Saturday, May 4, 2024

ఆరు నెలల్లో 10 శాతం తగ్గిన స్మార్ట్‌ ఫోన్ల ఎగుమతులు..

మన దేశం నుంచి 2023 సంవత్సరం ముదటి ఆరు నెలల కాలంలో ఎగమతులు 10 శాతం తగ్గాయి. 2022 సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంతో పోల్చుకుంటే ఈ సారి 10 శాతం తగ్గి 64 మిలియన్‌ యూనిట్లు ఎగుమతి అయ్యాయి. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో స్మార్ట్‌ ఫోన్ల ఎగుమతులు 3 శాతం తగ్గి 34 మిలియన్‌ యూనిట్లుగా ఉన్నాయని ఇంటర్నేషనల్‌ డేటా కార్పోరేషన్‌ (ఐడీసీ) తెలిపింది. మార్చి 31తో ముగిసిన త్రైమాసికంతో పోల్చితే మాత్రం ఈ త్రైమాసికంలో ఎగుమతులు 10 శాతం పెరిగాయి.
200 డాలర్ల కంటే తక్కువ ధర ఉన్న స్మార్ట్‌ ఫోన్ల ఎగుమతులు గత సంవత్సరం 70 శాతం ఉంటే, ఈ సారి 65 శాతానికి తగ్గాయి. 200-400 డాలర్ల వరకు ధర ఉన్న ఫోన్ల ఎగుమతులు ప్లాట్‌గా 22 శాతంగానే ఉన్నాయి. మొత్తం ఎగుమతుల్లో 5 శాతంగా ఖరీదైన ఫోన్ల ఎగుమతులు 34 శాతం పెరిగాయి. ఈ ఫోన్ల ధరలు 400 నుంచి 600 డాలర్ల వరకు ఉంటాయి. 600 డాలర్ల కంటే రేటు ఉంటే హై ఎండ్‌ ప్రీమియం స్మార్ట్‌ ఫోన్ల ఎగుమతులు 75 శాతం పెరిగి, మొత్తం ఎగుమతుల్లో 9 శాతానికి చేరాయి.


ప్రీమియం, హై ఎండ్‌ ఫోన్ల అమ్మకాలు పెరుగుతున్నాయని ఐడీసీ తెలిపింది. ప్రధానంగా సులభ వాయిదాల్లో చెల్లించేందుకు అవకాశం ఉండటంతో ఈ ఫోన్ల అమ్మకాలు పెరుగుతున్నాయని తెలిపింది. రానున్న కాలంలో వీటి అమ్మకాలు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నట్లు ఐడీసీ ఇండియా రీసెర్చ్‌ మేనేజర్‌ ఉపాసన జోషీ తెలిపారు. ఈ త్రైమాసికంలో సగటున 366 డాలర్ల ధర ఉన్న 5జీ స్మార్ట్‌ ఫోన్ల ఎగుమతులు 17 మిలియన్లుగా ఉన్నాయి.

- Advertisement -

గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే వీటి ఎగుమతులు 3 శాతం తగ్గాయి. 5జీ ఫోన్ల ఎగుమతుల్లో వివో, ఒన్‌ ప్లస్‌, శామ్‌సంగ్‌ కంపెనీలు మొత్తం ఎగుమతుల్లో 54 శాతం వాటా కలిగి ఉన్నాయి. 5జీ మోడల్‌ ఫోన్లలో అత్యధికంగా ఐఫోన్‌ 13, వన్‌ ప్లస్‌ నోర్డ్‌ సీఈ3 ఫోన్లు ఉన్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా జరుగుతున్న ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 15 శాతం తగ్గాయి. ఆఫ్‌లైన్‌ ద్వారా జరిగే ఎగుమతులు 11 శాతం పెరిగాయి. 54 శాతం స్మార్ట్‌ ఫోన్ల అమ్మకాలు ఆఫ్‌లైన్‌లోనే జరుగుతున్నాయని ఐడీసీ తెలిపింది.

ఆన్‌లైన్‌ ద్వారా జరిగే ఎగుమతులు తగ్గడానికి షావోమీ, రియల్‌ మీ వాటా తగ్గడమే కారణమని పేర్కొంది. జూన్‌ 30 నాటికి జరిగిన ఎగుమతుల్లో అత్యధికంగా వివో 16 శాతం వాటా కలిగి ఉంది. శామ్‌సంగ్‌ ఫోన్లు 15.7 శాతం , రియల్‌ మీ ఫోన్లు 12.6 శాతంగా ఉన్నాయి. ఎగుమతుల్లో యాపిల్‌ ఫోన్ల మార్కెట్‌ వాటా 5.5 శాతంగా ఉన్నాయి. గతం కంటే అత్యధికంగా ఎగుమతులు పెరిగిన వాటిలో పోకో ఫోన్లు 76.5 శాతంతో అగ్రస్థానంలో ఉన్నాయి.

దీని తరువాత 61.1 శాతం వాటాతో యాపిల్‌, ఒన్‌ప్లస్‌ కంపెనీలు ఉన్నాయి. పోకో తీసుకు వచ్చిన కటింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీ ఫోన్ల మూలంగానే గతంలో ఎన్నడూ లేనంత అత్యధికంగా ఎగుమతులు జరిగాయని సంస్థ ఇండియా హెడ్‌ హిమాన్షు టండన్‌ అభిప్రాయపడ్డారు. రానున్న పండుగల సీజన్లను దృష్టిలో పెట్టుకుని కంపెనీ అందుబాటు ధరల్లో భారీగా 5జీ మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకు వచ్చే అవకాశం ఉందని ఐడీసీ డివైస్‌ రిసెర్చ్‌ వింగ్‌కు చెందిన నవకేందర్‌ సింగ్‌ చెప్పారు. ఫ్రీ బుకింగ్‌ ఆఫర్లు, ఇఎంఐలపై వడ్డీ ఆఫర్లు, డిస్కౌంట్లు ఎక్కువగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement