Sunday, May 5, 2024

పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ.. అందరికీ ఇళ్లు కట్టించి ఇస్తానన్న సీఎం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంతిల్లు లేని కుటుంబం ఉండబోదని.. ఇచ్చిన మాట కంటే మెరుగైన సౌకర్యాలతో ఇళ్లు కట్టించి తీరతామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. నవరత్నాల్లో భాగంగా విశాఖ జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం లే అవుట్‌లో నిర్మించిన మోడల్ హౌస్‌ను సీఎం జగన్‌ పరిశీలించారు. అనంతరం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని.. బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. భగవంతుడి దయతో ప్రభుత్వం నేడు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని వైఎస్‌ జగన్‌ అన్నారు. ప్రతి కుటుంబానికి ఒక సెంటు భూమి ఇస్తూ ఒకే కాలనీలో 10,228 ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు.

పాదయాత్రలో, ఎన్నికల ప్రణాళికలో 25 లక్షల మందికి పైగా ఇళ్లు కటిస్తామని మాటిచ్చామని సీఎం జగన్ అన్నారు. ఇప్పటికే రెండో దశ ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. అర్హులైన వాళ్లకు ఇంటి స్థలం ఇప్పించే బాధ్యత తనదని, ఈ కార్యక్రమం తర్వాత రాష్ట్రంలో ఇంటి అడ్రస్‌ లేకుండా ఒక్క కుటుంబం కూడా ఉండబోదని సీఎం జగన్‌ ఉద్ఘాటించారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా మాట తప్పమని, ఇచ్చిన హామీలు నెరవేర్చి తీరుతామని సీఎం జగన్‌ మరోసారి స్పష్టం చేశారు. ఈ మంచి పనికి పదహారు నెలల కిందటే అడుగులు వేశామన్న సీఎం.. తమ ప్రభుత్వం మంచి చేస్తుంటే కడుపు మంటతో కొందరు రగిలిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి మంచిపేరు ఎక్కడా వస్తుందోనన్న కడుపు మంటతో ప్రతిపక్షాలు ప్రభుత్వ కార్యక్రమాలపై కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కోర్టు వ్యవహారాలు పూర్తయిన తరువాత లక్షలాధి మందికి గృహ నిర్మాణాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. గృహం అనేది ప్రతి మహిళకు సామాజిక హోదా కల్పించడమని అన్నారు.

1.23 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తున్నామని, ప్రతి పేదవాడికి ఇల్లు అందించడమే తన లక్ష్యమని వైఎస్‌ జగన్‌ అభిప్రాయపడ్డారు. 30,70,000 మందికి ఇళ్లు మంజూరు చేశామన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 17 వేల జగనన్న కాలనీలు రానున్నాయని, రెండో దశ నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సొంతిళ్లు లేని కుటుంబం ఉండకూడదనే తమ మెనిఫెస్టోలో 25లక్షల మందికి ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. అంతకంటే ఎక్కువగా 30లక్షల 70వేలమందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇంటి స్థలాలతో పాటు 15 లక్షల 60వేల ఇండ్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమయ్యాయని వివరించారు. 17వేల జగనన్న కాలనీలు నిర్మిస్తున్నామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి గృహాలను కట్టిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement