Saturday, May 4, 2024

రైతుల పాదయాత్రకు అనుమతి ఇవ్వొద్దు: పోలీసులను కోరిన వైసీపీ ఎమ్మెల్యే

అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రకు అనుమతి ఇవ్వొద్దని ఎమ్మెల్యే సుధాకర్ బాబు పోలీసులను కోరారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దును నిరసిస్తూ రాజధాని రైతులు న్యాయస్థానం టు దేవస్థానం మహా పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పాదయాత్ర జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు తన నియోజకవర్గం పరిధిలో అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతి ఇవ్వొద్దని జిల్లా ఎస్పీని కోరారు.

అమరావతి రైతుల పాదయాత్రను టీడీపీ రాజకీయ యాత్రగా మార్చివేసిందని ఆయన  ఆరోపించారు. స్థానిక ఎన్నికలు జరుగుతున్నందున ఆయా ప్రాంతాల్లో పాదయాత్ర ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు ఉన్న ప్రాంతాల్లో కాకుండా వేరే ప్రాంతాల మీదగా పాదయాత్ర మార్చాలని ఆయన ఎస్పీని కోరారు.

రైతుల పాదయాత్రలా కాకుండా టీడీపీ రాజకీయ యాత్రగా మార్చి హంగామా చేస్తున్నారని ఎమ్మెల్యే సుధాకర్ బాబు మండిపడ్డారు. 157 మందితో పాదయాత్రకు హైకోర్టు అనుమతిస్తే.. రెండు వేల మందితో పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. రైతుల యాత్రకు తాము వ్యతిరేకం కాదన్న ఎమ్మెల్యే సుధాకర్.. యాత్ర రాజకీయ రంగు పులుముకుందని ఆరోపించారు.

కాగా, అమరావతి రైతుల మహా పాదయాత్ర ఇవాళ్టితో ఏడవ రోజుకు చేరుకుంది. ఆదివారం ప్రకాశం జిల్లాలో పర్చూరు నుంచి ఇంకొల్లు వరకు 17 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుంది. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని రేపు పాదయాత్రకు విరామం ప్రకటించారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ శాసన మండలి కొత్త చైర్మన్ గా మాజీ స్పీకర్?

Advertisement

తాజా వార్తలు

Advertisement