రియతృప్తియే మానవుల ముఖ్యావసరమని వారు విశ్వసింతురు. ఆ విధముగా జీవితాంతము వరకును వారి దు:ఖము అపరిమితముగా ఉండును. వేలాది ఆశాపాశములచే బద్ధులై, కామక్రోధములందు మగ్నులై ఇంద్రియభోగము కొరకు వారు అధర్మమార్గము ద్వారా ధనమును గడింతురు.

భాష్యము : దానవులు ఇంద్రియ తృప్తికి మించినది లేదని, అదే జీవిత లక్ష్యమని భావించుదురు. జీవితపు ఆఖరి క్షణము వరకు ఇటువంటి భావన కలిగి ఉండుటచే వారి పథకాలకు అంతు ఉం డదు. భౌతిక ప్రకృతి ఎంతో కఠినమైనదని, వారికి కేటాయించిన సమయము కంటే ఒక్క క్షణము కూడా అధికాముగా ఇక్కడ ఉండలేరని వారు అర్థము చేసుకొనలేరు. కర్మానుసారము వేరొక జన్మ ఉంటుందని నమ్మలేరు. వారికి ఆత్మజ్ఞానము గాని, వారి పూర్వకర్మ ఫలితాల వలన సుఖదు:ఖాలు వచ్చుచున్నవని గాని, పరమాత్మ వారి కార్యాలను గమనించుచున్నాడని గాని విశ్వసించరు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement