Friday, April 26, 2024

Followup | వివేకానందరెడ్డి మ‌ర్డ‌ర్ కేసు.. భాస్కర్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు ఎ7 వైఎస్‌ భాస్కర్‌ రెడ్డికి బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టి వేసింది. ప్రస్తుత కీలక దశలో బెయిల్‌ మంజూరు చేయరాదంటూ వివేకానందరెడ్డి కూతురు నర్రెడ్డి సునీతారెడ్డి, కేంద్రదర్యాప్తు సంస్థ (సీబీఐ) వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం భాస్కర్‌ రెడ్డి పిటిషన్‌ను శుక్రవారం తిరస్కరించింది. వివేకానందరెడ్డి హత్యతో తనకే మాత్రం సంబంధం లేదని,కేవలం ఏ4 నిందితుడు షేక్‌ దస్తగిరి చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ తనపై హత్య కేసు నమోదు చేసిందని బెయిల్‌ మంజూరు చేయాలని భాస్కర్‌ రెడ్డి సీబీఐ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై ఇరు పక్షాలు వాడిగా వేడిగా వాదనలు వినిపించాయి. బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. వివేకానందరెడ్డి హత్య జరిగిన ప్రదేశంలో సాక్ష్యాలను తుడిచి వేయడంలో భాస్కర్‌ రెడ్డితో పాటు ఆయన కొడుకు ,కడప ఎంపి వైఎస్‌ అవినాష్‌ రెడ్డి కీలకపాత్ర ఉందని, 2019 మార్చి 5 న వివేకానందరెడ్డి హత్యకు ముందు, ఆ తర్వాత కూడా నిందితులు ఎ2 యాధాటి సునీల్‌ యాదవ్‌తో పాటు మరో నిందితుడు భాస్కర్‌ రెడ్డి నివాసంలోనే ఉన్నారని నివేదించారు.

హత్య కేసులో ప్రధాన నిందితులు తర్వాత ఎ1 ఎర్రగంగిరెడ్డి,ఎ2 యాధాటి సునీల్‌ యాదవ్‌, ఎ3 గజ్జల ఉమాశంకర్‌ రెడ్డి, ఎ4 షేక్‌ దస్తగిరి(అప్రూవర్‌) గాఉన్నారని, సాక్ష్యాలను తుడిచెయ్యడంలో, ఆ తర్వాత నిందితులకు సహకరిస్తామని హామీ ఇచ్చినవారిలో భాస్కర్‌ రెడ్డితో పాటు ఆయన తనయుడు అవినాష్‌ రెడ్డి కూడా ఒకరని కోర్టు దృష్టికి తెచ్చారు. బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారనేందుకు కర్నూలు ఉదంతం కూడాఒక సాక్ష్యంగా నిలుస్తుందని కోర్టుకు విన్నవించారు. బెయిల్‌ ఇవ్వొద్దని అభ్యర్థించారు.

- Advertisement -

అంతకు ముందు భాస్కర్‌ రెడ్డి తరపున సీనియర్‌ న్యాయవాది ఉమామహేశ్వర్‌ వాదించారు. వివేకానందరెడ్డి హత్యతో భాస్కర్‌ రెడ్డికి ఏ మాత్రం సంబంధం లేదని నివేదించారు. కేవలం అప్రూవర్‌గా మారిన ఎ4 నిందితుడు షేక్‌ దస్తగిరి చేసిన ఆరోపణల మేరకే భాస్కర్‌ రెడ్డిపై కేసు నమోదు చేసిందని తెలిపారు, సీబీఐ చూపిస్తున్న టెక్నికల్‌ ఎవిడెన్స్‌ పొంతన లేకుండా ఉన్నాయని, వాటిని నమ్మాల్సిన అవసరం లేదని విన్నవించారు. భాస్కర్‌ రెడ్డి కొడుకు , కడప ఎంపి అవినాష్‌ రెడ్డికి ఇప్పటికే హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిందని , కాబట్టి భాస్కర్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత సునీతారెడ్డి, సీబీఐ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. ఎ7 భాస్కర్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement