Friday, May 17, 2024

TTD | తిరుమల తరహాలో తిరుచానూరు వాహన సేవలు..

తిరుచానూరు, ప్రభ న్యూస్‌ : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ వాహన సేవల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వాహన సేవలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారని టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం టీటీడీ ఛైర్మన్‌ మీడియాతో మాట్లాడారు.

అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ముందుగా జరిగే కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించామన్నారు. 9న అంకురార్పణ, 10న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని 14న అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గజవాహన సేవకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారని, ఎక్కువమంది భక్తులు దర్శించుకునేలా అధికారులు చక్కటి ప్రణాళికల్ని రూపొందించారని తెలిపారు.

18న పంచమితీర్థానికి విశేషంగా భక్తులు తరలివచ్చి కోనేరులో పుణ్యస్నానాలు చేస్తారని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు- జరుగుతున్నాయని చెప్పారు. ఆలయంలో ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

- Advertisement -

ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితరాలను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు యానాదయ్య, నాగసత్యం, సుబ్బరాజు, జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో గోవిందరాజన్‌, విజివో బాలిరెడ్డి, ఏఈవో రమేష్‌, పాంచరాత్ర ఆగమసలహాదారు శ్రీనివాసాచార్యులు, సూపరింటెండెంట్లు శ్రీవాణి, శ్రీ శేషగిరి, అర్చకులు బాబుస్వామి, వేంపల్లి శ్రీను స్వామి, మణికంఠ స్వామి, సిఐ శివప్రసాద్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

15 పరదాలు విరాళం

అమ్మవారి ఆలయానికి చైర్మన్‌ కరుణాకర రెడ్డి చేతుల మీదుగా భక్తులు 15 పరదాలను విరాళంగా అందించారు. హైదరాబాదుకు చెందిన స్వర్ణ కుమార్‌ రెడ్డి 11, గుంటూరుకు చెందిన అరుణ్‌ కుమార్‌, పద్మావతి, తిరుచానూరుకు చెందిన పవిత్ర, రజిని ఒక్కొక్కటి చొప్పున నాలుగు పరదాలను విరాళంగా అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement