Monday, May 6, 2024

ఇంటివద్దకే పశు వైద్య సేవలు.. మొబైల్​ వెటర్నరీ క్లినిక్​​ వాహనాలు ప్రారంభించిన జగన్​..

ఆంధ్రప్రదేశ్​లో వైఎస్పార్​ సంచార పశు ఆరోగ్యసేవా పథకంలో భాగంగా ఇవ్వాల కొత్తగా 175 మొబైల్​ అంబులెన్స్​లను ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మొదటి దశలో 175 మొబైల్ అంబులెన్స్ వెటర్నరీ క్లినిక్‌లను (ఎంఎవిసి) జెండా ఊపి జగన్​ ప్రారంభించారు. ఇంటి వద్దకే పశువైద్య సేవలు అందించేలా ‘వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవా’ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

కాగా, ఫేజ్ 1 కింద 175 అంబులెన్స్ ల కోసం ప్రభుత్వం మొత్తం రూ.143 కోట్లు ఖర్చు చేసిందని, మిగిలిన రూ.135 కోట్ల విలువైన 165 వాహనాలను రెండో స్పెల్‌లో ప్రవేశపెట్టనున్నట్టు అదికారులు తెలిపారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక వాహనం చొప్పున మొత్తం 340 అంబులెన్స్ లకు గాను మొదటి దశలో 175 వాహనాలను ముఖ్యమంత్రి జెండా ఊపి ఇవ్వాల ప్రారంభించారు.  ఎంఏవీసీల్లో పరీక్షలు, వ్యాధి నిర్ధారణ చేసేందుకు అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయని, రాష్ట్రవ్యాప్తంగా వెట్ క్లినిక్‌లను నెలకొల్పేందుకు ప్రభుత్వం రూ.278 కోట్లు వెచ్చిస్తోందని అధికారులు తెలిపారు.

మొబైల్ వెట్ క్లినిక్‌ల సౌకర్యాలు

ఈ మొబైల్​ అంబులెన్స్ లు అన్ని అత్యవసర సేవలకు హాజరవుతాయి. ఇందులో కృత్రిమ గర్భధారణ సేవలు, పశువైద్య నిర్ధారణ వంటివి కూడా ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో జంతువులను ఎత్తడానికి, వాటిని సమీపంలోని ప్రభుత్వ పశువైద్య కేంద్రానికి తరలించడానికి ‘హైడ్రాలిక్ లిఫ్ట్’ సౌకర్యాన్ని కూడా వీటిలో పొందుపరిచారు. ప్రతి అంబులెన్స్ కు ఒక వెటర్నరీ డాక్టర్, ఒక పారా వెటర్నరీ వర్కర్‌ను కేటాయిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో, ప్రజలు తక్షణ వైద్య సహాయం కోసం టోల్-ఫ్రీ నంబర్ 1962ను సంప్రదిస్తే ఈ మొబైల్​ వెటర్నరీ క్లీనిక్​ వాహనాలు అందుబాటులోకి వస్తాయి.

ఇతర వైద్య సౌకర్యాలు..

- Advertisement -

అంబులెన్స్ లలో 20 రకాల పరీక్షలు చేయనున్నారు. 15 రకాల రక్త పరీక్షలు, అన్ని రకాల వ్యాక్సిన్‌లు, మందులు, పశువులను వాహనంలోకి ఎక్కించేందుకు కావాల్సిన పరికరాలు, మైక్రోస్కోప్‌తో కూడిన చిన్న ప్రయోగశాల కూడా ఉన్నాయి. ప్రాథమిక వైద్య సేవలతో పాటు, బోవిన్ జంతువులు, గొర్రెలు, మేకలు, పెంపుడు జంతువులకు చిన్న చిన్న శస్త్రచికిత్సలు చేయడానికి వెటర్నరీ అంబులెన్స్ లో సౌకర్యాలు ఉన్నాయి. అవసరమైతే జంతువు ప్రాణాలను కాపాడేందుకు సరైన చికిత్స కోసం సమీపంలోని వెటర్నరీ ఏరియా ఆసుపత్రికి లేదా వెటర్నరీ పాలిక్లినిక్‌కు ఈ వేహికల్​లో తీసుకెళ్లవచ్చు.  చికిత్స తర్వాత వాటిని ఉచితంగా రైతు ఇంటికి తిరిగి చేర్చేందుకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement