Friday, May 17, 2024

అన్నమయ్య కీర్తనలు : అలరచంచలమైన

అలర చంచలమైన ఆత్మలందుండ నీ
అలవాడు సేసె నీ వుయ్యాల
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ
భావంబు దెలిపె నీ వుయ్యాల ||

ఉదయాస్తశైలంబు లొనర కంబములైన
వుడుమండలము మోచె వుయ్యాల
అదన ఆకాశపదము అడ్డదూలం బైన
అఖిలంబు నిండె నీ వుయ్యాల ||

పదిలముగ వేదములు బంగారు చేరులై
పట్టవెరపై తోచె నుయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల
వర్ణింప నరుదాయె వుయ్యాల ||

మేలుకట్లయి మీకు మేఘ మండలమెల్ల
మెరుగునకు మెరుగాయ నుయ్యాల
నీలశైలమువంటి నీ మేనికాంతికి
నిజమైన తొడవాయె వుయ్యాల ||

- Advertisement -

పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ
భామినులు వడినూచు నుయ్యాల
వోలి బ్రహ్మాండములు వొరగునోయని భీతి
నొయ్యనొయ్యన వూచిరుయ్యాల ||

కమలకును భూసతికి కదలు కదలుకు మిమ్ము
కౌగిలింప జేసె నుయ్యాల
అమరాంగనలకు నీ హావ భావ విలాస
మందంద చూపె నీ వుయ్యాల ||

కమలాసనాదులకు కన్నులకు పండుగై
గణుతింప నరుదాయె వుయ్యాల
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు
కడువేడుకై యుండె నుయ్యాల ||

Advertisement

తాజా వార్తలు

Advertisement