Friday, May 10, 2024

Spl Story: రోజులు మారాయి.. కంటెంట్ లేకుంటే ఎంత పెద్ద క‌టౌట్ అయినా ఫ్లాప్!

కంటెంట్ ఉన్నోడి క‌టౌట్ అయినా చాలు.. కానీ, కంటెంట్ లేకుండా ఎంత పెద్ద క‌టౌట్ పెట్టినా ఇప్పుడు ప్లాప్ త‌ప్పేలా లేదు. అవును.. ఇప్పుడు రోజులు మారాయి. ప్ర‌జ‌ల ఆలోచ‌నా విధానంలోనూ చేంజెస్ వ‌చ్చాయి. దీనికంత‌టికీ క‌రోనానే కార‌ణం. ఎందుకంటే లాక్‌డౌన్ కాలంలో ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్లంతా ఓటీటీల్లో వ‌చ్చే అన్ని ర‌కాల మూవీస్‌ని చూశారు. దాంతో చాలామంది డిఫ‌రెంట్ కంటెంట్ ఉన్న మూవీస్‌ని లైక్ చేయ‌డం మొద‌లెట్టారు. కానీ, ఇప్పుడు పాత త‌రం పోక‌డ‌లు, హీరోయిజం టైపు సినిమాలు, నాలుగు పాట‌లు, అయిదు ఫైట్లు.. రొడ్డ కొట్టుడు క‌థ ఉంటే ఎవ‌రూ దేక‌డం లేదు. అందుక‌నే ఇప్పుడు వ‌స్తున్న కంటెంట్ లేని సినిమాల‌న్నీ ప్లాప్‌లుగా, డిజాస్ట‌ర్లుగా మిగిలిపోతున్నాయి. నిర్మాత‌లు నెత్తిన త‌డిగుడ్డ వేసుకోవాల్సిన ప‌రిస్థితి దాపురిస్తోంది.

– డిజిట‌ల్ మీడియా, ఆంధ్ర‌ప్ర‌భ‌

కరోనా త‌రువాత సినీ ఇండస్టీలో ప్రతిదీ మారిపోయింది. ఈ మార్పు కెరటం బాలీవుడ్‌ని గ‌ట్టిగానే తాకింది. మ‌హ‌మ్మారి త‌ర్వాత నుంచి ప్రేక్షకులలో సినిమాపై ఉన్నఅభిరుచుల్లో చాలా మార్పు వ‌చ్చింది. క‌రోనా కార‌ణంగా వ‌చ్చిన‌ లాక్డౌన్ లో ప్రజలు దాదాపు రెండేళ్లపాటు ఇంట్లోనే ఉన్నారు.. దీంతో వారికి ఓటీటీ ద‌గ్గ‌రైంది. OTTకి వ్యూయ‌ర్స్ అమాంతంగా పెరిగిపోయారు.. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో ఉన్న దేశీ, విదేశీ సినిమాలు, వెబ్ సిరీస్ ల‌ను చూస్తూ కాల‌క్షేపం చేసేవారు.. దీంతో వారికి సినిమాల‌పై అంచనాలు పెరిగి పోయాయి అనే చెప్ప‌చ్చు. ఓటీటీల కార‌ణంగా వారు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చూడగలిగారు. అలాంటి సినిమాల వల్ల వారి అభిరుచిలో, ప్రాధాన్యతల్లో మార్పు వచ్చింది.

చూసే సినిమా చిన్న సిన‌మానా.. పేద్ద సినిమానా.. అని ప్రేక్ష‌కులు ఇప్పుడు అలోచించ‌డంలేదు. పెద్ద స్టార్ హీరో ఉన్నాడ‌నో.. లేదా పెద్ద డైరెక్ట‌ర్ తీసిన సినిమా అని బేధ‌భావం చూపించ‌డంలేదు. మంచి స్క్రిప్ట్ & కంటెంట్ ఉంటే ఆ సినిమా ఎవ‌రిదైనా దాన్ని ఆద‌రిస్తున్నారు ప్ర‌క్షాభిమానులు. ఇటీవలి పెద్ద స్టార్ డ‌మ్ ఉన్న‌ బాలీవుడ్ సినిమాలు బాక్సాఫిస్ వ‌ద్ద బోల్తా ప‌డ‌టానికి కార‌ణం వాటి బలహీనమైన స్క్రిప్ట్, కంటెంట్ వ‌ల‌నే అటున్నారు చూసిన వారు. ప్రస్తుతం హిందీ సినిమాలు చాలా బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాయని చెప్పొచ్చు.

నిజానికి ఈ రోజుల్లో హిందీ చిత్ర పరిశ్రమ ఐసీయూలో ఉందని చెప్పడంలో తప్పులేదు. ఎందుకంటే రిలీజ్ అయిన‌ సినిమాలు వాటి నిర్మాణ ఖ‌ర్చుల‌ను కూడా రిక‌వ‌రీ చేయ‌లేనంత‌గా ఫ్లాప్ అవుతున్నాయి. అయితే, గతంలో కూడా చాలా సినిమాలు హిట్ అయ్యేవి, ఫ్లాప్ అయ్యేవి.. కానీ ఇప్పటి ట్రెండ్ ఆ రోజులకు చాలా భిన్నంగా ఉంది. ఇంతకు ముందు పెద్ద స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఏదో ఒక విదంగా థియేటర్ల‌లో ఆడేవి.. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌కుంటే ఆ సినిమా ఎంత ఎద్ద‌దైనా స‌రే.. వాటి షోలు రద్దు అవుతున్నాయి.

- Advertisement -

ఉదాహరణకు అమీర్ ఖాన్ న‌టించిన‌ లాల్ సింగ్ చడ్డా వైఫల్యానికి చాలా కారణాలున్నాయి. టామ్ ఫారెస్ట్ గంప్ చూసిన ఎవరైనా థియేటర్‌కి వెళ్లి లాల్ సింగ్ చడ్డా ఎందుకు చూస్తారు? ఈ సినిమా కేవలం బ్యాడ్‌గా, బోరింగ్‌గా ఉండటంతో ఫ్లాప్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఆ సినిమాలో అమీర్ ఖాన్ హీరోగా చేస్తున్నంత మాత్రాన అది హిట్ కావడానికి సరిపోదు. ఇప్పుడా రోజులు పోయాయి. అంతే కాక‌, బైకాట్ ట్రెండ్ కారణంగా ఈ సినిమా కూడా చాలా నష్టపోయింది. బైకాట్ ట్రెండ్‌తో ప్రజలు సినిమా చూడటానికి రాలేదు. ఈ సినిమా కలెక్షన్లు అమీర్ మునుపటి సినిమా, థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ మొదటి రోజు కలెక్ష‌న్ ల‌ని కూడా చేరుకోలేకపోయాయి. అంటే.. బైకాట్ ట్రెండ్ కార‌ణంగా లాల్ సింగ్ చడ్డా ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో అంచనా వేయవచ్చు. ఇటీవ‌లే బాలీవుడ్ నుంచి రిలీజ్ అయిన బ్రహ్మ‌స్త్ర‌కి కూడా ఈ బైకాట్ దెబ్బ గ‌ట్టిగానే తాకింది. సినిమా కంటెంట్ లో కూడా కొన్ని లోపాలున్నాయ‌ని చూసిన వారు అంటున్నారు.

అయితే, బాలీవుడ్ మళ్లీ పుంజుకోవాలంటే కంటెంట్, కథపై దృష్టి పెట్టాల్సిందే అంటున్నారు సినీ ప్రేక్ష‌కులు, విశ్లేష‌కులు. బాలీవుడ్‌ని ఐసీయూ నుంచి బయటకు తీసుకురావడానికి ఇది త‌ప్ప‌ వేరే మార్గం లేదు. ప్రేక్షకులకు ఒక సినిమా నచ్చితే ఆ సిన‌మాని ప‌దింత‌లు హిట్ చేస్తారు. లేదంటే 10 రోజులు కూడా థియేట‌ర్ల‌లో ఆ సినిమాని నిలువ‌నియ్య‌రు. ప్రేక్ష‌కుల అభిరుచులు మారాయన‌డానికి ఇవే పెద్ద ఉదాహ‌ర‌ణ‌లుగా చెప్పుకోవ‌చ్చు. ప్ర‌పంచంలో ఎలాంటి సినిమాలు తీస్తున్నారో తెలుసుకున్న ప్రేక్ష‌కులు ఇప్పుడు ప్ర‌పంచ స్థాయి సినిమాల‌ను చూడాల‌నుకుంటున్నారు.

అయితే.. జనాల దగ్గర డబ్బులు లేవని, అందుకే పెద్ద‌ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని చాలా మంది అంటున్నారు. కానీ, ఇది త‌ప్పు అని ఇంకొంత‌మంది కొట్టిప‌డేస్తున్నారు. ప్రేక్ష‌కుల‌కు మంచి నాణ్యత ఉన్న కంటెంట్ ఇస్తే వారు డ‌బ్బు, స‌మ‌యం కేటాయిస్తార‌ని అంటున్నారు. రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన‌ సూర్యవంశీ లాక్డౌన్ తర్వాత విడుదలైంది. ఈ సినిమా మొదటి రోజు 28కోట్ల వసూలు చేసింది. మార్వెల్ మూవీ స్పైడర్‌మ్యాన్ కూడా ప్రేక్షకుల్లో మంచి బ‌జ్‌ క్రియేట్ చేసింది. దాంతో పాటు భూల్ భూలయ్య, గంగూబాయి కతియావాడి & ది కాశ్మీర్ ఫైల్స్ కూడా బాలివుడ్‌కి మంచి హిట్స్‌ అందిచాయి. దక్షిణాది నుంచి కూడా చాలా సినిమాలు పెద్ద ఎత్తున‌ వసూళ్లు రాబట్టాయి. అందుకే థియేటర్లకు వెళ్లేందుకు ప్రేక్షకుల వద్ద డబ్బులు లేవని చెప్పడం క‌రెక్ట్ కాద‌ని వారు అంటున్నారు.

నిజానికి, హిందీ చిత్ర నిర్మాతలు.. క‌రోనా త‌రువాత సినీ ప్రేమికుల్లో వ‌చ్చ‌న మార్పును అర్థం చేసుకోలేక‌పోతున్నారు. వారికి ఏం కావాలో ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. బాలీవుడ్ సినిమాలు ఇప్పుడు కేవ‌లం ఢిల్లీ, ముంబై న‌గరాల్లోనే కాకుండా దేశ‌మంతా చేసేవాళ్లున్నార‌ని అర్థం చేసుకుని ఇక‌నుంచి అయిన మంచి స్క్రిప్ట్ & కంటెంట్ ఉన్న సినిమాల‌ను తీయాల‌ని ప్రేక్ష‌కులు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement