Sunday, May 5, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 17, శ్లోకం 5.6
5.
అశాస్త్రవిహితం ఘోరం
తప్యంతే యే తపో జనా: |
దంభాహంకారసంయుక్తా:
కామరాగబలాన్వితా: ||

6.
కర్శయంత: శరీరస్థం
భూతగ్రామమచేతస: |
మాం చైవాంత:శరీరస్థం
తాన్‌ విద్ధ్యాసురనిశ్చయాన్‌ ||

5-6 తాత్పర్యము : శాస్త్ర విహతములు కానటువంటి తీవ్రమగు తపస్సులను దంభాహంకారములతో ఒనరించువారును, కామరాగములచే ప్రేరేపింపబడినవారును, అచేతసులై దేహమును మరియు దేహమునందున్న ప రమాత్మను కూడా కష్టపెట్టువారును అగువారలు అసురులుగా తెలియబడుదురు.

భాష్యము : కొందరు వ్యక్తులు శాస్త్రాలలో తెలియజేయని తపస్సులను, దీక్షలను సృష్టించెదరు. కొందరు వారి వారి ఇష్టానుసారము ఉపవాసములు ఉందురు. ఉదాహరణకు రాజకీయ లబ్ధి కోసము ఆమరణ నిరాహార దీక్షలను చేయుదురు. ఇలాటి ఉపవాసములు శాస్త్రములలో తెలియజేయలేదు. కాబట్టి అటువంటి వాటి వలన ఇతరులను, తమ శరీరములను పీడించుటే కాక, తమలో ఉన్న పరమాత్మకు సైతము ఇబ్బందిని కలిగించెదరు. ఒక్కొక్కసారి అటువంటి వ్యక్తులు మరణించెదరు అటువంటి మనస్తత్త్వము కలిగిన వ్యక్తులను అసురురులని, తత్ఫలితముగా వారు మరల మరల అసుర జీవితాలను గడుపుచూ భగవంతునితో సంబంధానికి నోచుకోరని మనము గత అధ్యాయములో తెలుసుకొని ఉన్నాము. అయితే అదృష్టవశాతత్తు వేదాలపై విశ్వాసాన్ని కలిగించగలిగిన గురువు దొరికితే అటువంటి వారు కూడా మారి చివరకు జీవిత లక్ష్యాన్ని సాధించే అవకాశాన్ని పొందుతారు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement