Saturday, May 11, 2024

విద్యుత్తు వాడ‌కం ఎంత పెరిగినా తగ్గేదే లే.. కొత్త జిల్లాల‌ కార్యకలాపాలతో ఫుల్ డిమాండ్‌

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆర్థిక కార్యకలాపాలు మరింత పెరిగి, విద్యుత్‌ డిమాండ్‌ కూడా భారీగానే పెరగనుంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు 26 జిల్లాలు కానున్నాయి. ఈ నెల 4 నుంచే కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. కొత్త జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలు, ఇతర కీలక ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి. దీంతో విద్యుత్‌ డిమాండ్‌ కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో విద్యుత్‌ డిమాండ్‌ ఎంత పెరిగినా తట్టుకొని, నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు విద్యుత్‌ సంస్థలు సిద్ధమౌతున్నాయి. అన్ని వర్గాల వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నాయి. వినియోగదారుల సంతృప్తే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. డిమాండ్‌ ఎంత పెరిగినా తగ్గేదే లేదని, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంలో రాజీ పడే ప్రసక్తే లేదని ప్రతిన బూనాయి. ఆర్థిక ఇక్కట్లు ఎదురైనా, సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సంపూర్ణ సహాయ సహకారాలతో నిరంతరాయంగా విద్యుత్‌ను అందిస్తామని స్పష్టం చేస్తున్నాయి.

పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌….

వాస్తవానికి ఏయేటికాయేడు విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిపోతూనే ఉంది. 2017-18లో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్‌ 58,704 మిలియన్‌ యూనిట్లు ఉండగా.. 2021-22 నాటికి అది 68,905 మిలియన్‌ యూనిట్లకు చేరింది. అంటే 10,200 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ పెరిగిపోయింది. అంటే గత ఐదేళ్లలో 17.3 శాతం విద్యుత్‌ డిమాండ్‌ పెరిగింది. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్‌ డిమాండ్‌ 70,705 మిలియన్‌ యూనిట్లకు చేరనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2021-22తో పోలిస్తే 2.6 శాతం మేర డిమాండ్‌ పెరగనుంది.

24/7 విద్యుత్‌ సరఫరా..

రాష్ట్రవ్యాప్తంగా కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభమవుతున్నందున 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్‌ను అందించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు సంస్థలను ఆదేశించింది. భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించింది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమైనందున రాబోయే రోజుల్లో పట్టణీకరణ బాగా పెరగనుందని, తద్వారా విద్యుత్‌ డిమాండ్‌ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో నిరంతరాయంగా, వినియోగదారుల శ్రేయస్సే లక్ష్యంగా, సమర్థంగా కరెంటు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని.. అవసరమైన చర్యలన్నీ చేపట్టాలని ఆదేశించింది.

- Advertisement -

రోజువారీ డిమాండ్‌ ఇలా..

రోజువారీ సగటు డిమాండ్‌ 2018 మార్చిలో 179.64 మిలియన్‌ యూనిట్లు ఉండగా.. ప్రస్తుత మార్చిలో అది 220.44 మిలియన్‌ యూనిట్లకు చేరింది. ఇక వచ్చే ఏడాది మార్చి నాటికి ఇది 240 మిలియన్‌ యూనిట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. 2021-22 మార్చిలో పీక్‌ డిమాండ్‌ 12,032 మెగావాట్లు ఉండగా.. 2022-23 నాటికి ఇది 13,000 మెగావాట్లకు చేరుతుందని అంచనా. ఏప్రిల్‌ 1న (శుక్రవారం) విద్యుత్‌ డిమాండ్‌ 234.1 మిలియన్‌ యూనిట్లకు చేరగా.. పీక్‌ డిమాండ్‌ 12,021 మెగావాట్లుగా ఉంది.

రూ. 34 వేల కోట్ల ఆర్ధిక సాయం..

విద్యుత్తు సంస్థల విషయంలో సీఎం జగన్‌ ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటున్నారని, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారని ఇంధన శాఖ కార్యదర్శి బి శ్రీధర్‌ వెల్లడించారు. గత రెండేళ్లలో ప్రభుత్వం విద్యుత్తు సంస్థలకు దాదాపు రూ.34000 కోట్ల ఆర్థిక సాయం అందించిందని తెలిపారు. గృహ వినియోగదారులకు టెలిస్కోపిక్‌ బిల్లింగ్‌ వల్ల కలిగే ప్రయోజనాలపై విస్తృత అవగాహన కల్పించాలని ఉద్యోగులను ఆయన కోరారు. విద్యుత్తు సరఫరా పరిస్థితిపై వెబినార్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షేత్ర స్థాయిలో సిబ్బంది, అధికారులు వినియోగదారులకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. టెలిస్కోపిక్‌ బిల్లింగ్‌ సిస్టమ్‌కు సంబంధించిన కరపత్రాలను విద్యుత్‌ బిల్లులతో కలిపి వినియోగదారులకు అందజేయాలని సూచించారు. విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రవేశపెట్టిన కొత్త టెలిస్కోపిక్‌ విధానంతో వినియోగదారులు లబ్ధి పొందనున్నారని చెప్పారు. ఈ విధానం వల్ల మొత్తం వినియోగానికి ఒకే స్లాబ్లో బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు. టెలిస్కోపిక్‌ బిల్లింగ్‌ సిస్టమ్‌లో ఎక్కువ స్లాబ్లలో పడిపోయే వినియోగదారులు.. తక్కువ స్లాబ్లలో, తక్కువ రేట్ల ప్రయోజనాన్ని పొందనున్నారని చెప్పారు. ఉదాహరణకు ఒక వినియోగదారుడు నెలకు 250 యూనిట్లు వినియోగిస్తారనుకుంటే.. తొలి 30 యూనిట్లు రూ.1.90 వంతున, తర్వాత 45 యూనిట్లు రూ.3 వంతున, ఆ తర్వాత 50 యూనిట్లు రూ.4.50 వంతున, అనంతరం 100 యూనిట్లు రూ.6 వంతున, చివరి 25 యూనిట్లకు రూ.8.75 యూనిట్‌ చొప్పున బిల్లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడంతో పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసే ప్రక్రియను బలోపేతం చేసేందుకు ఏపీఈఆర్సీ కొత్త విద్యుత్తు టారిఫ్‌ను ప్రకటించిందని శ్రీధర్‌ చెప్పారు. 1.91 కోట్ల మంది వినియోగదారులకు నాణ్యమైన కరెంటు సరఫరా చేయడంలో డిస్కంలకు కొంత మేర ఊరట కల్పించేలా కొత్త టారిఫ్‌ ను ప్రకటించినట్లు తెలిపారు.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడే తక్కువ..

ఆంధ్రప్రదేశ్‌లో 100 యూనిట్లలోపు విద్యుత్‌ వాడే వారికి యూనిట్‌ రూ.3.11 చార్జీ పడుతుందని, ఇతర పెద్ద రాష్ట్రాల్రతో పోలిస్తే ఇది తక్కువని తెలిపారు. కర్ణాటక, రాజస్థాన్‌, బీహార్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్ల్రో 100 యూనిట్లలోపు వాడుకునే వినియోగదారులు యూనిట్‌ రూ.8.26, రూ.8.33, రూ.7.74, రూ.7.20, రూ.6.19, రూ.6.61, రూ.6.10 చొప్పున చెల్లిస్తున్నారని వివరించారు. రాష్ట్రంలోని 1.50 కోట్ల మంది గృహ వినియోగదారుల్లో 1.44 కోట్ల (95 శాతం) మంది 225 యూనిట్లలోపు వినియోగించే కేటగిరీలోనే ఉన్నారన్నారు. 225 యూనిట్లలోపు వినియోగించే వారి నుంచి డిస్కంలు సగటు ధర కంటే తక్కువగానే చార్జీలు వసూలు చేస్తున్నాయని తెలిపారు. మూడు డిస్కంలకు మొత్తం సర్వీసు చార్జీ రూ.6.82 నుంచి రూ.6.98కి పెరిగిందని.. అయినా ఈ కేటగిరీ వినియోగదారుల నుంచి అంతకంటే తక్కువగానే వసూలు చేస్తున్నాయని వివరించారు. ఈ వెబినార్లో ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ ఐ పృథ్వీతేజ్‌, డిస్కంల సీఎండీలు హెచ్‌ హరనాథరావు, జె పద్మాజనార్దన్‌ రెడ్డి, కె.సంతోష్‌ రావు, డైరెక్టర్‌ ఏవీకే భాస్కర్‌, డైరెక్టర్‌ ఫైనాన్స్‌ ఏపీ ట్రాన్స్‌కో కె ముథుపాండియన్‌ మరియు డైరెక్టర్‌ థర్మల్‌ ఏపీ జెన్కో జీ చంద్ర శేఖర రాజు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement