Monday, May 6, 2024

గిరిజన బాలిక కిడ్నాప్‌.. చిన్నారితో సహా స్కూటీపై పరారైన మహిళలు..

ఇందుకూరుపేట, (ప్రభ న్యూస్‌) : ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నం శ్రీ చాముండేశ్వరీ అమ్మవారి దేవస్థానం వద్ద మూడేళ్ల గిరిజన చిన్నారి కిడ్నాపైన ఘటన రాష్ట్ర స్థాయిలో సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళ్తే గంగపట్నం శ్రీనివాసపురం సంఘంలో మానికల చిన సూలామయ్య తన భార్య పోలమ్మతో కలిసి నివాసం ఉంటున్నారు. వారికి చార్ముడి, మన్నారి, సూలామమ్మ, పోలయ్య, పల్లవి అనే ఐదు మంది సంతానం. ఆదివారం అమ్మవారి దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో వారు తమ పిల్లలతో కలిసి అమ్మవారి దేవస్థానం వద్దకు వెళ్లారు. పిల్లలందరూ కలిసి ఆడుకుంటుండగా ఇద్దరు మహిళలు వచ్చి వారికి తినుబండారాలు ఇస్తామని దూరంగా తీసుకువెళ్లారు. అక్కడ తినుబండారాలు ఇచ్చినట్లే ఇచ్చి పల్లవి (3) అనే బాలికను తీసుకుని మధ్యలో ఉంచుకుని ఇద్దరు మహిళలు స్కూటీ తరహా వాహనంలో పరారయ్యారు.

దీంతో మిగిలిన పిల్లలు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో వారు గగ్గోలు పెట్టారు. దీంతో సమాచార సాధనాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం కలిగించింది. జిల్లా ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు రూరల్‌ సీఐ జగన్‌మోహన్‌రావు, మైపాడు బీచ్‌ వద్ద భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ఇందుకూరుపేట ఎస్సై ఆనంద్‌తో కలిసి గంగపట్నం గ్రామంలోని దేవస్థానం వద్దకు చేరుకుని సంఘటన పూర్వాపరాలను ఆరా తీశారు. దేవస్థానం వద్ద సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో సమీపంలోని పొలం వద్ద నున్న సీసీ కెమెరాల్లో పరిశీలించి ఇద్దరు మహిళలు గిరిజన బాలికతో కలిసి అత్యంత వేగవంతంగా వెళ్తున్నట్లు గుర్తించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా తమ కుమార్తె కిడ్నాప్‌ కావడంతో బాలిక తల్లిదండ్రులు, వారి బంధుమిత్రులు శోకంలో మునిగిపోయారు. తమ చిన్నారి ఆచూకీని ఎలాగైనా కనుగొని తమకు అప్పగించాలని వారు పోలీసులను కోరారు. అతిత్వరలో బాలిక ఆచూకీ గుర్తించి తల్లిదండ్రులకు అప్పజెబుతామని ఈ సందర్భంగా సీఐ జగన్‌మోహన్‌రావు, ఎస్సై ఆనంద్‌లు తెలియజేశారు.

దేవస్థానం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి ..
రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాల ధ్వంసం, రథాల దహనం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి దేవస్థానం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఇందుకూరుపేట మండలంలోని దాదాపు అన్ని దేవస్థానాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉన్నారు. గంగపట్నం శ్రీ చాముండేశ్వరీ అమ్మవారి దేవస్థానం వద్ద సీసీ కెమెరాలు ఉండగా ఇటీవల కొన్ని వివాదాల నేపథ్యంలో సీసీ కెమెరాలను తొలగించారు. అయితే దేవాదాయ శాఖ ఆలయం వద్ద నూతన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయలేదు. నిత్యం జనసమ్మర్థంతో ఉండే శ్రీ చాముండేశ్వరీ అమ్మవారి దేవస్థానానికి ఆదాయ కూడా అధికంగానే వస్తుంది. వెంటనే దేవాదాయ శాఖ అధికారులు దేవాలయ నలువైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement