Saturday, May 4, 2024

ప్రశ్నార్థకంగా పొగాకు గిట్టుబాటు ధరలు.. పేరుకే వేలం, సీలింగు ధరలే అమలు

అమరావతి, ఆంధ్రప్రభ : ఆరుగాలం శ్రమించి రక్తాన్ని స్వేదంగా మార్చి పంటలు పండించినా పెట్టుబడులకు తగ్గట్టు గిట్టబాటు ధరలు లభించడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే పొగాకు వేలంలో ఏటా గిట్టుబాటు ధరలు ప్రశ్నార్థకంగా మారాయి. ఐటిసి కీలకపాత్ర పోషించే వేలంలో వ్యాపారులు అంతా సిండికేట్‌ అవుతుంటారు. పేరుకే వేలం తప్ప, సీలింగు ధరలే అమలు అవుతున్నాయి. ఆఖరులో స్వల్పంగా ధరలు పెరుగుతాయి. రాష్ట్రంలో పొగాకు సాగు ఆరంభమైంది. ఈ ఏడాదైనా గిట్టుబాటు ధర వస్తుందా? కనీసం పెట్టుబడులు కూడా వస్తాయా? లేదా? అనే చర్చ రైతుల్లో మొదలైంది. పంటను పెంచాలా? తగ్గించుకుని ఇతర పంటలకు వెళ్లాలా? అనే చర్చ కూడా వారిలో జరుగుతోంది. మరోవైపు పొగాకు బోర్డు కూడా ఇటీవలే వేలం కేంద్రాల్లో సమావేశాలు పెట్టింది. పంటను తగ్గించుకోవాలని రైతులను కోరింది. ఈ ప్రచారం వ్యాపారులకు అనుకూలంగా ఉంటుందే తప్ప, రైతులకు మేలు చేయదు. ఎందుకంటే ఇక్కడ పంటను తగ్గించుకుంటున్నారు. వర్షాలకు పంట సాగు అనుమతించిన దానికన్నా తగ్గుతోంది. రాష్ట్రంలో ఈ ఏడాది 142 మిలియన్‌ కిలోల పంటకు పొగాకు బోర్డు అనుమతి ఇచ్చింది. వ్యాపారుల అవసరాల మేరకు ఈ లక్ష్యం నిర్ణయించింది. నాలుగైదేళ్లుగా పంట అనుమతి కన్నా తగ్గుతున్నందున ఈ ఏడాది కూడా పంట లక్ష్యం బాగానే నిర్ణయించారు. అయితే, బోర్డు ప్రచారాలు రైతుల్లో గందరగోళానికి దారి తీశాయి. పంట తగ్గిస్తేనే ధర వస్తుందని అవగాహన సదస్సుల్లో అధికారులు చెప్పారు. కనీసం లక్ష్యం మేరకైనా పండించాలా? లేదా? అనే సంశయం కూడా రైతుల్లో కలుగుతోంది.

రాష్ట్రంలో పండే పొగాకులో 80 శాతంపైగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనే పండిస్తున్నారు. పొగాకు పంట సాగుకు ఈ నేలలు అనుకూలం. అయితే, కొన్నేళ్లుగా బోర్డు అనుమతించిన స్థాయిలో ఉత్పత్తి జరగడం లేదు. వర్షాలకు పంట దెబ్బతినడం, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో దిగుబడి తగ్గుతోంది. పదేళ్ల క్రితం అదనంగా పండించిన పొగాకును పెనాల్టీతో అమ్ముకోవాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. గతేడాది ఈ రెండు జిల్లాల్లో 80.72 మిలియన్‌ కిలోలకు అనుమతి ఇవ్వగా 76.57 మిలియన్‌ కిలోలు మాత్రమే విక్రయాలు జరిగాయి. 23,962 బ్యారన్‌ల కింద 1.26 లక్షల ఎకరాల్లో పంట సాగు చేశారు. 30,302 మంది రైతులు పొగాకు సాగులో ఉన్నారు. ఏటా పొగాకు వేలంలో గిట్టుబాటు ధరలు ప్రశ్నార్థకంగా మారాయి. ఐటిసి కీలకపాత్ర పోషించే వేలంలో వ్యాపారులు అంతా సిండికేట్‌ అవుతుంటారు. పేరుకే వేలం తప్ప, సీలింగు ధరలే అమలు అవుతున్నాయి. ఆఖరులో స్వల్పంగా ధరలు పెరుగుతాయి. గత వేలంలో కిలో గరిష్ట ధర రూ.186 మీదే చివరి వరకూ జరిగింది. వేలం చివరి రోజున ఒంగోలు-1 కేంద్రంలో కిలో రూ.199 ఇచ్చారు. మీడియం, లోగ్రేడు ధరలను వేలం ఆఖరు దశలోనే కొంతమేరకు పెంచి కొంటుంటారు. వేలం ముగిసే సమయానికి కిలో పొగాకు సగటు ధర రూ.172.49 మాత్రమే దక్కింది. రైతులు మాత్రం కిలోకు కనీసం రూ.200 ఉంటేనే గిట్టుబాటు అవుతుందని చెబుతున్నా కేంద్రప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

- Advertisement -

కర్ణాటకలో పొగాకు పంట బాగా తగ్గింది. అక్కడ ఈ ఏడాది వంద మిలియన్‌ కిలోలకు అనుమతి ఇవ్వగా, 60 మిలియన్లు మాత్రమే దిగుబడి ఉన్నట్లు అంచనా. అందుకే ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. కర్ణాటక మార్కెట్‌ చరిత్రలోనే తొలిసారిగా కిలో గరిష్ట ధర రూ.202 ఇచ్చారు. అక్కడ 40 శాతం పంట తగ్గింది. వ్యాపారులకు అవసరాలు ఉన్నాయి. ఇండెంట్లు ఇస్తున్నారు. అక్కడ పంట తగ్గినందున ఇక్కడ కొనుగోళ్లు ఆశాజనకంగా ఉంటాయని రైతులు భావిస్తున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారకుండా, సీలింగు ధరలు అమలు కాకుండా వేలం సాఫీగా సాగితే రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది. పొగాకు బోర్డు ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. విదేశాల నుంచి సిగరెట్లు దిగుమతి అవుతున్నాయి. ఈ ప్రభావం ఇక్కడ పొగాకు పంటపైనా, మార్కెట్‌పైనా పడుతోంది. అడ్డదారిలో అనేక దేశాల నుంచి సిగరెట్లు వస్తున్నాయి. వీటిని నియంత్రించడంలో కేంద్రప్రభుత్వం చేతులెత్తేసింది. కర్ణాటకలో పొగాకు కొనుగోలు ప్రారంభమైంది. అక్కడ భారీ వర్షాలకు పంట తగ్గింది. బోర్డు అనుమతి కన్నా ఉత్పత్తి తగ్గుతుందని అంచనా. వేలం ఆశాజనకంగానే ప్రారంభమైంది. కిలోకు గరిష్ట ధర రూ.202 పలికింది. కర్ణాటక మార్కెట్‌ ప్రభావం ఇక్కడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వేలం ముగిసే సమయంలో రాష్ట్రంలో వేలం ప్రారంభమవుతుంది. మన రాష్ట్రంలో జనవరి ఆఖరులో మార్కెట్‌కు పొగాకు వస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement