Friday, April 19, 2024

Big story : డిగ్రీ పట్టా లేకున్నా ప్రొఫెసర్‌ అవ్వొచ్చు.. బోధించేందుకు వృత్తిలో నైపుణ్యత ఉంటే చాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: త్వరలోనే యూనివర్సిటీ, కళాశాలల్లో ప్రాక్టీస్‌ ప్రొఫెసర్లు రాబోతున్నారు. ఎటువంటి డిగ్రీ పట్టా లేకుండానే యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులకు పాఠాలు బొధించేలా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నూతన విధానాన్ని శ్రీకారం చుడుతోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తోంది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన నిపుణులను ప్రాక్టీస్‌ ప్రొఫెసర్లుగా నిర్ణీత కాలానికి నియమించి వారిచే విద్యార్థులకు పాఠాలను బోధించేలా చర్యలు చేపట్టింది. యూజీసీ నిబంధనల ప్రకారం ప్రొఫెసర్‌ అవ్వడానికి ఎటువంటి డిగ్రీలు, జాతీయ అర్హత పరీక్షలకు రాయాల్సిన అవసరం, కోర్సులను పూర్తి చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. కేవలం అనుభం ఉంటే చాలు. కనీసం 15 సంవత్సరాల అనుభవం తాము చేసే వృత్తిలో ఉండి నైపుణ్యాన్ని ప్రదర్శించే వారు ప్రాక్టీస్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు అర్హులని యూజీసీ పేర్కొంది.
ప్రధానంగా ఇంజనీరింగ్‌, సైన్స్‌, టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, వాణిజ్యం, సామాజిక శాస్త్రాలు, మీడియా, సా#హత్యం, లలిత కళలు, పౌర సేవలు, సాయుధ దళాలు, న్యాయవాద వృత్తి, ప్రజా పరిపాలన వంటి రంగాల్లో విశేష కృషి చేసిన నిపుణులు, దేశంలోని వర్సిటీల్లో పాఠాలు చెప్పడానికి అర్హులుగా ఇటీవల జరిగిన యూజీసీ సమావేశంలో నిర్ణయించినట్లుగా తెలిసింది. అయితే ప్రస్తుతం టీచింగ్‌ ప్రొఫెషన్‌లో ఉన్నవారు లేదా పదవీ విరమణ పొందిన వారికి ఈ అవకాశం ఉండదని స్పష్టం చేసింది.

10 శాతానికి మించకూడదు…

వృత్తిలో అద్భుతమైన ప్రొఫెషనల్‌ ప్రాక్టీస్‌ ఉన్న ఇలాంటి నిపుణులు విద్యార్థులకు బోధించడానికి విద్యార్హతలు ఆటంకం కాకుండా ఉండేందుకు ప్రొఫెసర్‌గా పాఠాలు బోధించేందుకు ఉండాల్సిన అర్హతలను సడలింపులిస్తోంది. వీరిలో ఉన్న ప్రతిభను విద్యార్థులకు చేరేలా తరగతి, ల్యాబుల్లో బోధించనున్నారు. అయితే వృత్తి నైపుణ్యం మాత్రం వీరికి తప్పనిసరిగా ఉండాలని యూజీసీ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.

పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కోర్సులు, పాఠ్యాంశాలను అభివృద్ధి చేయడానికి ప్రాక్టీస్‌ ప్రొఫెసర్లు అవసరంగా యూజీసీ గుర్తించింది. వీరిని ప్రస్తుతం ఒక సంవత్సరం నిర్ణీత కాలవ్యవధికి రిక్రూట్‌మెంట్‌ చేసుకోనున్నారు. ఆతర్వాత నైపుణ్యం ఆధారంగా నాలుగు సంవత్సరాల వరకు వారి సేవలను పొడిగించవచ్చు. అయితే ఈ నియామకాల ప్రభావం విద్యాసంస్థల్లో మంజూరైన పోస్టుల సంఖ్య, రెగ్యులర్‌ ఫ్యాకల్టిdల రిక్రూట్‌మెంట్‌పై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు యూజీసీ స్పష్టం చేసింది. కళాశాలలు, యూనివర్సిటీల్లో ప్రాక్టీస్‌ ప్రొఫెసర్ల సంఖ్య మంజూరైన పోస్టుల్లో 10 శాతానికి మించకూడదని మార్గదర్శకాల్లో పేర్కొంది.

భిన్నవాదనలు…

- Advertisement -

పాఠ్యాంశాల ద్వారానే కాకుండా వృత్తి పరమైన అనుభవాలను తరగతి గదుల్లో బోధించేందుకు ఈ విధానాన్ని యూజీసీ తీసుకొస్తోంది. అలాగే ఉన్నత విద్యా సంస్థల్లో అధ్యాపకుల కొరతను తీర్చేలా ప్రాక్టీస్‌ ప్రొఫెసర్ల విధానాన్ని తీసుకురానుంది. వీళ్ల ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తయారవుతారనేది యూజీసీ ముఖ్య ఉద్ధేశంగా కనిపిస్తోంది. అయితే యూజీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉన్నత విద్య నాణ్యతను ఇది పలుచన చేస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. యూజీసీ తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న పరిశోధకులను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందనే వాదనలూ వినిపిస్తున్నాయి. పరిశోధనల నాణ్యతను పెంపొందించే లక్ష్యంతో, ప్రభుత్వం ఒకవైపు నాణ్యమైన విద్య గురించి చెబుతూనే, మరోవైపు డిగ్రీ లేని ప్రొఫెసర్లను నియమించుకునేందుకు యూజీసీ ముందుకు రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement