Monday, April 29, 2024

అది అవాస్తవం, ఆ ఫండ్స్​ దారిమళ్లలే.. దేవాదాయశాఖ కమిషనర్‌ జవహర్‌లాల్‌

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని ఆలయాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను దారి మల్లిస్తున్నట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని దేవదాయశాఖ కమిషనర్‌ డాక్టర్‌ ఎం.హరి జవహర్‌ లాల్‌ తెలిపారు. 1987 దేవదాయశాఖ చట్టం ప్రకారం రూ.20లక్షలు పైబడి ఆదాయం ఉన్న ఆలయాలు అర్చక సంక్షేమ నిధి, దేవాదాయశాఖ పాలనా నిర్వహణ నిధి , సర్వశ్రేయో నిధి, ఆడిట్‌ ఫీజు చెల్లించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా చట్టబద్ధంగా దేవాదాయశాఖకు చెల్లించాల్సిన నిధుల బకాయిలు పెద్ద ఎత్తున చేరుకున్నట్లు తెలిపారు. ఆలయాల మిగులు నిధులను ప్రభుత్వం దారిమల్లిస్తోందంటూ రాజకీయ పక్షాలు, హిందూ సంస్థల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో కమిషనర్‌ హరి జవహర్‌ లాల్‌ శాఖాపరమైన వివరణ ఇచ్చారు. పేరుకుపోయిన బకాయిలపై విజిలెన్స్‌ విభాగం గుర్తించడంతో 22 మార్లు అప్రమత్తం చేస్తూ నోటీసులను జారీ చేశామన్నారు. సీజీఎఫ్‌, ఈఏపీ, ఆడిట్‌ ఫీజుల బకాయిల వసూలుకు గతంలోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఇది ప్రభుత్వపరంగా నిరంతరం జరిగే ప్రక్రియగా కమిషనర్‌ తెలిపారు.

అధికారుల విచారణలో ఆలయాల మిగులు నిధుల నుంచి సీజీఎఫ్‌, ఈఏపీ, ఆడిట్‌ ఫీజు చెల్లించకుండా బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసినట్లు గుర్తించామన్నారు. దేవదాయశాఖ ఉద్యోగుల జీత భత్యాలు ఈఏపీ నుంచి చెల్లించాల్సి ఉండగా రూ.72 కోట్లు లోటు బడ్జెట్‌ ఉందన్నారు. మరోవైపు ఆలయాల జీర్ణోద్ధరణకు వినియోగించే సీజీఎఫ్‌ నిధుల్లో సైతం లోటు నెలకొందన్నారు. ఇప్పటి వరకు అనుమతులు మంజూరైన పనులకు రూ.160 కోట్లు బకాయిలు ఉండగా అదనంగా మరికొన్ని ప్రతిపాదనలు వస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర ప్రతిపాదనలు కూడా ఉన్న నేపధ్యంలో నిధుల లేమిని దృష్టిలో ఉంచుకొని సీజీఎఫ్‌ నిధుల చెల్లింపు ఆదేశాలు ఇచ్చామన్నారు. పైగా ధూపదీప నైవేద్యాల కింద నెలకు రూ.5వేలు ఇస్తున్న ఆలయాలు ఇప్పటి వరకు 1668 ఉండగా మరో 3,665 ఆలయాలు కూడా గుర్తించినట్లు తెలిపారు.

ఈ నేపధ్యంలో సీజీఎఫ్‌ బకాయిల వసూలు అనివార్యంగా మారిందని పేర్కొన్నారు. అర్చకుల సంక్షేమ పథకాలు సమగ్రంగా అమలు చేయకపోవడానికి నిధుల కొరతే కారణంగా ఆయన తెలిపారు. ఇదే పరిస్థితి మరికొన్నాళ్లు జరిగిన పక్షంలో దేవదాయ వ్యవస్థ మనుగడే దెబ్బతినే ప్రమాదముందని ఆయన పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని బకాయిల చెల్లింపుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సాధారణ ఖాతాల్లో నగదు లభ్యత లేని పక్షంలో ఎఫ్‌డీఆర్‌ చేసిన మిగులు నిధులను మాత్రమే చెల్లించాలని తెలిపామని, ఇదే సమయంలో కేవలం పాత బకాయిలు మాత్రమే చెల్లించాలని స్పష్టం చేశామన్నారు. పాత బకాయిలను కొంతవరకైనా రాబట్టేందుకు ఎఫ్‌డీఆర్‌లుగా మార్చిన మిగులు నిధులను మాత్రమే సంబంధిత ఖాతాలకు మరల్చాలని ఆదేశించాము తప్ప ఆలయాల నిర్వహణ, పునర్మిర్మాణం వంటి వాటికి ఎఫ్‌డీఆర్‌ వడ్డీలే ప్రధానమైన చోట నగదుగా మార్చడం చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసినట్లు హరి జవహర్‌లాల్‌ తెలిపారు. అన్నదానం, శాశ్వత సేవా నిధుల నుంచి చెల్లించాలని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.2లక్షల ఆదాయం పైబడిన ఆలయాల నుంచి బకాయిల చెల్లింపుపై ఒత్తిడి ఉందని జరుగుతున్న ప్రచారంలో కూడా వాస్తవం లేదని హరి జవహర్‌లాల్‌ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement