Friday, May 3, 2024

Jagan’s Animutyalu : చిన్నారులను ఉన్నత విద్యావంతులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం..

చిన్నారులను ఉన్నత విద్యావంతులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో పదోతరగతి, ఇంటర్మీడియట్ చదివి అత్యుత్తమ ప్రతిభ చాటిన విద్యార్ధులను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి అవార్డుల ప్రదానోత్సవంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు విద్యార్థులను సత్కరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. జగనన్న ఆణిముత్యాలు పేరుతో ఈ నెల 12 నుంచి 19 వరకు సత్కారాలు ఉంటాయని చెప్పారు. మట్టి నుంచి గట్టిగా పెరిగిన ఈ మొక్కలు మహావృక్షాలై ప్రపంచానికి అభివృద్ది ఫలాలు అందించాలని కోరారు. ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు, కరిక్యూలమ్ అన్ని మారాయని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల్లో విద్యనభ్యసించి రాష్ట్ర స్థాయిలో టాప్ ర్యాంకులు పొందినవారి నుంచి మిగిలినవారు స్ఫూర్తి పొందాలన్నారు. టెన్త్‌లో టాప్ ర్యాంకులు సాధించిన వారిలో బాలికలు 24, బాలురు 18 మంది ఉన్నారని చెప్పారు. ఆడ పిల్లలను బడికి పంపించాలని తల్లిదండ్రులను ప్రోత్సహించే విధంగా ర్యాంకులు ఉన్నాయన్నారు. ప్రతి విద్యార్థికి ట్యాబ్‌లు అందజేస్తున్నామని చెప్పారు. ప్రతి విద్యార్థికి ఒక డిగ్రీ పట్టా ఉండాలనే తాపత్రయంతో విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలు చేపట్టినట్టుగా తెలిపారు. విద్యలో గుణాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో పరీక్షా ప్రశ్నాపత్రాలు రూపకల్పన చేయనున్నట్టుగా చెప్పారు. అట్టడుగు వర్గాల వారే ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారన్నారు. ప్రభుత్వ స్కూల్స్‌లో చదువుతున్న పేదవర్గాల పిల్లలు ప్రపంచాన్ని ఏలే రోజు త్వరలోనే వస్తుందన్నారు. ఆ రోజును కూడా మనం చూస్తామని చెప్పారు. ఆ స్థాయిలో మార్పులు జరుగుతాయని.. నిరుపేద వర్గాలు పిల్లలు కూడా ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుతారని ధీమా వ్యక్తం చేశారు. విదేశాల్లో సీటు తెచ్చుకునే విద్యార్థులకు ప్రభుత్వం సాయం చేస్తుందని చెప్పారు. ప్రపంచాన్ని మారుస్తున్న టెక్నాలజీ గురించి విద్యార్థులు తెలుసుకోవాలని సూచించారు. ప్రపంచాన్ని శాసించబోయే ఏఐ, ఇతర లాంగ్వేజ్‌లపై విద్యార్థులు దృష్టి పెట్టాలని కోరారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు అడుగులు వేయాలన్నారు. నాయకత్వ లక్షణాలు పెంపొందే విధంగా విద్యనభ్యసించాలని తెలిపారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన సాగుతుందని చెప్పారు. ఐబీ సిలబస్‌ను కూడా తీసుకొస్తామని.. ఆ రోజు దగ్గర్లోనే ఉందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement