Monday, May 13, 2024

నెల్లూరులో ఘోర ప్ర‌మాదం.. ఆటోను లారీ ఢీకొట్ట‌డంతో వాగులోకి ప‌ల్టీ.. 12 మంది గ‌ల్లంతు..

సంగం( నెల్లూరు ) : నెల్లూరు జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. దేవాలయంలో నిద్ర చేసేందుకు వెళ్తూ ప్రమాదవ శాత్తు బీరాపేరు వాగులో పడి 12 మంది గల్లంతైన ఘటన గురువారం రాత్రి సంగంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. అదే జిల్లాకు చెందిన ఆత్మకూరు జ్యోతి నగర్‌ ప్రాంతంలో ఓ వ్యక్తి ఇటీవల చనిపోయారు. సాంప్రదాయం ప్రకారం దేవాలయంలో నిద్ర చేసే నిమిత్తమై ఆ కుటుంబానికి చెందిన 12 మంది గురువారం సాయంత్రం ఆటోలో సంగం శివాలయానికి బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో బీరాపేరు బ్రిడ్జిపై వారు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఆటో ఎగిరి వాగులో పడి 12 మంది గల్లంతయ్యారు. ఈ ప్ర‌మాదం నుంచి ఏడుగురు ప్రాణాలతో ఒడ్డుకు చేరుకోగా , మ‌రో అయిదురి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. వీరిలో నాగవళ్లి (14) అనే బాలిక మృతిచెందింది. మిగిలిన నలుగురు ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు..

ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు, బుచ్చి ఎస్సై ప్రసాద్‌రెడ్డి , సంగం ఎస్సై నాగార్జున రెడ్డిలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా , ఒకే కుటుంబానికి చెందిన వారు ప్రమాదానికి గురవడం , ఓ బాలిక మృతి చెందడం , నలుగురు ఆచూకీ తెలియకపోవడంతో ఆ ప్రాంతం బంధువుల రోదనలతో మార్మో గిపోయింది. గురువారం రాత్రి చిమ్మచీకట్లో కూడా పోలీసులు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. ప్రమాదం తరువాత లారీతో సహా డ్రైవర్‌ పరారయ్యాడు. ఆత్మ కూరు ఆర్డీవో చైత్రవర్షిణి ఆ ప్రాంతానికి చేరుకుని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా , సమాచారం అందుకున్న రాష్ట్ర పరిశ్రపమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సత్వరమే స్పందించి 7 మందిని కాపాడిన అధికారులను అభినందించారు. మిగిలిన వారికి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement