Thursday, May 2, 2024

ఆరంభ లాభాలు ఆవిరి, చివరి గంటలో భారీగా అమ్మకాలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లోంచి.. స్వల్ప నష్టాల్లో ముగిశాయి. మెటల్‌ స్టాక్స్‌ సూచీలను కిందికి లాగేశాయి. మధ్యాహ్నం వరకు కొనుగోళ్ల వైపు పరుగులు పెట్టిన ఇన్వెస్టర్లు.. చివర్లో అమ్మకాలకు తెరలేపడంతో స్వల్ప నష్టాలతో మార్కెట్లు క్లోజ్‌ అయ్యాయి. రోజంతా ఊగిసలాటల మధ్యే సూచీలు కొనసాగాయి. ఉదయం సెన్సెక్స్‌ 54,459.95 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇంట్రాడేలో 54,931.30 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 54,191.55 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 37.78 పాయింట్ల నష్టంతో 54,288.61 పాయింట్ల వద్ద క్లోజ్‌ అయ్యింది. 16,290.95 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైన నిఫ్టీ.. ఇంట్రాడేలో 16,414.70 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,185.75 పాయింట్ల వద్ద కనిష్టాన్ని నమోదు చేసుకుంది. చివరికి 51.45 పాయింట్లు నష్టపోయి.. 16,214.70 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే.. రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.77.54 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతున్నది.

ఫ్లాట్‌గా ముగింపు..

మెటల్‌ రంగంలో పతనం కారణంగా.. సెన్సెక్స్‌ చివరికి ఫ్లాట్‌గా ముగిసింది. వాహన, ఐటీ సెక్టార్లు లాభాలతో ప్రారంభమైనప్పటికీ.. స్వల్పంగా దిగువన ముగిశాయి. మెటల్‌ రంగంలోని జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, హిందాల్కో షేర్ల పతనం కారణంగా నిఫ్టీ మెటల్‌ దాదాపు 8 శాతం నష్టపోయింది. స్టీల్‌ తయారీలో ఉపయోగించే ముడి సరుకులపై ప్రభుత్వం భారీగా ఎగుమతి సుంకాలను విధించింది. ఐరన్‌ ఓర్స్‌, కాన్సంట్రేట్‌ల ఎగుమతిపై పన్నును 30 శాతం నుంచి 50 శాతానికి పెంచింది. ఐరన్‌ పెల్లెట్స్‌పై 45 శాతం సుంకం విధించింది. దీంతో మొత్తం మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి.

ఇన్వెస్టర్లపై ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు..

సెన్సెక్స్‌ 30 సూచీలో మారుతీ, ఎంఅండ్‌ఎం, హెచ్‌యూఎల్‌, ఎల్‌అండ్‌టీ, ఏషియన్‌ పెయిట్స్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, నెస్లే ఇండియా, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టీసీఎస్‌, సన్‌ ఫార్మా, టైటాన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఐటీసీ, పవర్‌ గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, రిలయన్స్‌, ఎస్‌బీఐ షేర్లు నష్టాల్లో ముగిశాయి. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ వివాదం.. దాని పర్యవసనాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో ఇన్వెస్టర్లు, వ్యాపారులు ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వ పాలసీ వార్తల నేపథ్యంలో నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ భారీగా అమ్మకాలను చవిచూడాల్సి వచ్చింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement