Friday, May 17, 2024

Chandra Mohan : శోక‌సంద్రంలో టాలీవుడ్‌… దిగ్ర్భాంతిలో నేత‌లు

తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు చంద్రమోహన్ శనివారం తుదిశ్వాస విడిచారు. హీరోగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అనేక పాత్రల్లో చంద్రమోహన్​ వెండితెరపై వెలిగారు. తెలుగులో ఒకప్పుడు గొప్ప హీరోయిన్లు వెలిగిన వారంతా తొలుత చంద్రమోహన్‌ సరసన నటించిన వారే. ఆయన పక్కన హీరోయిన్‌గా నటిస్తే తిరుగు ఉండదనే భావన చాలా మంది హీరోయిన్లలో ఉండేది.

అది నిజం కూడా. జయసుధ, జయప్రద మొదలు సుహాసిని వరకు అందరూ తొలినాళ్లలో ఆయన పక్కన నటించినవారే. 1942 మే 23న కృష్ణాజిల్లా పమిడిముక్కలలో జన్మించారు చంద్రమోహన్‌. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్.  932 పైగా సినిమాల్లో నటించిన చంద్రమోహన్‌.. 1966లో రంగులరాట్నం చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఎన్నో విలక్షణమైన పాత్రలతో తెలుగు ప్రజల మనసులో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నారు.

ఈ సినిమాలు సూపర్​..
‘బంగారు పిచుక’, ‘ఆత్మీయులు’, ‘తల్లిదండ్రులు’, ‘బొమ్మబొరుసు’, ‘సీతామాలక్ష్మి’, ‘శంకరాభరణం’,’తాయారమ్మ బంగారయ్య’,’ఇంటింటి రామాయణం’, ‘కొరికలే గుర్రాలైతే’, ‘మంగళ తోరణాలు’ ‘కొత్తనీరు’, ‘సంతోషిమాత వ్రతం’, ‘మూడు ముళ్లు’, ‘చంటబ్బాయ్‌’, ‘శ్రీ షిరిడీ సాయిబాబా మహాత్యం’,’వివాహ భోజనంబు’, ‘త్రినేత్రుడు’, ‘యోగి వేమన’, ‘ఆదిత్య 369’, ‘పెద్దరికం’, ‘గులాబీ’, ‘రాముడొచ్చాడు’,’నిన్నే పెళ్లాడతా’, ‘ప్రేమించుకుందాం రా’, ‘చంద్రలేఖ’, ‘అందరూ హీరోలే’ లాంటి సినిమాల్లో నటించారు.సీనియర్​ నటీనటులతోనే కాకుండా యంగ్​ స్టార్స్​తోనూ చంద్రమోహన్​ స్క్రీన్​ షేర్​ చేసుకున్నారు. తన కెరీర్​లో ఆయన రెండు ఫిలింఫేర్‌, ఆరు నంది అవార్డులు అందుకున్నారు. ‘పదహారేళ్ల వయసు’, ‘సిరి సిరి మువ్వ’ సినిమాల్లో ఆయన నటనకుగాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డులు దక్కాయి. 2005లో ‘అతనొక్కడే’ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. 1987లో ‘చందమామ రావే’ సినిమాకు ఉత్తమ కమెడీయన్‌గా నంది అవార్డు అందుకున్నారు.

చంద్రమోహన్‌ ప్రాధాన్యత ఎనలేనిదని: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య
సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం 9.45 గంటలకు హైదరాబాద్‌లోని అపోలో దవాఖానలో తుదిశ్వాస విడిచారు. ఆయ అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నారు. కాగా, ఆయన మృతిపట్ల మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, జూనియర్‌ ఎన్టీఆర్‌, బాలకృష్ణతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. ప్రముఖ తెలుగు సినీనటులు శ్రీ చంద్రమోహన్ పరమపదించారని తెలిసి ఎంతో విచారించానని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. నాటి చిత్రాలు మొదలుకొని నిన్న మొన్నటి చిత్రాల వరకు నటుడిగా ఆయన ప్రాధాన్యత ఎనలేనిదని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు.

- Advertisement -

సీఎం కేసీఆర్ సంతాపం
ప్రముఖ సినీ నటుడు తెలుగు వెండి తెర తొలితరం కథా నాయకుడు చంద్రమోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. విభిన్నమైన పాత్రలతో, విలక్షణమైన నటనతో, దశాబ్దాలుగా కోట్లాదిమంది ప్రేక్షకులను అలరించిన చంద్రమోహన్ మరణం, తెలుగు చిత్ర సీమకు తీరనిలోటని సీఎం విచారం వ్యక్తం చేశారు. వారి స్పూర్తితో ఎందరో నటీ నటులు ఉన్నత స్థాయికి ఎదిగారని., కళామతల్లి ముద్దుబిడ్డ గా తెలుగుతో పాటు పలు భాషల్లో లక్షలాదిమంది అభిమానాన్ని చంద్రమోహన్ సొంతం చేసుకున్నారని సీఎం తెలిపారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర: ఏపీ సీఎం జగన్‌
ప్రముఖ న‌టుడు చంద్రమోహ‌న్ గారు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ క‌న్ను మూయ‌డం బాధాక‌రమని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయ‌న తెలుగు, త‌మిళ భాషల్లో వంద‌లాది సినిమాల్లో న‌టించి తెలుగు ప్రజ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. చంద్రమోహ‌న్ గారి కుటుంబ స‌భ్యుల‌కు నా ప్రగాఢ సానుభూతి తెలియ‌జేస్తూ, ఆయ‌న ఆత్మకు శాంతి చేకూరాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.

చంద్రమోహన్ మృతి బాధాకరం బాలకృష్ణ
సినీనటుడు చంద్రమోహన్ మృతి పట్ల టీడీపీ ఎమ్మెల్యే, సినీహీరో నందమూరి బాలకృష్ణ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పౌరానిక చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు, తన హాస్యానటనతో తెలుగు ప్రేక్షకులను చంద్రమోహన్ ఆకట్టుకున్నారని గుర్తు చేసుకున్నారు. చంద్రమోహన్ తో పాటు పలు చిత్రాల్లో నటించానని, ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు లోటు అన్నారు. చంద్రమోహన్ ఆత్మకు శాంతికలగాలని భగవంతున్ని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని బాలకృష్ణ తెలిపారు.

చంద్ర మోహన్ మృతిపై చిరంజీవి స్పందన
సిరిసిరిమువ్వ’, ‘శంకరాభరణం’, ‘రాధాకళ్యాణం’, ‘నాకూ పెళ్ళాం కావాలి’ లాంటి అనేక  ఆణిముత్యాల్లాంటి  చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా  తెలుగు  వారి  మనస్సులో చెరగని ముద్ర  వేసిన సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ గారు ఇక లేరని  తెలవడం ఎంతో  విషాదకరం. నా తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ లో  ఒక మూగవాడి పాత్రలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారాయన. ఆ సందర్భంగా ఏర్పడిన మా తొలి పరిచయం, ఆ తర్వాత మంచి స్నేహంగా, మరింత గొప్ప  అనుబంధంగా మారింది. ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవటం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఆయన ఆత్మకి  శాంతి చేకూరాలని కోరుకుంటూ , ఆయన కుటుంబ  సభ్యులకు , అభిమానులకు నా  ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను.

ఆయన అకాల మరణం బాధించింది: ఎన్టీఆర్‌
ఎన్నో దశాబ్దాలుగా చలనచిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పొషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న చంద్రమోహన్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరమని హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ అన్నారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాని, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్దించారు.

విలక్షణ నటుడు చంద్రమోహన్‌: కల్యాణ్‌రామ్‌
విలక్షణ నటుడు చంద్రమోహన్ అకాల మరణం సినిమా జగత్తుకు తీరని లోటని నందమూరి కల్యాణ్‌రామ్‌ అన్నారు. ఆయనతో పలు సినిమాల్లో కలిసి నటించి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

విలక్షణ నటుడు చంద్రమోహన్‌: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న విలక్షణ నటుడు చంద్రమోహన్ అనారోగ్య కారణాలతో కన్నుమూశారని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నాను. కుటుంబ కథా చిత్రాలంటే చంద్రమోహన్ గారే అన్నట్లుగా.. సాగిన వారి నటనా జీవితం, పొందిన అవార్డులు యువ నటీనటులకు ఆదర్శం. ద్రమోహన్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు: నారా లోకేశ్‌
సీనియ‌ర్ న‌టులు చంద్రమోహ‌న్ మృతి బాధాక‌రమని నారా లోకేశ్‌ అన్నారు. హీరోగా, కమెడియ‌న్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు అల‌వోక‌గా పోషించిన ఆయన మ‌ర‌ణం తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్రమ‌కి తీర‌ని లోటు. వారి ఆత్మకి శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్నాని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement