Thursday, April 25, 2024

అమలులోకి వాహనాల గ్రీన్‌ట్యాక్స్‌ తగ్గింపు

హెెదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు పాత వాహనాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన హరిత పన్ను (గ్రీన్‌ ట్యాక్స్‌)ను ప్రభుత్వం భారీగా తగ్గించింది. వాహనాలు పాతబడే కొద్దీ వాటి నుంచి వెలువడే కాలుష్యం తీవ్రత పెరుగుతుంది. దీంతో పాత వాహనాల వినియోగాన్ని కట్టడి చేసే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ ట్యాక్స్‌ను విధించింది. తయారీ అనంతరం 15 ఏళ్లు వినియోగించిన భారీ వాహనాలకు గరిష్టంగా రూ.25 వేల వరకు గ్రీన్‌ ట్యాక్స్‌ను విధిస్తున్నారు. రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో లారీ యజమానుల సంఘం ప్రతినిధులు గ్రీన్‌ ట్యాక్స్‌ను ఎత్తివేయాలని మంత్రులకు విజ్ఞప్తి చేశారు.

భారీగా ఉన్న గ్రీన్‌ట్యాక్స్‌ను నామమాత్రపు స్థాయికి తీసుకు వస్తామని మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా 7 నుంచి 15 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాహనాలకు రూ.1500, 15 ఏళ్లు ఆ పైబడి వయసు ఉన్న వాహనాలకు పన్ను రూ.3 వేలుగా నిర్ధారించారు. రాష్ట్రంలో ఐదున్నర లక్షల వరకు వాణిజ్యపరమైన వాహనాలు ఉన్నాయి. వీటిల్లో 70 శాతం వాహనాలు గ్రీన్‌ ట్యాక్స్‌ చెల్లిస్తున్నాయి. మంత్రులు హామీ ఇచ్చిన ప్రకారం గ్రీన్‌ట్యాక్స్‌ను భారీ స్థాయిలో తగ్గింపు అమలులోకి రావడం పట్ల వాహన యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement