Thursday, April 25, 2024

ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్‌ ప్రాక్టీస్‌.. సర్కార్ నిర్ల‌క్ష‌మే కారణమా..

అమరావతి, ఆంధ్రప్రభ : వైద్య ఆరోగ్య శాఖలో భారీ ప్రక్షాళనకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే అనేక సంచలనాత్మక మార్పులు చేస్తున్న ప్రభుత్వం, ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్‌ ప్రాక్టీస్‌పై దృష్టి సారించింది. వేలకు వేల రూపాయల వేతనాలను ప్రభుత్వం నుంచి తీసుకుంటూ మరోవైపు ప్రైవేట్‌ వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న వైద్యులపై కొరడా ఝళిపించేందుకు సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయంతో పాటు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సుజాతరావు కమిటీ ఇచ్చిన నివేదికలను, సూచనలను అమలు చేసే దిశగా చర్యలు చేప ట్టింది.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులను పూర్తిస్థాయిలో, చిత్తశుద్ధితో నిర్వహించ కుండా ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న వైద్యులకు చెక్‌ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ను నిలువరించ కలిగినప్పుడే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగవుతాయని సుజాతరావు కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. దీనిపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి కూడా సీరియస్‌గా దృష్టి సారించారు. అవసర మైతే వేతనాలను మరింతగా పెంచి పూర్తి స్థాయిలో ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో తాజాగా ఒక సమావేశాన్ని సైతం నిర్వహించి ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు చేపట్టింది. ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న ప్రభుత్వ వైద్యుల సమాచారాన్ని నిఘా వర్గాల ద్వారా సేకరిస్తున్నారు. జిల్లా వైద్యా ధికారులతో పాటు ఆస్పత్రుల సూపరింటెండ్‌లకు ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న వైద్యుల వివరాలను తెలియజేయాలని వ్యక్తిగతంగా లేఖలు కూడా పంపుతున్నారు. విధి నిర్వహణ సమయంలో ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించే వైద్యులపై తక్షణమే యాక్ష‌న్ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే వారంలో ఒకట్రెండు రోజులు విధులకు హాజరవుతూ మిగిలిన రోజులు సెలవులు పెడుతూ ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న వారిపై కూడా ఒక కన్నేసింది. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు పూర్తిస్థాయిలో నమ్మకం కలగాలంటే తొలుత ఈ ప్రైవేట్‌ ప్రాక్టీస్‌పై వేటు వేస్తేనే సాధ్యమవుతుందన్న అభిప్రాయంలో ప్రభుత్వం ఉంది.

ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేసుకునే సౌలభ్యం ఉంది. ఈ మేరకు గతంలోనే నిబంధనలు ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కచ్ఛితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉండాలని ఈ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే వారు ఎక్కడ ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారన్న‌ సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది. ప్రతి ఏడాది ఈ సమాచారంతో ఒక ధృవ పత్రాన్ని కూడా వైద్యులు ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. అయితే కొన్నేళ్లుగా ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ సంబంధించిన నిబంధనల ప్రక్రియ సజావుగా సాగడం లేదు. తాజాగా ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ అంశం మరోసారి తెరపైకి రావడంతో ఈ నిబంధనలను వైద్య ఆరోగ్య శాఖ మళ్లి అమలులోకి తీసు కువచ్చి ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement