Monday, May 6, 2024

AP: వెంటాడుతున్న తుఫాన్‌ భయం.. దోబూచులాడుతున్న సిత్రాంగ్‌

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రాన్ని తుఫాన్‌ భయం వెంటాడుతోంది. ఉత్తర అండమాన్‌ సముద్రం మరియు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం సగటు- సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్లు ఎత్తువరకు విస్తరించింది .దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఆగ్నేయ మరియు ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి అక్టోబరు 22 ఉదయం నాటికి మధ్య బంగాళా ఖతం మీద వాయుగుండముగా మారే అవకాశం ఉంది. తదుపరి 48 గంటలలో ఈ వాయుగుండము పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికల్ని జారీ చేసింది.

బంగాళాఖాతంలో దిశ మార్చుకుంటున్న సిత్రాంగ్‌ తుఫాన్‌ తీరప్రాంత ప్రజల్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల గుండా తీరం దాటవచ్చన్న సంకేతాల నేపథ్యంలో విపత్తు నిర్వహణ, వాతావరణశాఖలు సంబంధిత జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేస్తున్నాయి. కొద్ది రోజులుగా సిత్రాంగ్‌ దోబూచులాడుతోంది. ఎక్కడ తీరం దాటుతోందనే విషయం స్పష్టం కాలేదని విపత్తునిర్వహణ సంస్థ అధికారులు చెబుతున్నారు. ఈనెల 22 నుంచి పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో గంటకు 45కిమీ నుంచి 65 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.

గత అనుభవాల దృష్ట్యా అక్టోబర్‌లో సంభవించే సిత్రాంగ్‌ తుఫాన్‌ఎలాంటి బీభత్సం సృష్టిస్తోందననే భయం ప్రజల్ని వెంటాడుతోంది. ఆంధ్ర ప్రదేశ్‌ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రానున్న రెండు రోజుల్లో ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement