Friday, December 6, 2024

AC cabins in trucks | ట్రక్కుల్లో ఏసీ క్యాబిన్‌ తప్పనిసరి : నితిన్‌ గడ్కరీ

ట్రక్కుల్లో ఏసీ క్యాబిన్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2025 అక్టోబర్‌ 1 తర్వాత తయారు చేయబోయే ట్రక్కుల్లో ఏసీ క్యాబిన్‌ అనివార్యమని తేల్చిచెప్పింది. ఎన్‌2, ఎన్‌3 కేటగిరీ పరిధిలోకి వచ్చే ట్రక్కులకు దీన్ని తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆదివారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. సరకుల రవాణాకు ఉపయోగించే ట్రక్కుల స్థూల బరువు 3.5 టన్నుల నుంచి 12 టన్నుల వరకు ఉంటే అవి ఎన్‌2 కేటగిరీ కిందకు వస్తాయి. 12 టన్నులు దాటితే ఆ ట్రక్కును ఎన్‌3గా వర్గీకరిస్తారు.

దీనికి సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్‌కు ఆమోదం లభించినట్లు రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ జులైలోనే వెల్లడించారు. ట్రక్కు డ్రైవర్లకు మెరుగైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతోనే ఈ కొత్త నిబంధన తీసుకొస్తున్నామని తెలిపారు. తద్వారా వారి పని సామర్థ్యం పెరుగుతుందన్నారు. వేడి వాతావరణంలో పనిచేసే వారికి ఇకపై అలసట నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు. దేశాభివృద్ధికి అత్యంత కీలకమైన రవాణా రంగంలో ట్రక్కు డ్రైవర్లది చాలా కీలక పాత్ర అని కొనియాడారు. పనివాతావరణాన్ని మెరుగుపర్చడం వల్ల మానసిక స్థితి కూడా బాగుంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement