Thursday, May 2, 2024

ధాన్యం కొనుగోళ్ల అంశంలో సర్కార్‌ వైఖరేంటో?

దత్తిరాజేరు, (ప్రభ న్యూస్‌) : ధాన్యం కొనుగోళ్ల అంశంలో సర్కార్‌కు ఒక వైఖరంటూ వుందా? జిల్లా అధికార యంత్రాంగానికైనా ఆమేరకు స్పష్టత వుందా? అంటే లేదనే పరిస్థితులు చాటిచెబుతున్నాయి. ఆరుగాలం చెమటోడ్చి పండించిన ధాన్యం అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలుపడడం అనివార్యం కావడం ఇదే చెబుతోంది. ఈ ఏడాది కూడా గోనె సంచులు దొరకక రైతులు ఎంతో ఇబ్బందులుపడుతున్న పరిస్థితి స్పష్టంగా తెలుస్తోంది. కొంత మంది మిల్లర్లు తమ మైండ్‌ గేమ్‌తో రైతులకు ఇబ్బందులు సృష్టంచి అధికార యంత్రాంగాన్ని ఇరకాటంలోకి నెట్టాలన్న యోచనలో వున్నట్లు పరిస్థితులు చాటిచెబుతున్నాయి. ఆర్‌బీకేల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరగకుండా గతంలో మాదిరిగానే దోపిడీకి అనువుగా పరిస్థితులను సృష్టిస్తున్నారన్న వాదనలు సర్వత్రా వినిపిస్తోన్న పరిస్థితి. దేశానికి రైతే వెన్నెముక, ఇది రైతు రాజ్యమని మన పాలకులు చెబుతున్న మాటలకు క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు పొంతన కుదరని నేపథ్యం అందరికీ తెలిసిందే. ధాన్యం నూర్పులు వేసి రైతులు కాపలా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. వరిపంట బాగా పండినప్పటికీ ఒక వైపు ప్రకృతి, మరోవైపు ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నది రైతుల నోట వినిపిస్తున్న మాట. క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం వుండడం, అధికార యంత్రాంగం కొసరు లక్ష్యంతో ముందుకేగుతుండడం..వెరసి అన్నదాతకు అవస్థలు తప్పని నేపథ్యం. రెతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పినప్పటికీ ఆచరణలో పూర్తిగా విఫలమైన పరిస్థితి. రైసుమిల్లులకు ధాన్యం తీసుకువెళితే వారు టార్గెట్‌ అయిపోయిందని తీసుకోవడం లేదు. మరోవైపు తుఫానులు, అకాల వర్షాలురైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసాయి.

రైతులు చాలా ఇబ్బందులుపడుతున్నా పాలకులు ఏమీ తెలియనట్టు మిన్నకుండిపోయారు.రైతు బాధలు రైతుపడుతున్నాడు. దళారీ వ్యవస్ధను రూపుమాపడానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం పూర్తిస్ధాయిలో కొనుగోలు చేయకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు, అవస్ధలుపడుతున్నారు. తప్పనిపరిస్థితిలో డబ్బులు తక్కువ అయినా దళారులకు ధాన్యం విక్రయించడం రైతులకు తప్పడం లేదు. ఏదో రకంగా పండించిన ధాన్యం అమ్మకాలు జరిగితే తమ ఇబ్బందులు తొలగిపోతాయని రైతులు భావిస్తున్నారు. రైతులు చేతిలో చిల్లిగవ్వ లేక ధాన్యానికి సంబంధించిన డబ్బులు అందక ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలో 17 ఆర్బికే కేంద్రాలున్నాయి. వాటి ద్వారా కొనుగోలు చేసి ధాన్యాన్ని రైసు మిల్లులకు తరలించాలి. ఆర్బీకేలో ట్యాగ్‌ చేసి ఏ రైసుమిల్లుకు పంపించాలనేది అక్కడే ట్రక్‌ సీటు జనరేట్‌ చేస్తారు.ఆ మేరకు సంబంధిత రైతులు ధాన్యంతీసుకువెళ్లాలి. వాటిని రైసుమిల్లు వారు కచ్చితంగా తీసుకోవాలి కానీ అలా జరగడం లేదని రైతులు అంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకబస్తా 40 కిలోల ధాన్యం బస్తా కాగా, రైస్‌మిల్లర్లు 48 నుంచి 50 కిలోల ధాన్యం బస్తాకు అడుగుతున్నారని రైతులంటున్నారు. అలాఇచ్చిన వారి ధాన్యం మాత్రమే మిల్లర్లు ముందు తీసుకోవడం జ రుగుతుందని రైతులంటున్నారు. వారనుకున్నట్లు చేస్తే అంగీ కారం కుదిరిన వారికి గోనె సంచులు ఇస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ విధంగా చాలాచోట్ల ముందుగానే ట్రక్‌ సీటు జనరేట్‌ చేసుకొని ధాన్యం తీసుకోవడం జరుగుతుందని రైతులంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరైన నిర్ణయం తీసుకొని రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని పెదమానాపురం, కోమటిపల్లి వంగర, మరడాం, తాడేందరవలస,కృష్ణాపురం, లింగాలవలస, బూర్జివలస, తదితర గ్రామాలకు చెందిన రైతులు కోరుచున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement