Monday, May 6, 2024

బయోపిక్ ఎకానమీ పెరిగింది: ప్రధాని మోదీ…

ఇండియా బయోఎకానమీ ఎనిమిదేళ్లలో ఎనిమిది శాతం వృద్ధిని సాధించిందని ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు. 2014లో పది బిలియన్‌ డాలర్లున్న బయో ఎకానమీ గత ఎనిమిది సంవత్సరాల్లో 8 శాతం వృద్ధిరేటును సాధించిందని, 2022లో 80 బిలియన్‌ డాలర్ల కు పెరిగిందని ప్రధాని మోడీ ప్రకటించారు. దేశంలో మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన బయోటెక్‌ స్టార్లప్‌ ఎక్స్‌ పోను ప్రధాని మోడీ గురువారం ఢిల్లిలో ప్రారంభించారు. బయోటెక్నాలజీ మరియు బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్‌ అసిస్టాన్స్‌ కౌన్సిల్‌ (బిఐఆర్‌ఏసి)ల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్‌ పోను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, బయోఎకానమీలో ఇంతవేగంగా వృద్ధి ని సాధించడం కాకతాళీయంగా జరిగింది కాదని అన్నారు. ఇండియాలోని జీవి వైవిధ్యంతోనే సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు. దేశ జనాభా, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌పై దృష్టి పెట్టడం, బయో ప్రొడక్ట్‌ లకు డిమాండ్‌ పెరగడం కారణంగా ఈ సెక్టార్‌ విజయవంతమైన రికార్డు సాధించిందని ప్రధాని అన్నారు. భారతదేశ నైపుణ్యత పైన, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ప్రొఫెషనల్స్‌పై అంతర్జాతీయస్థాయిలో విశ్వసనీయత పెరిగిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.

కొవిడ్‌ మహమ్మారి ప్రారంభదశలో భారత ప్రభుత్వం బయోసెక్టార్‌ అభివృద్ధికి వేగంగా చర్యలు చేపట్టిందని, వ్యవసాయంతో పాటు సమాన ప్రాధాన్యత కల్పించిందని ప్రధాని వెల్లడించారు. దీంతో, ఇండియాలో వంద ఉన్న స్టార్టప్‌ల సంఖ్య 70వేలకు చేరిందని ప్రధాని ప్రకటించారు. మనదేశంలోని 60 వివిధ రంగాల సెక్టార్లలో ప్రారంభమవుతున్న ప్రతి 14 స్టార్టప్‌ల్లోనూ, ఒకటి బయోటెక్‌ సెక్టార్‌కు చెందినదని ప్రధాని మోడీ అన్నారు. కేవలం గతేడాదిలోనే 1,100 బయోటెక్‌ స్టార్టప్‌ లు ప్రారంభించినట్లు ప్రధాని మోడీ చెప్పారు. ఎనిమిది సంవత్సరాల క్రితం బయోటెక్‌ ఉత్పత్తులు కేవలం పది ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 700లకు పైగా పెరిగిందని ఆయన చెప్పారు. బయోటెక్‌ రంగంలో స్టార్టప్‌ లను ప్రారంభించే ఇన్వెస్టర్ల సంఖ్య 8 రెట్లు పెరిగిందని, పెట్టుబడులు ఏడు రెట్లు పెరిగాయని ప్రధాని వెల్లడించారు. రాబోయే సంవత్సరాల్లో బయోటెక్‌ సెక్టార్‌లో బయో ఫెర్టిలైజర్లు, బయో ఫోర్టిఫైడ్‌ విత్తనాలు, వ్యాక్సిన్స్‌, ఆర్గానికి ఉత్పత్తులు రానున్నాయని ప్రధాని అన్నారు. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపాలనే 10శాతం టార్గెట్‌ను ఇండియా ఇప్పటికే సాధించిందని ఆయన చెప్పారు. 2030 నాటి 30శాతం లక్ష్యం కూడా 2025లోనే సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement