Friday, May 3, 2024

9న మూడు రాజ‌ధానుల‌పై సుప్రీంకోర్టులో విచార‌ణ‌…

న్యూఢిల్లి , ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌ మూడు రాజధానుల వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మే 9న విచారణ చేపట్టనుంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని తప్పుబడుతూ, అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పులోని 7 అంశాల్లో 5 అంశాలపై ‘స్టే’ విధించిన సుప్రీంకోర్టు, మిగతా రెండు అంశాలపై ప్రతివాదుల వాదనలను విన్న తర్వాతనే తుది నిర్ణయం వెలువరిస్తామని వెల్లడించింది

కేసును మొదటి నుంచి విచారణ జరుపుతున్న జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ బీవీ నాగరత్న ధర్మాసనం తర్వాతి దశలో కేసు విచారణ చేపట్టేందుకు ఆసక్తి చూపలేదు. అయితే జూన్‌ 17న జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో మరో కొత్త ధర్మాసనం ముందుకు కేసు చేరుకుంటుంది. అంటే కథ మళ్లి మొదటికొస్తుంది. ఈ క్రమంలో కేసు విచారణ త్వరగా చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ధర్మాసనం ఎదుట పలుమార్లు ప్రస్తావించారు. సరిగ్గా ఇదే సమయంలో మే 9 నాటి కేసుల జాబితాలో ఈ కేసు 11వ స్థానంలో కనిపించింది. పైగా ఈ ధర్మాసనంలో జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ బీవీ నాగరత్నతో పాటు జస్టిస్ అ హసనుద్దీన్‌ అమానుల్లా కూడా ఉన్నారు. ఆ రోజు కేసులో మిగిలిన అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతారా లేక ప్రతివాదులుగా ఉన్న అమరావతి రైతుల్లో కొందరు చనిపోయినందున, వారి స్థానంలో వారసులను ప్రతివాదులుగా చేర్చే అంశానికి మాత్రమే పరిమితమవుతారా అన్న విషయం తెలియాల్సి ఉంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం కేసులోని మిగతా అంశాలపై జులై 11న విచారణ జరుగుతుందని, మే 9న జరిగే విచారణ కేవలం చనిపోయిన ప్రతివాదుల స్థానంలో వారి వారసులను చేర్చడం మాత్రమే జరుగుతుందని న్యాయవాదులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌ పాలనా రాజధానిని విశాఖపట్నంకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మే 9న జరిగే విచారణలో చనిపోయిన ప్రతివాదుల స్థానంలో వారి వారసులను చేర్చడంతో పాటు కేసులోని మిగతా పెండింగ్‌ అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని పట్టుబట్టే అవకాశం ఉంది. తద్వారా వీలైనంత త్వరగా వివాదాన్ని పరిష్కరిస్తే తాము పాలనా రాజధాని తరలింపు విషయంలో ఒక నిర్ణయానికి వస్తామని సుప్రీంకోర్టుకు తెలియజేయనుంది. ఆ మేరకు సీనియర్‌ న్యాయవాదులతో వాదనలు వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement