Saturday, May 25, 2024

వాపును చూసి బలుపు అనుకోవద్దు, తెలంగాణలోనూ కరెంట్ కోతలున్నాయి: అమర్‌నాథ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో వాపును చూసి బలుపు అనుకోవద్దని ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులపై తెలంగాణ మంత్రి కేటీ రామారావు చేసిన వ్యాఖ్యలకు బదులిచ్చారు. ఏపీలో పరిస్థితుల గురించి ఎవరో చెబితే విని మాట్లాడకూడదని, స్వయంగా చూసి మాట్లాడితే బావుంటుందని హితవు పలికారు. నాలుగు బస్సులు కాదు, నాలుగు వందల బస్సులతో వచ్చి చూడాలని కేటీఆర్‌కు ఆహ్వానం పలికారు. ప్రజలకు పాలన చేరువ చేసేందుకు ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు చూడ్డం కోసం రావాలని అన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం తమ రాష్ట్రంలో అమలవుతోందని అమర్‌నాథ్ అన్నారు. ఒక నగరాన్ని చూసి రాష్ట్రం మొత్తం బావుందని అనుకోవడం పొరపాటని వ్యాఖ్యానించారు. కేవలం పెద్దలు బావుంటే సరిపోదని, పేదలు కూడా బావున్నారా లేదా అన్నది కూడా చూడాలని అన్నారు. భాగ్యనగరాన్ని టీఆర్ఎస్ నిర్మించలేదని, ఆ నగరాభివృద్ధిలో ఆంధ్రుల పాత్ర ఎంతో ఉందని అమర్‌నాథ్ గుర్తుచేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో రూ. 1.5 లక్షల కోట్లను నేరుగా ప్రజలకు అందించిన ఘనత తమదని, 32 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ప్రపంచ రికార్డు సృష్టించామని మంత్రి అమర్‌నాథ్ అన్నారు. ఏపీలో గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు చూడమని తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు సూచించారు. విద్యుత్తు కోతల గురించి చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ.. తెలంగాణ సహా దేశంలోని మొత్తం 16 రాష్ట్రాల్లో పవర్ కట్ ఉందన్నారు. ఇది తాత్కాలిక సమస్యేనని, త్వరలోనే అధిగమిస్తామని తెలిపారు. పూర్తి సమాచారం లేకుండా మాట్లాడిన కేటీఆర్, తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐటీ పరంగా హైదరాబాద్‌కు అడ్వాంటేజ్ ఉందని, అయితే ఏపీలో తీరప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామని తెలిరు. తమ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. త్వరలో సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో దావోస్ వెళ్లి పెట్టుబడులు తీసుకొస్తామని తెలిపారు. విశాఖ నగరాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తామన్నారు.

ఎవరితోనూ పొత్తుల్లేవు
ఆంధ్రప్రదేశ్‌లో తదుపరి జరిగే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంటుందా అన్న ప్రశ్నకు బదులిస్తూ తమకు ఎవరితోనూ పొత్తుల్లేవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పునరుజ్జీవం కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ చేసిన సూచనల్లో వైఎస్సార్సీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాలన్న ప్రతిపాదనపై ప్రశ్నించగా, ఆయన ఈ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీదేనని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement