Wednesday, May 15, 2024

Vizianagaram – ఆరోగ్య శ్రీ అవసరమైన వారికి ఆరోగ్య మిత్రలకు జత చేయాలి – కలెక్టర్

విజయనగరం, అక్టోబరు10(ప్రభ న్యూస్): జగనన్న ఆరోగ్య సురక్ష కాంప్ లకు వచ్చిన వారికి ఆరోగ్య శ్రీ పధకం క్రింద రిఫర్ చేయవలసి వచ్చిన వారికి ఆరోగ్య మిత్రలను జత చెయ్యాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ జామి మండలం లోట్లపల్లి లో, విజయనగరం అరుంధతి నగర్ మున్సిపల్ హై స్కూల్ లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను తనిఖీ చేశారు. శిబిరం వ‌ద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌, ఓపి రిజిష్ట్రేష‌న్‌, స్పాట్ రిజిష్ట్రేష‌న్‌, ఐటి రూమ్‌, వైద్యుల కేటాయింపు, ల్యాబ్‌, వైఎస్ఆర్ ఆరోగ్య‌శ్రీ స‌హాయ కేంద్రం, వైద్యుల గ‌దులు, మందులిచ్చే కౌంట‌ర్‌, పిడియాట్రిక్, న్యూట్రిష‌న్ స్టాల్‌, కంటి ప‌రీక్షా కేంద్రాల‌ను కలెక్టర్ సంద‌ర్శించారు. రోగులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు.

వైద్యులతో మాట్లాడుతూ ఏడు ర‌కాల ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించి, హెల్త్ ప్రొఫైల్‌లో వారి వివ‌రాల‌ను న‌మోదు చేయాలని, అవ‌స‌ర‌మైన వారికి కేస్ షీట్ల‌ను అందించాలని తెలిపారు. శిబిరాల్లో ఇసిజితో స‌హా మొత్తం 14 ర‌కాల ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించి, 105 ర‌కాల మందుల‌ను ఉచితంగా ఇవ్వాలని తెలిపారు. కంటి ప‌రీక్ష‌ల‌ను కూడా నిర్వ‌హించి, అవ‌స‌ర‌మైన‌వారికి ఉచితంగా క‌ళ్ల‌ద్దాల‌ను కూడా అంద‌జేయాలన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున శిబిరాల వద్ద తాగునీరు, స్నాక్స్ వంటివి ఏర్పాటు చేయాలని, వచ్చిన వారిని వేగంగా పంపించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

విజయనగరం అరుంధతి నగర్ లో 47, 48, 49 సచివాలయాలకు చెందిన సుమారు 2 వేల మంది సురక్ష శిబిరం లో తనిఖీలు చేసుకున్నారు. లోట్లపల్లి శిబిరం లో 271 మంది తనిఖీలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ వెంకట త్రివినాగ్, డి ఎం హెచ్ ఓ డా.భాస్కర రావు, విజయనగరం మున్సిపల్ కమిషనర్ శ్రీ రాములు నాయుడు, డిసిహెచ్ఎస్ డా.నగభూషన్ రావు, ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్ అప్పల రాజు, జామి ఎం.పి.డి.ఓ సతీష్, తహసీల్దారు హేమంత్ కుమార్, వైద్యులు, స్పెషలిస్టు వైద్యులు, ప్రజా ప్రతినిధులు, ఐ.సి.డి.ఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement