Monday, May 20, 2024

కుచేలోపాఖ్యానం-2

పరమాత్మ కుచేలుడు యిచ్చిన అటుకులను ఎందుకు స్వీకరించాడు? గత జన్మలో కుచేలుడు ఎంతో భక్తితో భగవంతునికి ఎన్నో సేవలు చేశాడు. ఎన్ని సేవలు చేసినా ఎన్నడూ కూడా తన మనస్సులో ఈ కోరిక తీరితే బాగుండును అని మాత్రం అనుకోలేదు. ఈశ్వరుని సేవ చేయడమే తన జీవితమునకు ధన్యత అని చేశాడు. దానివలన బ్ర#హ్మజ్ఞాని అయ్యాడు. తాను ఇంత దరిద్రంలో ఉన్నా ఈశ్వరుని సేవించి ఐశ్వర్యం పొందాలనే భ్రాంతి కుచేలునికి లేదు. కానీ ఆయన భార్య ఐశ్వర్యం కావాలని అడిగింది. స్వామి మహాభక్తుల కోరిక తీర్చకుండా ఉండలేడు. కుచేలుడు తెల్ల వారు ఝామున లేచి, మరల తనకి వున్న మాసిపోయిన దుస్తులనే ధరించి ”కృష్ణా, నేను వెళ్ళివస్తాను” అని చెప్తే, కృష్ణ పరమాత్మ గడపదాటి బయటకు వచ్చికుచేలునికి వీడ్కోలు చెప్పాడు.
కుచేలుడు తన యింటి దారిపట్టి నడిచి వెళ్ళిపోతూ, ”ఏమి నా భాగ్యం. ఏ పరమాత్మ దర్శనం కొన్ని కోట్లమంది అడుగుతారో అటువంటి వానితో కలిసి నేను కూర్చున్నానా. నేను తెచ్చిన అటుకులు తిన్నాడా.
నా సఖుడిది ఏమి సౌజన్యం. నాకు ఇంతకన్నా జీవితంలో ఏమి భాగ్యం కావాలి?” అని అనుకున్నాడు.
అప్పుడు తన భార్య కృష్ణ పరమాత్మను సంపద అడగమని పంపించిందని గుర్తుకు వచ్చింది. కానీ కృష్ణుడు తన బట్టలను చూసి అయినా తాను మిక్కిలి బీదవానిగా ఉన్నాడని గ్రహిచి సంపదను ఇవ్వవచ్చు కానీ అలా యివ్వలేదు అని అనుకున్నాడు. ఇంత దరిద్రంలో ఉన్నాను కాబట్టి ఆ కృష్ణుడు నాకెప్పుడూ గుర్తు ఉంటున్నాడు. ఒకవేళ ఐశ్వర్యం ఇచ్చేస్తే ఆయనను నేను మరిచిపోయి పాడయిపోతానేమోనని దరిద్రమునే ఉంచి ఆయన నా మనస్సులో ఉండి పోయేటట్లు నాకు వరమును యిచ్చాడు అని అనుకున్నాడు.తన ఇల్లు ఉన్నచోటికి వెళ్ళి చూశాడు.
అక్కడ సూర్యుడు చంద్రుడు ఏకకాలమునందు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అలాంటి సౌధం ఒకటి కనపడింది.
ఆ సౌధమునకు చుట్టుప్రక్కల పెద్ద ఉద్యానవనములు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఎంతోమంది పరిచారికలు అటుఇటూ తిరుగుతున్నారు. ఎక్కడ చూసిన రత్నరాశులు ప్రోగుపడి ఉన్నాయి. ఇటువంటి ఇల్లు ఏ మహాపురుషునిదో. తన పూరి ఇంటి స్థానంలో అంత పెద్ద సౌధం ఎక్కడి నుంచి వచ్చినదా అనుకుని ఆశ్చర్యపోతూ అక్కడ ద్వారం దగ్గర నిలబడ్డాడు. ఈయనను చూడగానే పరిచారికలు గబగబా బయటకు వచ్చి బంగారు పళ్ళెంలో ఆయన కాళ్ళు కడిగి ఆయనను మేళతాళములతో లోపలికి తీసుకువెళ్ళారు.అది తన యిల్లేనని తెలుసుకున్నాడు.
తన భార్య పట్టు వస్త్రములను కట్టుకుని అనేకమైన బంగారు ఆభరణములను ధరించి ఎదురువచ్చిభర్త కాళ్ళకు నమస్కరించి, వారి పూరిల్లు స్వామి కృప వలన ఇలా అయిపోయింది అని చెప్పింది.
కృష్ణ పరమాత్మే అంత ఐశ్వర్యమును యిచ్చాడని చెబితే పొంగిపోయి, ఐశ్వర్యమును అనుభవించినా, మనస్సులు మాత్రం ఎప్పుడూ కృష్ణుడి దగ్గరే పెట్టుకుని హాయిగా గోవింద నామము చెప్పుకుంటూ పరవశించి పోతూయిహము నందు సమస్త ఐశ్వర్యమును అనుభవించి, అంత్యమునందు జ్ఞానము చేత మోక్షసిద్ధిని కుచేలుని భార్య బిడ్డలు పొందారు.
”ఇంత పరమపవిత్రమయిన కుచేలోపాఖ్యానమును ఎవరు వింటున్నారో వారికి గొప్ప ఫలితం చెప్పబడింది.
దరిద్రుడయిన కుచేలుని సంపత్తి కలవానిగా కృష్ణ పరమాత్మ చేసినట్టి ఈ ఆఖ్యానమును ఎవరు వింటారో వాళ్ళందరికీ కృష్ణ పరమాత్మ పాద ముల యందు భక్తి కలిగి, కూడా కీర్తి యశస్సు నిలబడి అంత్యమునందు మో క్షమును లభి స్తుం ది” అని ఈ ఆఖ్యాన మునకు ఫలశ్రుతి చెప్పబడింది..!
కైలాస్‌ నాగేష్‌
(హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ పిఎస్‌)
98490 52956

Advertisement

తాజా వార్తలు

Advertisement