Thursday, May 2, 2024

స్థానిక భాష వచ్చిన వారిని తీసుకోండి.. బ్యాంక్‌లకు ఆర్థిక మంత్రి సూచన

బ్యాంక్‌ల్లో కస్టమర్లతో మాట్లాడే విభాగంలో స్థానిక భాష తెలిసిన ఉద్యోగులనే నియమించుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బ్యాంక్‌లకు సూచించారు. ఈ మేరకు బ్యాంక్‌లు సిబ్బందిని సమీక్షించుకోవాలని కోరారు. స్థానిక భాషలు మాట్లాడేవారిని ఫ్రంట్‌ డెస్క్‌ల్లో ఉపయోగించుకుని, మిగిలిన వారిని ఇతర పనులకు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఇండియన్‌ బ్యాంక్‌ అసోసియేషన్‌ ఏజీఎంలో ఆర్థిక మంత్రి పాల్గొన్నారు. దేశంలో అనేక భాషలు మాట్లాడే వారు ఉన్నారని, బ్యాంక్‌లు ఉద్యోగుల రిక్రూట్‌మెంట్‌ సమయంలో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు.

కస్టమర్లతో మాట్లాడే విధానాన్ని కూడా ఉద్యోగులకు నేర్పించాలన్నారు. ఫలానా భాషే మాట్లాడాలని కస్టమర్లపై ఒత్తిడి తీసుకు రావడం సరైందికాదన్నారు. హిందీ మాట్లాడకపోతే వారు భారతీయులే కాదన్నట్లు కొందరు ప్రవర్తిస్తున్నారని, ఇది ఎంత మాత్రం మంచిపద్దతి కాదని ఆమె స్పష్టం చేశారు. స్థానిక భాషలు మాట్లాడే వారికి ఆయా విభాగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పండుగ డిమాండ్‌కు సిద్ధంగా ఉండండి.

రానున్న పండుగల సీజన్‌లో వినియోగదారులు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, వ్యాపారులు పండుగ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఇవన్నీ బ్యాంక్‌ల ద్వారానే జరుగుతాయని ఆర్థిక మంత్రి చెప్పారు. ఈ డిమాండ్‌కు అనుగుణంగా బ్యాంక్‌లు రుణాలు ఇచ్చేందుకు సిద్ధం కావాలని కోరారు. ఎంఎస్‌ఎంఈ బాకీలను ప్రయివేట్‌ కంపెనీలు 45 రోజుల్లో చెల్లించాలని కోరారు. ఎంఎస్‌ఈవీలకు ప్రభుత్వ రంగ సంస్థలు 90 రోజుల్లోగా చెల్లింపులు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలుగా కూడా దీన్ని అనుసరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement