Wednesday, May 8, 2024

Big Story | ఈవీల కోసం ప్రత్యేక సేల్స్‌ నెట్‌వర్క్‌.. టాటా మోటార్స్‌ నిర్ణయం

టాటా మోటార్స్‌ విద్యుత్‌ ప్యాసింజర్‌ వాహనాల కోసం ప్రత్యేక సేల్స్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణ యించింది. ఈవీలు కొనుగోలు చేసే కస్టమర్లుకు ప్రత్యేక అనుభూతిని కలిగించేందుకు ఇది తోడ్పడుతుందని కంపెనీ భావిస్తోంది. కంపెనీ విద్యుత్‌ వాహనాలు ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్న నగరాల్లో ముందుగా ప్రత్యేక డీలర్‌ షోరూమ్‌లను ఏర్పాటు చేస్తామని కంపెనీ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

టాటా నెక్సాన్‌ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ను టాటా మోటార్స్‌ గురువారంనాడు మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. డీజిల్‌, పెట్రోల్‌ కార్ల నుంచి ఈవీ కార్ల అమ్మకాలను వేరు చేయాలని కంపెనీ నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఈ రెండు వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్ల అవసరాలు వేరువేరుగా ఉంటున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈవీ కార్లు కొనుగోలు చేసేవారికి పూర్తి స్థాయి సేవలు అందించేందుకు వీలుగా సేల్స్‌ నెట్‌వర్క్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

కంపెనీ రానున్న రోజుల్లో పెద్ద సంఖ్యలో విద్యుత్‌ కార్లను మార్కెట్‌లోకి తీసుకురానున్నందున ఈవీల కోసం ప్రత్యేక సేల్స్‌నెట్‌ వర్క్‌ అవసరం అవుతుందని కంపెనీ భావించినట్లు టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలేష్‌ చంద్ర తెలిపారు. ముందుగా అమ్మకాలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనే ఈ ఎక్స్‌క్లూజివ్‌ షోరూమ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు.

ప్రస్తుతం టాటా మోటార్స్‌ నెక్సాన్‌, టియాగో, టిగోర్‌, ఎక్స్‌ప్రెస్‌-టీ మోడల్స్‌లో విద్యుత్‌ కార్లను విక్రయిస్తోంది. త్వరలోనే హరియర్‌ ఈవీ, ఆల్ట్రోజ్‌ ఈవీ కార్లు రానున్నాయి. మొత్తం 2024 నాటికి పది మోడల్స్‌లో ఈవీ కార్లను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు టాటా మోటార్స్‌ ప్రకటంచింది. టాటా మోటార్స్‌ కొద్ది రోజుల క్రితమే ఈవీ వాహనాల కోసం ప్రత్యేక లోగోను విడుదల చేసింది.

ప్రస్తుతం కంపెనీ అమ్మకాల్లో విద్యుత్‌ కార్ల వాటా 13-15 శాతం వరకు ఉంది. రానున్న రోజుల్లో కొత్త మోడల్స్‌తో ఈ వాటా గణనీయంగా పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం ఈవీల అమ్మకాల ద్వారా వస్తున్న ఆదాయం 18-20 శాతం ఉందని శైలేష్‌ చంద్ర చెప్పారు. ఇది రానున్న రోజుల్లో 25 శాతానికి చేరుతుందని అంచనా వేసినట్లు చెప్పారు.

మార్కెట్లో నెక్సాన్‌ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌…

టాటా మోటార్స్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ నె క్సాన్‌ ఫేస్‌లిప్ట్‌ను గురువారం నాడు మార్కెట్‌లో తీసుకు వచ్చింది. దీంతో పాటు నెక్సాన్‌ ఫేస్‌లిఫ్ట్‌ ను కూడా విడుదల చేసింది. కొత్త నెక్సాన్‌ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ ధర 14.74 లక్షల నుంచి 19.94 లక్షల రూపాయల మధ్యలో లభిస్తుంది. నెక్సాన్‌ ఫేస్‌లిఫ్ట్‌ ధర 8.09 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ రెండు నెక్సాన్‌ కొత్త ఫేస్‌లిఫ్ట్‌ వెరియంట్స్‌ బుకింగ్స్‌ ప్రారంభించామని, త్వరలోనే డెలివరీలు ఉంటాయని కంపెనీ తెలిపింది.

టాటా నెక్సాన్‌ ఫేస్‌లిఫ్ట్‌ కారును మొత్తం 11 వేరియంట్స్‌లో తీసుకు వచ్చార. క్రియేటివ్‌, క్రియేటివ్‌ ప్లస్‌, క్రియేటివ్‌ ప్లస్‌ ఎస్‌, ఫియర్‌లెస్‌, ఫియర్‌లెస్‌ ఎస్‌, ఫియర్‌ లెస్‌ ప్లస్‌ ఎస్‌, ప్యూర్‌, ప్యూర్‌ ఎస్‌, స్మార్ట్‌, స్మార్ట్‌ ప్లస్‌, స్మార్ట్‌ ప్లస్‌ ఎస్‌ పేరుతో ఈ వేరియంట్లు లభిస్తాయని కంపెనీ తెలిపింది. కొత్త నెక్సాన్‌ పెట్రోల్‌, డీజిల్‌ వెర్షన్లలో లభిస్తుంది.

పెట్రోల్‌ వేరియంట్‌ 5 స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌, 7 స్పీడ్‌ డీసీఏతో వస్తోంది. డీజిల్‌ వేరియంట్‌ 6 స్పీడ్‌ ఎంట, 6 స్పీడ్‌ ఏఎంటీ ఆప్షన్లతో లభిస్తుంది. నెక్సాన్‌ ఫేస్‌లిఫ్ట్‌లో ఎక్స్‌టీరియర్‌ పరంగా చాలా మార్పులు చేశారు. బై ఫంక్షనల్‌ ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్స్‌, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌, రీడీజైన్డ్‌ బంపర్స్‌, 16 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ ఇస్తున్నారు. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ఫ్రంట్‌ పార్కింగ్‌ సెనర్సర్‌తో 360 డిగ్రీల సరౌండ్‌ వ్యూ సిస్టమ్‌ ఉంది. ఇది మొత్తం 6 రంగుల్లో లభిస్తుంది.

నెక్సాన్‌ ఈవీ…

నెక్సాన్‌ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ రెండు బ్యాటరీ వేరియంట్స్‌లో లభిస్తుంది. మిడ్‌ రేంజ్‌లో 30 కిలోవాట్‌ అవర్స్‌ బ్యాటరీ, లాంగ్‌రేంజ్‌ 40.5 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీతో లభిస్తుంది. ఇందులో క్రియేటివ్‌, ఫియర్‌లెస్‌, ఎంపవర్డ్‌ పేరుతో వేర్వేరు ట్రిమ్స్‌ను తీసుకు వచ్చారు. మిండ్‌రేంజ్‌ నెక్సాన్‌ ఈవీ ఒక ఛార్జింగ్‌తో 325 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. లాంగ్‌ రేంజ్‌తో 465 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని టాటా మోటార్స్‌ తెలిపింది.

15ఏ ప్లగ్‌ పాయింట్‌ ఛార్జర్‌తో మిడ్‌రేంజ్‌ బ్యాటరని 10.5 గంటల్లో, లాంగ్‌రేంజ్‌ బ్యాటరీని 15 గంటల్లో ఛార్జ్‌ చేయవచ్చు. ఫాస్ట్‌ ఛార్జర్‌తో 56 నిముషాల్లో వంద శాతం ఛార్జ్‌ చేయవచ్చు. ఈవీలో కూడా 6 ఎయిర్‌ బ్యాగ్‌లు ఇచ్చారు. 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ ఇచ్చారు. ఆటో మ్యాటిక్‌ ఏసీ, వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జర్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌ వంటి ఆధునిక ఫీచర్లు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement