Saturday, May 18, 2024

గురుకుల ఉపాధ్యాయులకు బదిలీలు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

అమరావతి, ఆంధ్రప్రభ: గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రిన్సిపల్స్‌, ఉపాధ్యాయ, అధ్యాపకులకు బదిలీల నిమిత్తం గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే జీవో విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఒకే స్థానంలో రెండేళ్ళ సర్వీస్‌ పూర్తి చేసుకున్న వారు బదిలీలకు అర్హులు. ఐదేళ్లు ఒకే స్థానంలో పనిచేసిన వారికి తప్పనిసరిగా బదిలీ చేస్తారు. బదిలీల్లో 40 శాతం పైబడి వైకల్యం ఉన్నవారికి, క్యాన్సర్‌, గుండె శస్త్ర చికిత్సలు చేసుకున్న వారికి, నరాల వ్యాధి, కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న వారికి, మానసిక వ్యాధులతో ఉన్న పిల్లల తల్లిదండ్రులకు వితంతువులకు ప్రాధాన్యత ఇస్తారు. అదేవిధంగా గురుకుల విద్యాలయాల్లో మహిళా ఉపాధ్యాయ, అధ్యాపకులను మాత్రమే నియమిస్తారు. ఒకవేళ రెగ్యులర్‌ మహిళా టీ-చర్లు తగినంతమంది లేనిపక్షంలో మహిళా సీఆర్టీలకు అవకాశం కల్పిస్తారు.

ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌..

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న గ్రేడ్‌ 2 హెచ్‌ఎంలు, ఉపాధ్యాయుల బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ గంధం చంద్రుడు ఉత్తర్వులను విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం క్యాటగిరీ 4లో పనిచేసిన వారికి సంవత్సరానికి ఐదు పాయింట్లు-, క్యాటగిరి 3లో పనిచేసిన వారికి మూడు పాయింట్లు-, క్యాటగిరి రెండులో పనిచేసే వారికి రెండు పాయింట్లు-, 1లో పని చేసిన వారికి ఒక్క పాయింటు- చొప్పున బదిలీల్లో వెయిటేజ్‌ ఇస్తారు. ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం ఈ నెల 17 నాటికి గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ బదిలీలను పూర్తిచేయాలని, ఆయా ఐటీ-డీఏ పీవోలు, డిప్యూటీ- డైరెక్టర్లు ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ కార్యదర్శి ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఎట్టకేలకు గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల బదిలీలకు మోక్షం లభించడం పట్ల ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం హర్షం వ్యక్తం చేశారు.

ఉత్తర్వులను సవరించాలి: యూటీఎఫ్‌

గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల బదిలీల కోసం ఇచ్చిన జీవోను సవరించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌. వెంకటేశ్వర్లు, కె.ఎస్‌.ఎస్‌. ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల బదిలీలు ప్రక్రియ ఈ నెల 17కు పూర్తి చేయడం సాధ్యం కాదని, కనుక బదిలీలకు గడువు మరొక 10 రోజులు పొడిగించాలని వారు కోరారు. గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల బదిలీల కోసం గతంలో ఇచ్చిన జీవో 53ను అమలు చేయాలని లేదా పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయుల కోసం రూపొందించిన నిబంధనలను అమలు చేయాలని కోరారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement