Sunday, May 5, 2024

CPI: ఇండియా కూటమిలోకి టీడీపీని ఆహ్వానిస్తున్నాం… సీపీఐ నేత నారాయణ

తెలుగుదేశం పార్టీని ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ తీరుపై మండిపడ్డారు. భారతదేశ చరిత్రలో ఇంత మంది ఎంపీలను సస్పెండ్ చేసిన ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. వారు చేసిన తప్పేంటి ? అని ప్రశ్నించారు. పార్లమెంట్ పై దాడి ఘటనపై చర్చకు పట్టుబట్టారు. ఒకవేళ ఏదైనా జరిగితే సభ్యులు చనిపోయేవారు కదా ? బీజేపీ ఎంపీ పాస్ ఇవ్వడం నిజమా కాదా ? పొరపాటున ఏ ఎంఐఎం ఎంపీ ఇచ్చి ఉంటే ఏం చేసేవారు ? పార్లమెంట్ నే కాపాడలేని అసమర్ధులు భారతదేశాన్ని ఎలా కాపాడతారు ? ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందని తన అనుమానమన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం చేసిన నాటకీయ ప్రక్రియ అనిపిస్తోందన్నారు. లేదంటే ఎంత సీరియస్ గా వ్యవహరించాలి ? అటువంటిదేమీ కనిపించడం లేదే ? ఎన్నికల గిమ్మిక్ లో భాగంగానే ప్రమాదకర గేమ్ అడారన్నారు.

ఇండియా కూటమికి దేశంలో జనాదరణ పెరుగుతుంది కాబట్టి ఇలా చేస్తున్నారన్నారు. ఏపీ విషయానికొస్తే .. ఏపీలో పార్టీలన్నీ కేంద్ర హోంమంత్రిని, బీజేపీని చూసి భయపడుతున్నాయన్నారు. మోడీని వ్యతిరేకిస్తే తమకు ఎక్కడ ఇబ్బందులు సృష్టిస్తారో అని వారంతా భయపడుతున్నారన్నారు. ఇండియా కూటమికి అనుకూలంగా ఉండేవారితోనే తమ పొత్తులుంటాయన్నారు. బీజేపీ వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు నష్టపోయాయన్నారు. ప్రత్యేక హోదా సహా ఏదీ రాలేదన్నారు. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపేనన్నారు. వారితో అంటకాగే పార్టీలకు కూడా ప్రజలు ఓటు వేయరన్నారు. జగన్ కి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి వెళ్ళాలన్నది తమ ఉద్దేశమన్నారు. పోల్ మేనేజ్‌మెంట్‌కు భయపడే వారు బీజేపీ పొత్తు కోసం ఆరాటపడుతున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement