Thursday, May 16, 2024

పొత్తు లేకుండా మాపై గెలుస్తారా.. చంద్రబాబుకు వైసీపీ సవాల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఏ పార్టీతోనూ పోటీ పెట్టుకోకుండా తమపై పోటీ చేసి గెలుస్తారా అంటూ వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరారు. ఆ పార్టీ ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, వంగ గీతా విశ్వనాథ్, రెడ్డప్ప, సత్యవతి, అయోధ్య రామిరెడ్డి గురువారం న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఉన్న గురజాడ కాన్ఫరెన్స్ హాల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో సముచిత స్థానం, నిర్మాణాత్మక సూచనలు చేయాల్సిన బాధ్యత కలిగిన ప్రతిపక్షం చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధికి అడ్డుపుల్ల వేయడమే పనిగా పెట్టుకుందని పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. ఇందుకు రఘురామకృష్ణ రాజును పావుగా వాడుకుంటున్నారని అన్నారు. హడ్కో రుణాల మంజూరు నిలుపుదల చేయించాలంటూ ఆయనతో వేయించారని, గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను ఎలాగైనా ఆపించాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గృహ నిర్మాణానికి రావాల్సిన నిధులు రాకుండా అడ్డుకోవడంలోనూ ప్రధాన పాత్ర పోషించారని చెప్పుకొచ్చారు. సహజంగా రాజుల్లో పోరాట పటిమ ఉంటుందన్న సుభాష్ చంద్రబోస్ ఈ రాజుగారి విషయంలో మాటలు తప్ప మరేమీ లేదని ధ్వజమెత్తారు.

రాజీనామా చేస్తానని చెప్పి పారిపోయారన్న ఆయన రాజులెవరూ ఇలా చేయరని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి ప్రత్యక్ష సహాయం తీసుకుంటూ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇకనైనా ఈ పనులు ఆపాలని చంద్రబాబును, రఘురామకృష్ణ రాజుకు హితవు పలికారు. పేదవాడి ఇంటిస్థలాన్ని చదును చేయడానికి ఉద్దేశించిన పథకంపై చంద్రబాబు, రఘురామ స్టే తీసుకొచ్చారంటే పేదలపై వారికున్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను సెంట్రల్ వాటర్ కమిషన్ సహా పలు విభాగాలు ఆమోదించినా సరే కేంద్రం ఆమోదించకపోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన దుయ్యబట్టారు. విభజన హామీలపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోని ప్రభుత్వం రఘురామ, చంద్రబాబు అడ్డుపుల్ల పిటిషన్లకు కేంద్రం తక్షణమే స్పందిస్తోందని పిల్లి సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు.

అనంతరం వంగ గీత మాట్లాడుతూ… ఏపీ విభజన అశాస్త్రీయమని, కాంగ్రెస్ అన్యాయంగా విడదీసిందని చెప్పినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. అన్యాయం జరిగింది సరే.. మరి న్యాయం చేయండంటూ సూచించారు. ముఖ్యమంత్రిగా పని చేసి రాష్ట్రాల కష్టాలు తెలిసిన మోదీ అన్ని రాష్ట్రాలకు బడ్జెట్ ఇచ్చినట్టు ఏపీకి ఇస్తే సరిపోదని ఆమె అభిప్రాయపడ్డారు. బలమైన వ్యక్తికి భోజనం, బలహీనుడికి పౌష్టికాహారం పెట్టాలని సూచించారు. అయోధ్య మందిరం, కాశీ కారిడార్, కాశ్మీర్ అంశం పరిష్కరించిన మోదీ ఏపీని అభివృద్ధి చేయాలనుకుంటే పెద్ద కష్టమేమీ కాదన్నారు. పోలవరం ప్రాజెక్టు దేశం మొత్తానికీ ఉపయోగపడుతుందని, అక్కడ ఉత్పత్తయ్యే 970 మెగావాట్ల విద్యుత్తు అందరూ వాడుకోవచ్చని వంగ గీత చెప్పారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను ఎప్పుడైనా ప్రశంసించారా? కనీసం ప్రస్తావించారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉందని ఆమె స్పష్టం చేశారు. నిధులిచ్చే సంస్థలకు ప్రతిపక్షాలు లేఖలు రాస్తూ ఆకాశరామన్నలుగా వ్యవహరిస్తున్నాయని ఎద్దేవా చేశారు. కేంద్రంలో ఏ శాఖ దగ్గరకు వెళ్లినా ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులే కనిపిస్తున్నాయని గీత తెలిపారు. సహకరించకపోయినా ఫర్వాలేదు గానీ అడ్డుకోవద్దని ప్రతిపక్షాలను ఆమె కోరారు.

తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా పోటీ చేసేందుకు మేం సిద్ధం, మీరూ సిద్ధమేనా అంటూ ఎంపీ రెడ్డప్ప చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరారు. ఆంధ్రకు అన్యాయం చేశారని ఒప్పుకున్న మోదీ ఎందుకు ఆ తప్పులను సరిదిద్దడం లేదు? రాష్ట్రాభివృద్ధికి ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. ఏపీకి ఇవ్వాల్సిన నిధులిస్తే జగన్ ఇంకా మంచి పాలన అందిస్తారని రెడ్డప్ప విశ్వాసం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement