Friday, May 3, 2024

జులైలో తగ్గిన డీజిల్‌, పెట్రోల్‌ ఎగుమతులు

మన దేశం నుంచి జులైలో డీజిల్‌ 11 శాతం, పెట్రోల్‌ ఎగుమతులు 4.5 శాతం తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం వీటి ఎగుమతులపై విండ్‌పాల్‌ పన్ను విధించడం వల్లే ఇవి తగ్గాయని అధికార వర్గాలు వెల్లడించాయి. డీజిల్‌ ఎగుమతులు గత నెలలో 2.45 మిలియన్‌ టన్నులు ఉంటే, జులైలోఇది 2.18 మిలియన్‌ టన్నులకు పడిపోయింది. చమురు మంత్రిత్వ శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ ఎనాలసిస్‌ సెల్‌ (పీపీఏసీ) డేటా ప్రకారం వీటి ఎగుమతులు తగ్గాయి. పెట్రోల్‌ ఎగుమతులు గత జూన్‌లో 1.16 బిలియన్‌ టన్నులు ఉంటే, జులైలో అది 1.1 మిలియన్‌ టన్నులకు తగ్గింది.

కేంద్ర ప్రభుత్వం జులై 1 నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ఎగుమతుల పై విండ్‌పాల్‌ ట్యాక్స్‌ విధించింది. పెట్రోల్‌, ఏవియేషన్‌ టర్బైన్‌ పెట్రోల్‌ లీటర్‌కు 6 రూపాయాలు, డీజిల్‌ పై లీటర్‌కు 13 రూపాయల చొప్పున విండ్‌పాల్‌ ట్యాక్స్‌ విధించింది. ఈ పన్నులను ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తున్నారు. ఆ విధంగా ఇప్పటి వరకు జులై 20, ఆగస్టు 2, ఆగస్టు 19న ఈ పన్ను రేట్లను సమీక్షించారు. ప్రస్తుతం పెట్రోల్‌పై ఈ పన్నును తొలగించారు. ప్రస్తుతం డీజిల్‌పై లీటర్‌కు 7 రూపాయలు, విమాన ఇంధనపై లీటర్‌కు 2 రూపాయల పన్ను వసూలు చేస్తున్నారు.

విండ్‌పాల్‌ పన్ను విధించిన తరువాత పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాలు దేశీయంగా పెరిగాయి. ముఖ్యంగా రిలయన్స్‌, నయారా ఎనర్జీ సంస్థలు వీటిని విదేశాలకు ఎగుమతి చేసి అధిక లాభాలు ఆర్జించాయి. దీని వల్ల దేశంలో డీజిల్‌, పెట్రోల్‌ సరఫరాలు తగ్గి నో స్టాక్‌ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని గమనించిన కేంద్రం ఎగుమతులపై విండ్‌పాల్‌ పన్ను విధించింది.

రష్యాతో పాటు, అంతర్జాతీయ మార్కెట్‌లో తక్కువ రేట్లకే ముడి చమురు కొనుగోలు చేసిన రిలయన్స్‌, నయారా సంస్థలు అధిక రేట్లకు విదేశాలకు ఎగుమతి చేస్తూ వచ్చాయి. మరో వైపు ప్రభుత్వ రంగ సం స్థలు ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ సంస్తలు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నష్టాలతో పెట్రోల్‌, డీజిల్‌ను దేశీయంగానే విక్రయిస్తూ వచ్చాయి. ప్రయివేట్‌ సంస్థలు మాత్రం దేశంలో పరిస్థితిని పట్టించుకోకుండా లాభాల కోసమే విదేశాలకు పెట్రోల్‌, డీజిల్‌ ఎగుమతి చేస్తున్నాయి. జులైలో మన దేశం 4.68 మిలియన్‌ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఇందులో 82 శాతం పెట్రోల్‌, డీజిల్‌, విమాన ఇంధనం ఉన్నాయి. ఈ మూడు కలిపి జులైలో 5,83,000 వేల టన్నుల ఎగుమతులు జరిగాయి. జూన్‌లో ఇవి 5,91,000 టన్నులుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement