Wednesday, May 1, 2024

YS Vivekananda Reddy Case: సంచలన విషయాలు చెప్పిన దస్తగిరి

మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో భారీ ట్విస్టు చోటుచేసుకుంది. ఆయన కారు డ్రైవర్ షేక్ దస్తగిరి వాంగ్మూలం కీలకంగా మారింది. వివేకా కారు డ్రైవర్ దస్తగిరి పేరుతో కడప సబ్‌ కోర్టులో సీబీఐ అప్రూవర్ పిటిషన్ దాఖలు చేసింది.

వివేకా హత్య ఎలా జరిగింది.. ప్రణాళిక మొత్తం పూసగుచ్చినట్లు సీబీఐకి దస్తగిరి వివరించినట్లు తెలుస్తోంది. హత్యలో నలుగురు పాల్గొన్నట్టు దస్తగిరి చెప్పినట్లు సీబీఐ స్టేట్‌మెంట్‌లో రికార్డు చేసింది. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి ప్లాన్ చేసినట్టు చెప్పిన దస్తగిరి దీనికి మొత్తం మూలం బెంగళూరులోని భూవివాదమే అని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.. బెంగళూరు భూమిలో వాటా ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఎర్ర గంగిరెడ్డి రగిలిపోయాడని దస్తగిరి చెప్పినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికోసం ఓ ప్రజాప్రతినిధితో పాటు ఎర్ర గంగిరెడ్డి కృషి చేశారని… దీంతో వివేకా వారికి వార్నింగ్ ఇచ్చినట్లు దస్తగిరి తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు. ఇక ఓటమి తర్వాత ఆ ప్రజాప్రతినిధి ఇంటి వద్ద వాగ్వాదం కూడా జరిగిందని అదే సమయంలో పలువురిని వివేకా వార్నింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోసం చేయడంతో ఎర్ర గంగిరెడ్డి, గుజ్జుల జగదీశ్వర్‌రెడ్డిని తన ఆఫీసుకు పిలిపించుకుని వివేకా దూషించారని ఆయన పేర్కొన్నాడు.ఈ హత్యకు మొత్తం రూ.40 కోట్లు సుపారి ఇచ్చినట్లు దస్తగిరి చెప్పాడు. తనకు రూ.5 కోట్లు ఇస్తామని చెప్పి అందులో భాగంగా ముందుగా రూ.కోటి చెల్లించినట్లు దస్తగిరి వివరించాడు.

హత్యకు ముందు సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి కలసి వివేకానందరెడ్డి ఇంట్లో ఉండే కుక్కను చంపేశారని దస్తగిరి చెప్పాడు. ఇక ముందుగానే వివేకా ఇంట్లో ఎర్ర గంగిరెడ్డి మాటు వేసి ఉన్నాడని.. ఆ తర్వాత సునీల్ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డిలతో కలిసి తాను వివేకా ఇంటి కాంపౌండ్‌ వాల్ దూకి లోపలికి వెళ్లినట్లు చెప్పాడు. ఇలా వివేకా హత్య ఎలా జరిగిందో సీన్ టూ సీన్ స్టేట్‌మెంట్‌లో దస్తగిరి వివరించాడు. ఇక దస్తగిరి వాంగ్మూలం ఈ కేసుకు కీలకంగా మారింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement