Thursday, May 2, 2024

త్వరలో అదుపులోకి ద్రవ్యోల్బణం : ఆర్బీఐ గవర్నర్‌

ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నాటికి ధరలు క్రమంగా తగ్గే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్బీఐ వరసగా పలు చర్యలు తీసుకుంటుందని శనివారం నాడు ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చెప్పారు. ఈ చర్యలు పటిష్టమైన ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు ఇస్తాయన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్రమంగా సరఫరా వ్యవస్థలు మెరుగుపడుతున్నాయని దీని వల్ల మొదటి త్రైమాసికంలోనే రికవరీ కనిపిస్తుందన్నారు. 2022-23 రెండో త్రైమాసికం నాటికి ధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోసం ఆర్బీఐ పలు చర్యలు తీసుకుంటోందని, దీని వల్ల ధరల స్థిరీకరణ సాధ్యమవుతుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కొలిచే సాధనం ద్రవ్యోల్బణమని ఆయన అభిప్రాయపడ్డారు. సూక్ష్మ ఆర్ధిక పరిస్థితి, ఆర్థిక స్థిరత్వం కొనసాగాలంటే ధరలు నిలకడగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థిక ఫలితాల్లో మార్పులు, ద్రవ్యోల్బణం, వడ్దీ రేట్లు, విదేశీ మారక ద్రవ్యం రేట్లు, చెల్లింపులు వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. పటిష్టమైన ద్రవ్య, ఆర్థిక విధానాల ద్వారా మాత్రమే పేదరికం తగ్గుదల, సాంఘీక సమానత్వం , సుస్థిర వృద్ధి సాధ్యమవుతాయని చెప్పారు.

మన నియంత్రణలో లేని కొన్ని అంశాలు సమీప భవిష్యత్‌లో ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని శక్తికాంత దాస్‌ అభిప్రాయడ్డారు. ద్రవ్య విధానం ద్వారా సకాలంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రపంచీకరణ వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు నష్టాలు, సవాళ్లు కూడా ఎదురవుతాయని చెప్పారు. మానటరి పాలసీ కమిటీ (ఎంపీసీ ) ఏప్రిల్‌, జూన్‌లో జరిపిన సమావేశాల్లో 2022-23లో ద్రవ్యోల్బణం అంచనాలను సవరించిందని చెప్పారు. ఉన్న పరిస్థితులను మేరకు కమిటీ ద్రవ్యోల్బణం 6.7 శాతం ఉండవచ్చని అంచనా వేసిందన్నారు. ఆహార పదార్దాల ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం పెరిగిందని దీంతో ఎంపీసీ కమిటీ వడ్డీ రేట్లను రెండు సార్లు 40, 50 బేసిస్‌ పాయింట్లు పెంచాలని ప్రతిపాదించిందని వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement