Friday, May 3, 2024

సమ్మర్‌లో వారానికి పెర‌గ‌నున్న విమాన సర్వీస్‌లు

ఈ వేసవిలో దేశీయ విమానయాన సంస్థలు వారానికి 24,275 సర్వీస్‌లు నడపనున్నాయి. మార్చి 31 నుంచి వేసవి షెడ్యూల్‌ ప్రారంభమై అక్టోబర్‌ 26 వరకు కొనసాగనుంది. గత సంవత్సరం ఇదే కాలంలో నడిపించిన సర్వీస్‌ల కంటే ఈ సారి 6 శాతం పెరిగాయి. ప్రస్తుతం మార్చి 30 కొనసాగనున్న వింటర్‌ షెడ్యూల్‌తో పోల్చితే సమ్మర్‌లో కేవలం 2.30 శాతం మాత్రమే సర్వీస్‌లు పెరిగాయని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) తెలిపింది.

ఇండిగో, ఎయిర్‌ ఇండియా, విస్తారా ఈ సారి ఎక్కువ విమాన సర్వీస్‌లను నడిపించనున్నాయి. స్పైస్‌ జెట్‌ మాత్రం వేసవిలో సర్వీస్‌లను వింటర్‌ కంటే తగ్గించుకుంది. దేశీయ విమానయాన సంస్థలు ఈ వేసవిలో 37 దేశాలకు సర్వీస్‌లను నడిపించనున్నాయి. విదేశీ విమానయాన సంస్థలు మన దేశంలోని 27 విమానాశ్రాయాలకు సర్వీస్‌లు నడిపించనున్నాయి. మన దేశ విమానయాన సంస్థలు వారానికి 1,922 అంతర్జాతీయ సర్వీస్‌లు నడిపించనున్నాయి.

గత సమ్మర్‌ కంటే ఇవి 5.1 శాతం ఎక్కువ. ప్రస్తుతం కొనసాగుతున్న వింటర్‌ షెడ్యూల్‌లో 1,892 సర్వీస్‌లు నడుస్తున్నాయి. దీంతో పోల్చితే వేసవిలో 1.6 శాతం సర్వీస్‌లు పెరగనున్నాయి. ఈ మార్చి 28 నుంచి అంతర్జాతీయ సర్వీస్‌లు ప్రారంభించిన అకాశ ఎయిర్‌ ఇంకా వేసవి షెడ్యూల్‌ను డీజీసీఏకి సమర్పించలేదు. దేశంలోని 125 విమానాశ్రయాల నుంచి దేశీయంగా వారానికి 24,275 సర్వీస్‌లు నడుస్తాయని డీజీసీఏ తెలిపింది.

వీటిలో కొత్తగా అజంగఢ్‌, అలీఘర్‌, చిత్రకూట్‌, గోండియా, జల్గావ్‌, మొరాదాబాద్‌, పిథోరఘర్‌ విమానాశ్రయాలు కొత్తవని తెలిపింది. దేశంలో అతి పెద్ద ఎయిర్‌లైన్‌ సంస్థ ఇండిగో వారానికి 13,050 సర్వీస్‌లు నడిపించనుంది. ఈ సారి ఎయిర్‌ ఇండియా వీక్లీ సర్వీస్‌లు 4.59 శాతం పెంచుకుని 2,278 సర్వీస్‌లను నడిపించనుంది. విస్తారా వారానికి 2,324 సర్వీస్‌లు, ఆకాశ ఎయిర్‌ 903 సర్వీస్‌లు నడిపించనుంది.

స్పైస్‌ జెట్‌ మాత్రం 22.28 శాతం తగ్గించుకుని 1,657 సర్వీస్‌లను నడిపించనుంది. అంతర్జాతీయ రూట్లలో వారానికి ఎయిర్‌ ఇండియా 5.1 శాతం పెంచుకుని 455 సర్వీస్‌లను నడిపించనుంది. ఇండిగో 13.5 శాతం పెంచుకుని వారానికి 731 సర్వీస్‌లను నడిపించనుంది. విస్తారా అంతర్జాతీయ సర్వీస్‌లను 50.8 శాతం పెంచి 184 సర్వీస్‌లను నడిపించనుంది. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ 20.8 శాతం పెంచుకుని 371 సర్వీస్‌లు నడిపించనుంది.

- Advertisement -

స్పైస్‌ జెట్‌ అంతర్జాతీయంగా 12.6 శాతం తగ్గించుకుని 174 సర్వీస్‌లు నడిపించనుంది. ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండయా ఎక్స్‌ప్రెస్‌, విస్తారా టాటా గ్రూప్‌లో భాగంగా ఉన్నాయి. విస్తారా త్వరలోనే ఎయిర్‌ ఇండియాలో విలీనం కానుంది. భారతీయ విమానయాన రంగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement