Friday, April 26, 2024

అన్నమయ్య కీర్తనలు : జయల క్ష్మీ

రాగం : లలిత
జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి
ప్రియురాలవై హరికి బెరసితివమ్మ || జయలక్ష్మీ ||

పాలజలనిధిలోని పసనైన మీగడ
మేలిమి తామెరలోని మించు వాసన
నీలవర్ణునురముపై నిండిన నిధానమవై
ఏలేవు లోకములు మమ్మేలవమ్మ || జయలక్ష్మీ ||

చందురుతోడ బుట్టిన సంపదల మెఱుగవో
కందువ బ్రహ్మలగాచే కల్పవల్లివో
అందిన గోవిందునికి అండనే తోడునీడై
వుందానవు మాయింటవే వుండవమ్మ || జయలక్ష్మీ ||

పదియారు వన్నెల బంగారు పతిమ
చెదరని వేదముల చిగురుబోడి
ఎదుట శ్రీవేంకటేశు నిల్లాలవై నీవు
నిధుల నిలిచే తల్లి నీ వారమమ్మ || జయలక్ష్మీ ||

Advertisement

తాజా వార్తలు

Advertisement