Saturday, May 11, 2024

ఆ 40 మంది చిన్నారులకు చదివేది ?

కృష్ణా జిల్లామండ‌ల పరిధిలోని పెదతుమ్మిడి శివారు బండ్ల గూడెం గ్రామం లో ఉన్న ప్రభుత్వ పాఠశాల మూతపడటంతో అక్కడున్న 40 మంది చిన్నారులుకు చదువు లేకుండా పోయింది. ఈ గ్రామంలో గతంలో ఎయిడెడ్ పాఠశాల ఉండగా అక్కడున్న ఉపాధ్యాయులు రిటైర్ కావడంతో పాఠశాల మూతపడింది. దీంతో మండల విద్యాశాఖ అధికారులు సర్వ శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఎస్టిసి కింద పాఠశాలను ప్రారంభించారు. ఒకే ఏడాది ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు డిప్యుటేషన్ మీద పని చేశారు. గతేడాది ఇరువురు విద్యావాలంటీర్లు చే సుమారు 40 మంది విద్యార్థుల తో పాఠశాలను తాత్కాలికంగా అద్దె భవనంలో కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఈ ఏడాది ఈ 40 మంది విద్యార్థులకు ఆ పాఠశాల రెన్యువల్ కాకపోవడంతో మూతపడింది. ప్రభుత్వం పేద ప్రజలకు, విద్యార్థులకు ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో కానరావడం లేదు. దీనికి నిదర్శనం ఈ విద్యాసంవత్సరం ప్రారంభించి సగం రోజులు పైనే కావస్తున్నా ఈ 40మంది విద్యార్థులు చదువుకు మాత్రం దిక్కు లేకుండా పోయింది. వీరికి పక్కనే సుమారు మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న గ్రామంలోని మరొక పాఠశాలకు అప్పగించిన దానిమీద పర్యవేక్షణ లేకపోవడంతో మరుగున పడిపోయింది. విద్యార్థులకు అందవలసిన మధ్యాహ్న భోజన పథకం, చిక్కాలు, కోడిగుడ్లు వంటి పుష్టికరమైన ఆహారం అందుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఇక ప్రస్తుత పోటీ వాతావరణంలో ఈ నలభై మంది చిన్నారుల చదువులు పై వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం 75% పాఠశాల హాజరు ఉంటేనే అమ్మ ఒడి ఇస్తామని స్పష్టం గా చెప్పడంతో రెక్కాడితేగాని డొక్కాడని విద్యార్థుల తల్లిదండ్రుల పేద కుటుంబాలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మండల విద్యాశాఖ అధికారి కె ఎస్ వి ప్రసాద్ ను వివరణ కోరగా బండ్లగూడెం గ్రామంలోని విద్యార్థులను దగ్గరలోని పెనుమాల గూడెం పాఠశాలలో నమోదు చేయడం జరిగిందన్నారు. కానీ దూర భావం వల్ల విద్యార్థులు అక్కడికి వెళ్ళటానికి, తల్లిదండ్రులు పంపించడానికి అనాసక్తి చూపుతున్నారు. ఇక గ్రామంలోనే శాశ్వత ప్రాతిపదికన పాఠశాల ఏర్పాటుకు స్థల సేకరణ చేయాలని ఇప్పటికే సూచించడం జరిగిందన్నారు. గతంలో బడిబయట ఉన్న పిల్లలను గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేసి వీరిని నమోదు చేయటం జరిగిందన్నారు. కానీ ప్రస్తుత విద్యా సంవత్సరంలో డ్రాపౌట్స్ లేని కారణంగా ఆ గ్రామంలో ఈ ఏడాది వీరికి పాఠశాల రెన్యువల్ కాలేదని అన్నారు. దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు. ఏదేమైనా జిల్లా కలెక్టర్ మరియు విద్యాశాఖ అధికారి స్పందించి ఈ 40 మంది దళిత పేద కుటుంబం చిన్నారుల చదువుపై దృష్టి సారించి మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement